ఫేక్‌‌‌‌ అకౌంట్లు క్రియేట్‌‌‌‌ చేసి .. రూ. 35 లక్షలు కాజేసిన బ్రాంచ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌మాస్టర్‌‌‌‌

  • పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామంలో వెలుగులోకి..
  • విచారణ చేపట్టిన ఆఫీసర్లు

రామగిరి, వెలుగు : ప్రభుత్వరంగ సంస్థలో తమ డబ్బులు సేఫ్‌‌‌‌గా ఉంటాయని భావించి డిపాజిట్‌‌‌‌ చేసిన ఖాతాదారులకు ఓ బ్రాంచ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌మాస్టర్‌‌‌‌ షాక్‌‌‌‌ ఇచ్చింది. ఫేక్‌‌‌‌ అకౌంట్లు సృష్టించి, నకిలీ పాస్‌‌‌‌పుస్తకాలు ఇస్తూ రూ. 35 లక్షలు కాజేసింది. తాను దాచుకున్న డబ్బులు ఇవ్వాలని ఓ వ్యక్తి ఇటీవల పోస్ట్‌‌‌‌ఆఫీస్‌‌‌‌కు వెళ్లి అడగడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో వెలుగుచూసింది. గ్రామ బ్రాంచ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ మెండె హేమ ప్రజల నుంచి ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్లు చేయిస్తోంది. 

ఈ క్రమంలో డబ్బులు డిపాజిట్‌‌‌‌ చేసేందుకు వచ్చిన వారికి ఫేక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ నంబర్లు రాస్తూ, నకిలీ పాస్‌‌‌‌ పుస్తకాలు ఇస్తోంది. గతంలో డబ్బులు డిపాజిట్‌‌‌‌ చేసిన ఓ వ్యక్తి ఇటీవల పోస్ట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు వచ్చి తన డబ్బులు డ్రా చేసుకుంటానని చెప్పడంతో రేపు.. మాపు అంటూ తిప్పించుకుంది. దీంతో సదరు ఖాతాదారుడు సమీపంలోని సెంటనరీ కాలనీ పోస్ట్‌‌‌‌ఆఫీస్‌‌‌‌కు వెళ్లి ఎంక్వైరీ చేయగా అతడికి ఇచ్చిన నంబర్‌‌‌‌పై అసలు అకౌంటే లేదని తేలింది. ఈ విషయాన్ని సెంటినరీ కాలనీ పోస్ట్‌‌‌‌మాస్టర్‌‌‌‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పెద్దపల్లి ఇన్‌‌‌‌చార్జి ఐపీవో మోహన్‌‌‌‌ శనివారం బేగంపేట బ్రాంచ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ను సందర్శించి పాస్‌‌‌‌ పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ టైంలో గ్రామానికి చెందిన సుమారు 300 మంది ఖాతాదారులు పోస్ట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వద్దకు వచ్చి తమ పాస్‌‌‌‌బుక్​ చూపించారు. 

ఇందులో38 పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌ నకిలీవని గుర్తించారు. సోమవారం మరోసారి ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆఫీసర్లు తెలిపారు. మరో వైపు ప్రభుత్వ సంస్థలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని డిపాజిట్లు చేశామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని, మా డబ్బులు ఎవరు ఇస్తారంటూ ఖాతాదారులు సెంటినరీ కాలనీ పోస్ట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ వద్ద ఆందోళనకు దిగారు. బ్రాంచ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌మాస్టర్‌‌‌‌పై చర్యలు తీసుకొని, డిపాజిట్‌‌‌‌దారులకు న్యాయం జరిగేలా చూస్తామని పోస్ట్‌‌‌‌మాస్టర్‌‌‌‌, విచారణ అధికారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.