గేర్ మార్చిన మల్లు.. పక్కా వ్యూహంతోనే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు గుడ్​ బై

  • ఎంపీ టికెట్​ రేస్​లో ఉన్నానని ప్రకటన
  • మద్దతు కూడగడుతున్న మాజీ ఎంపీ
  • డిఫెన్స్​లో ఆశావహులు

నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్​ ఎస్సీ నియోజకవర్గం ఎంపీ టికెట్​ ఆశిస్తున్న ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్న టైంలో మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి ఒక్కసారిగా గేర్​ మార్చారు. టికెట్​ ఇచ్చేందుకు తన పదవి అడ్డు వస్తుందని భావించి పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చిన తర్వాత నాగర్​కర్నూల్​ నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్​ ఇవ్వరనే ప్రచారం నేపథ్యంలో పోస్టును వదులుకునేందుకు సిద్ధపడ్డారు. జడ్చర్ల ప్రెస్​మీట్ లో పదవికి రిజైన్​ చేస్తున్నట్లు ప్రకటించారు. మల్లు రవికి టికెట్​ ఇవ్వాలని వివిధ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్​ నాయకులు కూడా డిమాండ్​ చేసేలా మద్దతు కూడగడుతున్నారు.

టికెట్​ కోసం పోటాపోటీ..

నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, పార్టీ టికెట్​ ఆశిస్తున్న మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథం తదితరులు పాల్గొంటున్నారు. ​ఇక్కడి నుంచి తాము పోటీ చేస్తామని మాజీ ఎంపీలు మల్లు రవి, మంద జగన్నాథం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్​లో మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మినహా మిగిలిన వారంతా మొదటిసారి ఎన్నికయ్యారు. మాజీ ఎంపీ మల్లురవికి నాగర్​కర్నూల్, కల్వకుర్లి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లోని క్యాడర్​తో మంచి సంబంధాలున్నాయి. 

కాంగ్రెస్​ హయాంలో డీకే అరుణ మంత్రిగా పని చేసిన సమయంలో ఆ ప్రాంతంలోనూ పరిచయాలు పెంచుకున్నారు. మల్లు రవి తర్వాత ఆ స్థాయిలో పరిచయాలు, పట్టున్న నేతగా మాజీ ఎంపీ మంద జగన్నాథంకు పేరుంది. నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ ఇన్​చార్జిగా   మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, గెలుపోటములు, అభ్యర్థిత్వంపై సర్వే అనంతరం అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్​ పార్లమెంట్​ ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్​ టికెట్ రేస్​ ఇంట్రెస్టింగ్​గా మారింది.

గెలుపుపై ధీమాతోనే.. 

నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు  గెలిచారు. 5 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేల మెజార్టీ 1.20 లక్షల పైనే ఉంది. ప్రజలు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్​ మూడ్​లో ఉండడం, మహిళలకు ఉచిత బస్​ ప్రయాణం,త్వరలో 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, రూ.500కే గ్యాస్​ సిలిండర్​ వంటి అంశాలు ప్లస్​ అవుతాయని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, పార్టీ క్యాడర్​ బలంగా ఉండడం కలిసొస్తుందనే అంచనాలున్నాయి. దీంతో ఎంపీగా భారీ మెజార్టీతో గెలవగలమనే ధీమా ఆశావహుల్లో ఉంది.

టికెట్​కోసం పదవికి గుడ్​ బై..

కేబినెట్​ హోదాలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితుడైన మల్లు రవి నెల దాటకముందే ఆ పోస్టుకు రిజైన్​ చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో నాగర్​కర్నూల్​ నుంచి బరిలో ఉండడం పక్కా అని తేల్చేశారు. గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం, ఆ తర్వాత ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఢిల్లీలో పరిచయాలు తనకు కలిసి వస్తాయనే అంచనాలో ఉన్నారు. 1991,1998లో రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ​ 

పార్టీనే నమ్ముకున్న ఆయన  ఇప్పటి వరకు అందులోనే కొనసాగుతున్నారు. వైఎస్​ హయాంలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పని చేశారు. 2004,2009 పార్లమెంట్​ ఎన్నికల్లో మల్లు రవి పార్టీ టికెట్ ఆశించినా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి టికెట్​ ఇచ్చిన వారి కోసం పని చేశారు.2019 ఎన్నికల్లో నాగర్​కర్నూల్​ నుంచి పోటీ చేసేందుకు లీడర్లు ముందుకు రాని సమయంలో పోటీ చేశారు. ఇవన్నీ గుర్తు చేస్తున్న అనుచరులు, సీనియర్లు ఈ సారి మల్లుకే టికెట్​ ఇవ్వాలని డిమాండ్  చేస్తున్నారు.