సమాచారం లేకుండా ఎట్లొస్తరు?.. బ్యాంకర్లపై మల్లు రవి ఫైర్

  • దిశ కమిటీలో బ్యాంకర్లపై మల్లు రవి ఫైర్​
  • పది గంటలపాటు సాగిన సమావేశం 
  • సంక్షేమ పథకాలపై చర్చ

నాగర్​కర్నూల్, వెలుగు : సమాచారం లేకుండా ‘దిశ కమిటీ’ సమావేశానికి వచ్చిన బ్యాంకర్లపై కమిటీ చైర్మన్​, ఎంపీ మల్లు రవి అగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కలెక్టరేట్​లోని ‘జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ’ (దిశ) సమావేశం  ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగింది.  దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది.  బ్యాకర్లు సమాచారం లేకుండా రావడంతో తదుపరి సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు.   బ్యాంకర్లు అన్ని యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాకు మంజూరైన యూనిట్లు,పెండింగ్ వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన రైతులు, యువత, చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వాలన్నారు.

అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందే అని  చెప్పారు.  సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జిల్లాలో జరుగుతున్న  పనులు, సంక్షేమ పథకాలపై సమీక్షించారు. జిల్లాను దేశంలోనే మోడల్ గా రూపొందించేందుకు ప్రజా ప్రతి నిధులు,అధికారులు కృషి చేయాలని   కోరారు. జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న గురుకుల పాఠశాలలో వసతులపై ఆరా తీశారు. క్వాలిటీ విద్యను అందిస్తామనే భరోసా కల్పించాలన్నారు.

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో డాక్టర్ల ఖాళీలు, మందుల కొరత, రోగుల వివరాలు తెలుసుకున్నారు. అర్హులై ఉండి రుణమాఫీ కానీ రైతుల వివరాలను తెలుసుకున్నారు. రుణమాఫీ వివరాలు రైతులకు అందజేసి తప్పుడు సమాచారం ప్రచారం కాకుండా చూడాలన్నారు. తమది రైతు   ప్రభుత్వమన్నారు. జిల్లాలో వరి పంట,ఇతర పంటల సాగు వివరాలు తెలుసుకున్నారు.

శిశు సంక్షేమం, అంగన్వాడీల పనితీరు, ఆరోగ్య లక్ష్మి, వికలాంగుల సంక్షేమం అంశాలపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ, తపాలా శాఖ, పౌరసరఫరాల శాఖ, మిషన్ భగీరథ శాఖలపై సమీక్ష 
నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పథకాల అమలులో సమస్యలను నివేదికల రూపంలో తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. రెసిడెన్షియల్ స్కూల్స్​లో ఆర్.ఓ ప్లాంట్, టాయిలెట్స్, డోర్స్, కిటికీల ఏర్పాటుకై 15 రోజుల్లో రిపోర్ట్​ ఇవ్వాలన్నారు.

ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పలు సమస్యలను దిశ కమిటీ చైర్మన్​ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ , కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ళ రాజేశ్​ రెడ్డి, డా. వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు సీతా రామారావు, దేవ సహాయం, డీఆర్​డీఏపీఓ చిన్న ఓబులేశ్​ అన్ని శాఖల అధికారులు
హాజరయ్యారు.