ఆస్తి ఇవ్వడం లేదని తండ్రిని చంపిన కొడుకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

మణుగూరు, వెలుగు: ఆస్తి ఇవ్వడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు ఎస్టీ కాలనీలో జరిగింది. మణుగూరు సీఐ సతీశ్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. పగిడేరు ఎస్టీ కాలనీకి చెందిన కుంజా భీమయ్య (56)కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 

మద్యానికి బానిసైన చిన్న కొడుకు రాము కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో కుటుంబసభ్యులతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం సైతం ఆస్తి పంచి ఇవ్వమంటూ తండ్రితో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న రాము పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ భీమయ్యను హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య జోగమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.