వనౌటు ఐలాండ్​లో భూకంపం

పోర్ట్ విలా: పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపం వనౌటులో ఈ విపత్తు చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. వనౌటు రాజధాని పోర్ట్ విలాకు పశ్చిమాన 30 కి.మీ. దూరంలో, 57 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పలుమార్లు ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం ధాటికి పలుచోట్ల చెట్లు, కొండచరియలు,  పెద్ద పెద్ద బిల్డింగులు నేలకూలాయి. 

పోర్ట్‌‌ విలాలోని యూఎస్‌‌, యూకే, ఫ్రాన్స్‌‌ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న భవనం ధ్వంసమైంది. దీంతో తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆయా ఎంబసీలు ప్రకటించాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు గాయపడినట్లు సమాచారం. భూకంపం సమయంలో ప్రజలు భయంతో ఇండ్లల్లో నుంచి బయటకు పరుగెడుతున్న  వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌‌ అయ్యాయి.