కామారెడ్డిలో భారీ సైబర్ మోసం.. రూ. 9 లక్షలు దోచేసిన కేటుగాళ్లు

కామారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. ఢిల్లీ పోలీసులమంటూ ఓ వ్యక్తికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతని నుంచి విడతల వారీగా 9లక్షల 29వేల రూపాయలు దోచేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 కొన్నాళ్ల క్రితం పట్టణానికి చెందిన కిషన్ రావు అనే వ్యక్తికి గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి ఢిల్లీ పోలీసులమంటూ కాల్ వచ్చింది. తనను తాను పోలీస్ బాస్‌గా పరిచయం చేసుకున్న సదరు నేరగాడు.. కిషన్ రావుపై డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులు నమోదైనట్లు బెదిరించాడు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక పోలీస్ బృందం బయలు దేరినట్లు తెలిపాడు. అరెస్ట్ చేయకుండా ఉంటాలంటే కిషన్ రావు ఖాతాల్లో ఉన్న నగదు మొత్తాన్ని తమ అకౌంట్లకు బదిలీ చేయాలని సూచించాడు. కేసు క్లియర్ అయ్యాక నగదు మొత్తాన్నితిరిగి పంపుతామని నమ్మ బలికాడు.

ALSO READ : సైబర్ క్రిమినల్స్ కోసం ఆపరేషన్‌‌ చక్ర 3

అప్పటికే భయపడిపోయిన కిషన్ రావు.. సదరు వ్యక్తి మాటలు నమ్మి విడతల వారీగా 9లక్షల 29వేల రూపాయలు బదిలీ చేశాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి రాకపోవడం, వచ్చిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో బాధితుడు మోసపోయానని గ్రహించి వెంటనే 1930కి కాల్‌‌‌‌ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.