లాయర్ల ఎన్నికలు
టైటిల్ : మామ్లా లీగల్ హై
డైరెక్షన్ : రాహుల్ పాండే
కాస్ట్ : రవి కిషన్, నైలా గ్రేవాల్, నిధి బిష్త్, అనత్ జోషి, యశ్పాల్ శర్మ, అమిత్ విక్రమ్ పాండే
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
త్యాగి (రవికిషన్) ఢిల్లీ పరిధిలోని ‘పట్ పర్ గంజ్’ జిల్లా కోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తుంటాడు. అతని తండ్రి గతంలో జడ్జిగా పనిచేసేవాడు. కానీ.. త్యాగి అతని తండ్రి పేరు వాడకుండా సొంతంగా ఎదగాలి అనుకుంటాడు. కానీ.. అందుకు ఎంచుకునే మార్గమే సరిగ్గా ఉండదు. అదే కోర్టులో పనిచేసే చాలామంది లాయర్లు కేసులు లేక వెయిట్ చేస్తుంటారు. కోర్టు దగ్గరికి ఎవరైనా వస్తే చాలు వెంటనే వాళ్ల దగ్గరికి కేసు కోసం పరిగెత్తుతుంటారు. అదే కోర్టు ఆవరణలో ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో ఒక టేబుల్ వేసుకుని కేసుల కోసం చూస్తుంటుంది సుజాత దీదీ (నిధి బిష్త్ ). కనీసం ఛాంబర్‌కి మారడానికి సరిపడా డబ్బు సంపాదించలేకపోతుంది. అలాంటి కోర్టుకు అప్పుడే లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనన్య ష్రాఫ్ (నైలా గ్రేవాల్) వస్తుంది. అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతుంది.
ఎలాగైనా మొదటి కేసు టేకప్ చేచాలి. గెలవాలి అనుకుంటుంది. బాగా డబ్బున్న ఫ్యామిలీ ఆమెది. పైగా ఆమె పూర్వీకులు కూడా లాయర్లుగా పనిచేసినవాళ్లే. కాబట్టి అమెని అక్కడి వాళ్లంతా గౌరవిస్తారు. ఆ టైంలోనే ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతాయి. త్యాగి ఆ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంటాడు. అనన్యకి కేసు దొరుకుతుందా? బార్ అసోసియేషన్ ఎన్నికల్లో త్యాగి గెలుస్తాడా? సుజాత ఛాంబర్ కల నిజమవుతుందా? అనేది తర్వాతి కథ. ఈ సిరీస్‌లో కావాల్సినంత కామెడీ ఉంది. కానీ.. కథలో ట్విస్ట్‌లు మాత్రం కనిపించవు. రవికిషన్, నైలా గ్రేవాల్ యాక్టింగ్ బాగుంది. కథ నెమ్మదిగా సాగడం.. ఎక్కువ భాగం కోర్టు దగ్గరే ఉండడం వల్ల కొంచెం విసుగు తెప్పిస్తుంది.
గెలుపు కోసం కలిశారు
టైటిల్ : బ్లూ స్టార్
డైరెక్షన్ : ఎస్. జయకుమార్
కాస్ట్ : అశోక్ సెల్వన్ , శంతను భాగ్యరాజ్ , కీర్తి పాండియన్ , పృథ్వీరాజన్, భగవతి పెరుమాళ్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ కథ చెన్నై శివారు ప్రాంతమైన అరక్కోణంలోని రెండు యూత్ గ్రూప్‌ల మధ్య జరుగుతుంది. వాటిలో ఒక గ్రూప్‌ని కాలనీ ప్రజలు (కాలనీ పసంగ) అని పిలుస్తారు. మరో గ్రూప్‌ని గ్రామస్తులు (ఊర్ తేరు పసంగ) అని పిలుస్తారు. ఈ రెండు గ్రూప్‌లు అణగారిన వర్గాలకు చెందినవే. మొదటి గ్రూప్ లీడర్ రంజిత్ (అశోక్ సెల్వన్) కాలనీ క్రికెట్ జట్టు ‘బ్లూ స్టార్’కు నాయకత్వం వహిస్తుంటాడు. రెండో గ్రూప్ లీడర్ రాజేష్ (శాంతను భాగ్యరాజ్) ‘ఆల్ఫా బాయ్స్’ టీంకి కెప్టెన్‌గా ఉంటాడు. ఈ రెండు జట్ల మధ్య పోటీలతో పాటు ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి.
అలాంటి టైంలో ధనికులు కొందరు ఈ రెండు గ్రూపులను అణచివేయాలని చూస్తారు. కనీసం ప్లే గ్రౌండ్‌కి కూడా రానివ్వరు. అప్పుడు ఈ రెండు గ్రూపులు ఒక్కటై వాళ్లను ఎలా ఎదుర్కొన్నాయి అనేదే కథ. సాధారణంగా పా రంజింత్ తీసే అన్ని సినిమాల్లోలాగే ఇందులో కూడా అణగారిన వర్గాల వాళ్లు పడే కష్టాలను చూపించారు. పా రంజిత్ నిర్మించిన ఈ సినిమాలో శాంతను, అశోక్ సెల్వన్.. ఇద్దరూ పోటీపడి నటించారు. కాకపోతే ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు రావడం వల్ల కథలో కొత్తదనం కనిపించదు.
వెనక్కి వెళ్లొచ్చు
టైటిల్ : 57 సెకన్లు
డైరెక్షన్ : రస్టీ కుండీఫ్
కాస్ట్ : జోష్ హాచర్సన్, మోర్గాన్ ఫ్రీమాన్, లోవీ సిమోన్, గ్రెగ్ జర్మన్, బెవిన్ బ్రూ, సమ్మి రోటిబి, మార్క్ జాకబ్సన్, డీఏ ఒబాహోర్, డేవిడ్ కల్లావే, ఏజే రోమ్, కెన్నెత్ కింట్ బ్రయాన్, మాథ్యూ జేసన్ క్వెర్న్, మార్కస్ బ్రౌన్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఫ్రాంక్లిన్ (జోష్ హాచర్సన్) ఒక టెక్ బ్లాగర్. టెక్ గురుగా పేరున్న అంటోన్ బర్రెల్ (మోర్గాన్ ఫ్రీమాన్)ని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్తాడు. కానీ.. అదే టైంలో బర్రెల్‌ని ఎవరో చంపడానికి వస్తారు. దాంతో ఫ్రాంక్లిన్ బర్రెల్‌ని కాపాడతాడు. ఆ క్రమంలో అతనికి ఒక మిస్టీరియస్ రింగ్ దొరుకుతుంది. ఆ రింగ్‌ని ముట్టుకుంటే 57 సెకన్లు టైం వెనక్కి వెళ్తుంది. అదే టైంలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన నాణ్యత లేని ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల అతని కవల సోదరి చనిపోతుంది. దాంతో ఆ ఉంగరం సాయంతో తన సోదరి చావుకు కారణమైన ఫార్మాస్యూటికల్ కంపెనీపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు.
ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ. లెజెండ్రీ యాక్టర్ మోర్గాన్ ఫ్రీమాన్ ఉన్నాడంటే సినిమాలో ఏదో ఒక కొత్త విషయం ఉందని అందరూ అనుకుంటారు. కానీ.. ఈ సినిమా విషయంలో అలాంటి అంచనాలు పెట్టుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన రోల్‌కు అంత స్కోప్ లేదు. కథలో కూడా బలం లేదు. ఫ్రీమాన్ యాక్టింగ్ మాత్రం ఆకట్టుకుంది.