ఊరిస్తున్న పదవులు

  • నామినేటెడ్​ పోస్టుల కోసం ఎదురు చూపులు
  • డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికో !

నాగర్​ కర్నూల్​, వెలుగు : కాంగ్రెస్​   ప్రభుత్వంలో  జిల్లాలోని  ముఖ్య నాయకులు నామినేటెడ్​  పదవులపై ఆశలు పెంచుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్​ కమిటీలు, దేవాలయ కమిటీలలో తమకు ప్రాతినిథ్యం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా ఏర్పడిన నాటి  నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ స్థానంలో కొత్తవారిని నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుల కోసం హైకమాండ్​  వెతుకుతోంది.  . 

ఈ పగ్గాలు ఎవరికో

జిల్లాలో నాలుగు మార్కెట్​ కమిటీలు ఉండగా మూడు రోజుల క్రితం అచ్చంపేట మార్కెట్​ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. నాగర్​కర్నూల్​, కొల్లాపూర్, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్​ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించాల్సి ఉంది.జిల్లా గ్రంథాలయ సంస్థకు చైర్మన్, సభ్యులను ఏర్పాటు చేయాల్సి ఉంది. 
మద్దిమడుగు, ఉమా మహేశ్వరం దేవాలయాలకు చైర్మన్, పాలక సభ్యుల​ నియామకం జరిగింది. జిల్లాలోని ఇతర ప్రముఖ దేవాలయాలకు పాలకమండళ్లను నియమించాలి. 

ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తుండటంతో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నామినేటెడ్.పార్టీ పదవులు భర్తీ చేసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. 

కొత్త సారథి కోసం 

పీసీసీ కొత్త సారథి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్​ కమిటీ కొత్త కార్యవర్గం, అధ్యక్షుడి మార్పు జరిగితే పార్టీ పరంగా పదవులు దక్కించుకోవడానికి సీనియర్లు పోటీ పడుతున్నారు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ ఉండటం, పార్టీ, అభివృద్ధి కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడి హోదాలో పాల్గొనేందుకు ప్రొటోకాల్​ ఉంటుంది.  ఈ పదవికోసం నాలుగు నియోజకవర్గాల్లో   ఒకరిద్దరి పేర్లు చర్చకు వస్తున్నాయి.  జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా అచ్చంపేటకు చెందిన ఓ వ్యక్తి పేరు వినిపిస్తోంది.  త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందనే సమాచారం.

వ్యవసాయ మార్కెట్లపైనా నేతల చూపులు

నాగర్​ కర్నూల్​,కొల్లాపూర్​,కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్​ కమిటీలకు పాలకవర్గాన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడు చైర్​పర్సన్​ పోస్టులు మహిళలకు రిజర్వ్​ కావడంతో పార్టీలోని సీనియర్​ నేతల కుటుంబాల నుంచి  ఎంపిక జరగవచ్చని సమాచారం. దీంతో  నేతలు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. నాగర్​ కర్నూల్​ మార్కెట్​ కమిటీ ఓసి మహిళకు రిజర్వ్​ చేశారు. తెల్కపల్లి, బిజినేపల్లి మండల నేతలు తమకే మార్కెట్​ చైర్మన్​ పదవి ఇవ్వాలని పట్టు బడుతున్నారు.

కొల్లాపూర్​ మార్కెట్​ చైర్మన్​ పదవిలో మంత్రి జూపల్లి ప్రధాన అనుచరుల్లో  ఎవరికిస్తారనే ఆసక్తి నెలకొంది. కల్వకుర్తి మార్కెట్​ కమిటీ చైర్మన్​ బీసీ మహిళకు కేటాయించారు. కల్వకుర్తి, వెల్డండ మండలాలకు చెందిన నాయకులు చైర్మన్​ పదవి కోసం   ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి సొంత మండలం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్​ పరిధిలో ఉంటుంది. 

రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్​ అధికారంలో లే కపోవడంతో నేతలు పదవులకు దూరమయ్యారు. ఇప్పుడు తమ ప్రభుత్వం రావడంతో  నామినేటెడ్​ పోస్టుల్లో  తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు.  గ్రామ పంచాయతీ,స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీ కోసం పని చేసిన సీనియర్లు, అసెంబ్లీ,పార్లమెంట్​ ఎన్నికలలో బీఆర్​ఎస్​,బిజెపిలకు గట్టిపోటీ ఇచ్చిన నాయకులు తమకు నామినేటెడ్​ పోస్టులు దక్కుతాయనే భరోసాతో ఉన్నారు.