భూకంప జోన్​లో మల్లన్న సాగర్

గతంలో ప్రాణహిత-–చేవెళ్ళ పథకంలో భాగంగా మెదక్ జిల్లాలో (ఇప్పటి సిద్దిపేట జిల్లా) 1.50 టీఎంసీల సామర్థ్యంతో తడకపల్లి రిజర్వాయర్​ను ప్రతిపాదించారు. ఆ సామర్థ్యం చాలదని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన రిజర్వాయర్ ప్రదేశానికి కొంత ఎగువన మల్లన్నసాగర్ రిజర్వాయర్​ను చేపట్టారు. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. 50 టీఎంసీల నిలువ సామర్థ్యం అంటే, హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ వద్దనున్న హుస్సేన్​ సాగర్ జలాశయం నిలువకు సుమారు 60 రెట్లు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్ట పొడవు 22.60  కిలోమీటర్లు. కట్ట ఎత్తు 40 మీటర్ల నుంచి 60 మీటర్లు ఉంటుంది. అంటే 15 అంతస్తుల భవనం ఎత్తుతో  సమానం. ఈ రిజర్వాయర్​తో సుమారు 20,000 ఎకరాల భూమి నీట మునిగింది. అనేక గ్రామాలు జలాశయంలో మునిగాయి. వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. 

కనీస జాగ్రత్తలు పాటించలె

మల్లన్నసాగర్ జలాశయం దాని అనుబంధ రిజర్వాయర్ల కింద తలపెట్టిన ఆయకట్టు 10.30 లక్షల ఎకరాలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు 19.63 లక్షల ఎకరాలు. అంటే ఒక్క మల్లన్నసాగర్ నుంచే మొత్తం కాళేశ్వరం ఆయకట్టులో 52.50% ఆయకట్టుకు నీరందాలి. ఈ రిజర్వాయర్ నిర్మాణ ఖర్చు రూ.6126 కోట్లు. ఇంతటి కీలకమైన, భారీ ఖర్చుతో కూడుకున్న రిజర్వాయర్ నిర్మాణం అత్యంత జాగ్రత్తగా జరగాలి. కానీ, జరిగిందేమిటి? భారీ రిజర్వాయర్లకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకుండా, హడావుడిగా ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. 

దీంతో మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన లక్షలాది ప్రజల ప్రాణాలు ముప్పులో పడ్డాయి. ఇదెలాగో చూద్దాం.. మల్లన్నసాగర్ నిర్మాణం అక్టోబర్-, డిసెంబర్, 2017 లో మొదలైంది. ఈ రిజర్వాయర్ డిజైన్లు, డ్రాయింగులు తయారు చేసింది తెలంగాణ ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. ప్రాథమిక డ్రాయింగులకు  ఆమోదం తెలుపుతూ మల్లన్నసాగర్ నిర్మాణ ప్రదేశంలో నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (ఎన్‌‌‌‌జి‌‌ఆర్‌‌ఐ)  లాంటి   పేరెన్నికగన్న సంస్థలతో భూకంప పరిశోధనలు చేయించాలని ఒక నిబంధన పెట్టింది. 

దీనికి అనుగుణంగా ప్రభుత్వం నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్​కు డిసెంబర్, 2016, ఆగస్ట్, 2017, అక్టోబర్, 2017 లో లేఖలు రాసింది. కానీ,  ఎన్‌‌జి‌‌ఆర్‌‌ఐ నివేదిక కోసం ఆగకుండా మల్లన్నసాగర్ పనులు డిసెంబర్, 2017 లో కాంట్రాక్టర్ కు అప్పగించింది. 
 
భారీ లీనమేంట్లు ఉన్నా పట్టించుకోలే

మార్చి, 2018లో ఎన్‌‌జి‌‌ఆర్‌‌ఐ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో అనేక కీలకమైన అంశాలను ఎన్‌‌జి‌‌ఆర్‌‌ఐ ప్రస్తావించింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశంలో భూగర్భంలో మూడు జతల భారీ లీనమెంట్లు (లీనమెంట్లు అంటే భూగర్భంలో భారీ పగుళ్లు) ఉన్నాయనీ.. వీటివల్ల మల్లన్నసాగర్​కు ప్రమాదం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. 

ఈ లీనమేంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయి భూకంప/భూగర్భ పరిశోధనలు చేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోకుండా మల్లన్నసాగర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. CDO విడుదల చేసిన డ్రాయింగులన్నింటిలోనూ భూకంప పరిశోధనలను చేయించాలని సూచించింది.  డ్రాయింగులను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) లాంటి నిపుణులతో వెట్టింగ్ చేయించాలని కోరింది. ఇలా డ్రాయింగులను వెట్టింగ్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది.   

కాగ్​ సైతం ప్రస్తావించింది

పై అంశాన్ని కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను భూకంపాలు తట్టుకునే విధంగా డిజైన్/నిర్మాణం  చేశారనీ, పైగా CWPRS అధ్వర్యంలో సూడో-స్టాటిక్ భూకంప విశ్లేషణ చేయించామనీ, ఈ విశ్లేషణలో రిజర్వాయర్ సురక్షితమని తేలిందని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం సరైంది కాదని కాగ్ పేర్కొన్నది. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసినవి NGRI సూచించిన పరీక్షలు కావు. భూకంప పరీక్షలు అక్కడ భూగర్భంలో ఉన్న భారీ పగుళ్లను దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఇక్కడ ఇది జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ భారీ లీనమేంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయి భూకంప పరీక్షలను ప్రభుత్వం చేయించాలి అని కాగ్ సూచన చేసింది. లేకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది. 

రీ‑ఇంజనీరింగ్​ భారీ తప్పిదం అని జేఏసీ చెప్పినా పట్టించుకోలె

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీ ఇంజనీరింగ్ - భారీ ఇంజనీరింగ్ తప్పిదం’ అనే పుస్తకాన్ని ఈ వ్యాస రచయిత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి‌‌జే‌‌ఏ‌‌సి) తరపున 2018లోనే ప్రచురించారు. ఇందులో మల్లన్నసాగర్ భూగర్భంలో ఉన్న భారీ లీనమేంట్ల గురించి విపులంగా వివరిస్తూ, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సూచనలను పెడచెవిన పెట్టడమే కాకుండా, కొందరు ప్రభుత్వ పెద్దలు ‘మల్లన్నసాగర్ ఉన్న ప్రదేశంలో గట్టి గ్రానైట్ రాయి ఉందనీ, పగుళ్ళ ముచ్చటే లేదనీ, ఇవన్నీ అవాస్తవాలే’నని బదులిచ్చారు. 

ఇప్పుడు టీ‌‌జే‌‌ఏ‌‌సీ చెప్పిందంతా నిజమేనని తేలింది. అప్పట్లో ఈ వివరాలన్నీ టీ‌‌జే‌‌ఏ‌‌సీ కొందరు సైంటిస్టులతో చర్చించి పై విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం ఆ సైంటిస్టులు చెబుతున్నదేంటంటే, మల్లన్నసాగర్ ఎప్పటికీ 50 టీఎంసీల నీరు నింపడానికి యోగ్యం కాదని, ప్రస్తుతం నింపిన 10-,15 టీఎంసీల నీటికే ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతాలలో ‘బాయిలింగ్’ (భూపొరలనుంచి ఉపరితలానికి నీరు తన్నుకు రావడం) గమనించామని, కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఈ రిజర్వాయర్ ను 10 టీఎంసీలకు మించి నింపకూడదనీ హెచ్చరిస్తున్నారు. 10 టీఎంసీల నీటికి కూడా భూకంప ప్రమాదాన్ని తోసిపుచ్చలేమనీ, కాబట్టి లీనమేంట్లను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలను ప్రభుత్వం తక్షణం చేపట్టాలని ఈ సైంటిస్టులు సూచిస్తున్నారు. 
(ఈ వ్యాసం మిగతా భాగం రేపు)

మల్లన్నసాగర్ కట్ట తెగితే ఏమవుతుంది

దురదృష్టవశాత్తూ మల్లన్నసాగర్ కట్టతెగితే? క్షణాల్లో రిజర్వాయర్​లోని నీరు బయటకు తన్నుకు వస్తుంది. రిజర్వాయర్​ను ఆనుకుని ఉన్న కూడలేరు వాగు ప్రవాహమార్గం ద్వారా ఈ నీరు 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ముంచేస్తూ ఎగువ మానేరు రిజర్వాయర్ చేరుతుంది. ఎగువ మానేరు రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 2.20 టీఎంసీలు మాత్రమే. 50 టీఎంసీల నీరు వేగంగా వచ్చినప్పుడు, ఎగువ మానేరు డ్యామ్ కొట్టుకు పోతుంది. 

ఆ నీరంతా మానేరు నదీ మార్గాన ప్రవహించి మొదట మధ్య మానేరు రిజర్వాయర్​ను, ఆ తరువాత దిగువ మానేరు రిజర్వాయర్​నూ పునాదులతో పెకిలించి దారి పొడవునా బీభత్సం సృష్టిస్తూ, లక్షలాది మంది ప్రజల ప్రాణాలను, వేల కోట్ల రూపాయల ఆస్తులను ముంచెత్తుతూ గోదావరి నదిని చేరుతుంది. 50 టీఎంసీల నీరు గంటల వ్యవధిలో గోదావరి నదిని చేరడమంటే మామూలు విషయం కాదు. గోదావరిని కలిసిన తరువాత కూడా ఈ ప్రవాహం సముద్రంలో కలిసే దాకా ఈ విధ్వంసం కొనసాగుతుంది.  

ప్రజల ప్రాణాల భద్రతనూ పట్టించుకోలె

మల్లన్నసాగర్ ఉదంతంతో గత పాలకులకు  ప్రజల ప్రాణాలపట్ల ఏమాత్రం పట్టింపు లేదన్న విష యం స్పష్టం అవుతుంది. ఇప్పుడు సమగ్ర భూకంప పరీక్షల్లో ప్రమాదం ఉందని తేలితే? ఇప్పటికే నిం పిన 10,15 టీఎంసీల నీటికే ప్రమాదం జరిగి ఉంటే? పోయే లక్షలాది అమాయక ప్రాణాలకు బాధ్యత ఎవరిది? అంతే కాకుండా వందలాది కుటుంబాలను భూసేకర ణ పేరుతో రోడ్డున పడేయడమే కాకుండా వేలకోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టుకాదా? అదృష్ట వశాత్తూ పరీక్షల్లో ప్రమాదం లేదని తేలితే? అప్పటి పాలకులు తీసుకున్న నిర్ణయం సరైనదైపోతుం దా?  ప్రజల ప్రాణాలతో, ప్రజా ధనంతో జూదం ఆడే హక్కు పాలకులకు ఎవరిచ్చారు? ఇంతటి బాధ్య తా రాహిత్యంతో వ్యవహరించిన వారిపై కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో పైన పేర్కొన్న లోపాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ఏటా కూలుతున్న ప్రధాన కాలువలు, పెచ్చులూడుతున్న సొరంగాలు, మొరాయిస్తున్న పంపులు.. కోకొల్లలు. కాబట్టి మేడిగడ్డ సమస్య చిన్నదీ కాదు. అలాగే సమస్య మేడిగడ్డకు పరిమితమూ కాదు..సమస్య మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుది.. రెండు పిల్లర్లు రిపేరు చేస్తే సమస్య సమసిపోతుందనే ప్రచారం ప్రధాన సమస్యను పక్కదోవపట్టించడానికే.