ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలను సక్సెస్​ చేయాలి : ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు : ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను సక్సెస్​ చేయాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు ఆఫీసర్లను ఆదేశించారు. తాగునీరు, శానిటేషన్, మరుగుదొడ్లు, ఆరోగ్య శిబిరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ నెల 12 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈవో అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కుడా చైర్మన్​ ఇనుగాల వెంకట్రామ్​రెడ్డి, టెస్కాబ్​ చైర్మన్​ మార్నేని రవీందర్​ రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్యతో కలిసి మంగళవారం జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే రివ్యూ నిర్వహించారు.

ముందుగా వారు స్వామివారిని దర్శించుకుని లీడర్లు, ఆఫీసర్లంతా ప్రత్యేక పూజలు చేశారు. పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద రూ.17 లక్షలతో నిర్మించిన స్వాగత తోరణాన్ని ప్రారంభించారు. సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జాతర సమయంలో క్యూ లైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. జాతరకు ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత ఆఫీసర్లకు సూచించారు.

రోడ్ల రిపేర్లు చేయాలన్నారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. జాగ్రత్త చర్యల్లో భాగంగా తగినన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.  జాతర లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మినీ వెహికల్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఆలయంలో  శాశ్వత నిర్మాణాలకు నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖతో వీడియో కాల్​ లో మాట్లాడి ఐలోని అభివృద్ధికి రూ.10 కోట్లు కావాలని కోరారు. అనంతరం జాతర వాల్​పోస్టర్లను రిలీజ్ చేశారు. సమావేశంలో డీసీపీ రవీందర్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, ఏసీపీ తిరుపతి, అధికారులు పాల్గొన్నారు.

సమన్వయంతో పని చేయాలి..

ఐనవోలు జాతరకు ఏర్పాట్ల విషయంలో  రాజీపడొద్దని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆఫీసర్లను ఆదేశించారు. జాతర ఏర్పాట్ల రివ్యూలో భాగంగా ఆమె వర్చువల్​గా మాట్లాడారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. మహిళలు, బాలింతలకు సాయం చేయడానికి అంగన్​వాడీ, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.