టెన్త్​ పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు

విద్యారంగం అభివృద్ధిపై  కాంగ్రెస్​ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోంది.  విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు రేవంత్​ సర్కారు బంగారు బాటలు వేస్తోంది. దీనిలో భాగంగా పాఠశాల విద్యపైనా  ప్రత్యేక దృష్టి సారించడం శుభ పరిణామం. పాఠశాల విద్యాశాఖ టెన్త్​ పరీక్షల విధానంలో మార్పులు చేసింది.  ఇకనుంచి ప్రతి పేపరులోని  ప్రశ్నలకు 100 మార్కులను కేటాయించింది.  విద్యార్థులు ఆప్షనల్​ ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రంలోని వారు ఎంచుకున్న ప్రశ్నలకు  జవాబులను రాయాల్సి ఉంటుంది.   ఇంతకుముందు  ఇంటర్నల్ 20 మార్కులు 80 మార్కులకు ఫైనల్ పరీక్ష నిర్వహించి  గ్రేడింగ్ ఇచ్చేవారు.  ఈ విధానానికి  స్వస్తి చెప్పి  ఈ విద్యా సంవత్సరం నుంచే వంద మార్కులకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీని ద్వారా విద్యార్థులకు  ఇంటర్నల్​ రాత  పనుల  భారం తగ్గింది అనడం నూటికి నూరు శాతం వాస్తవమే.  కేవలం మార్కుల  కోసమే ఈ రాత పనులను  టీచర్లు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం  విద్యార్థులకు శాపంగా మారిందని కొందరి వాదన.  ఏడు సబ్జెక్టులకు సంబంధించిన  ప్రాజెక్టు పని,  పుస్తక సమీక్ష లాంటి రాత పనులు విద్యార్థులకు భారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమే. 

 గ్రేడింగ్ సిస్టమ్ బదులు మార్కులు

వంద మార్కుల పరీక్షా విధానం ద్వారా విద్యార్థులు సబ్జెక్టును పూర్తిగా నేర్చుకోవడానికి  ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. అంతేకాకుండా  ప్రతి సబ్జెక్టును కూలంకషంగా చదివే సమయం విద్యార్థికి దొరుకుతుంది. ఇప్పటివరకు  కేవలం రాత పనులకు మాత్రమే పరిమితమైన విద్యార్థులు చదువు పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని  రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్కరణలు తీసుకొచ్చింది. పాత పద్ధతిలోనే  పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని  ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసి 2024-–25 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఇకనుంచి  అన్ని సబ్జెక్టులకు 100 మార్కుల పేపర్ ఉంటుంది. దీనిలో భౌతిక శాస్త్రం పేపర్ కు 50 మార్కులు,  జీవశాస్త్రం పేపర్ కు 50 మార్కులు ఉంటాయి.  గ్రేడింగ్ సిస్టమ్ బదులు మార్కులు ఉంటాయి.    తెలుగు, హిందీ, ఇంగ్లీష్,  గణితం, సాంఘిక శాస్త్రంకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇస్తారు.  

అడిషనల్ పేపర్స్ ఇవ్వరు. 2 పేపర్లున్న భౌతిక శాస్త్రం, జీవశాస్త్రంలకు 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొంత ఆలస్యంగా అయినా టెన్త్​ పరీక్షల విధానంలో సంస్కరణలను చేయడం,   గ్రేడింగ్ విధానాన్ని తొలగించడంతో విద్యా ర్థులపై విపరీతమైన భారంగా మారిన  ఇంటర్నల్ అసెస్మెంట్​లు,  వార్షిక పరీక్షల మార్కులను  పరిగణనలోకి తీసుకోకపోవడం ఈ రెండు అంశాలు విద్యార్థులకు మేలు చేసేవే.  అలాగే,  మిగిలిన  తరగతులకు  కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలి.  అయితే,  చదువులో వెనుకబడిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని,  కనీసం రాత పనులతో  కొన్ని మార్కులు సాధించే అవకాశం ఉందని మరో వాదన.  కానీ, విద్యార్ధి  విషయ పరిజ్ఞానం పొందడానికి,  భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడానికి ఈ సంస్కరణలు ఎంతో ఉపయోగమని చెప్పవచ్చు.

- యాడవరం
చంద్రకాంత్ 
గౌడ్