ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు

  • నేడు కొత్తకోటకు సీఎం రేవంత్​ రెడ్డి
  • రేపు ఎర్రవల్లి చౌరస్తాకు రాహుల్​ గాంధీ
  • 10న నారాయణపేటకు ప్రధాని మోదీ

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు లోకసభ స్థానాలపై ప్రధాన పార్టీలు ఫుల్​ ఫోకస్​ పెట్టాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీతో పాటు సిట్టింగ్​ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్, రెండు స్థానాల్లో విజయం సాధించి ఆధిపత్యం చలాయించాలని బీజేపీ సర్వశక్తులొడ్డుతున్నాయి. ఎన్నికలకు వారం రోజుల టైం ఉండడంతో ఈ స్థానాల పరిధిలో రాష్ట్ర, జాతీయ స్థాయి లీడర్లతో సభలు, కార్నర్​ మీటింగ్ లు, రోడ్​షోలు నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నారు.

సీఎం రేవంత్​రెడ్డి విస్తృత పర్యటనలు..

ఉమ్మడి మహబూబ్​నగర్  పరిధిలో నాగర్​కర్నూల్, పాలమూరు లోక్​సభ స్థానాలున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన సీఎం రేవంత్​ రెడ్డి సొంత ఇలాఖాలోని ఈ రెండు పార్లమెంట్​ సెగ్మెంట్​లలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్​ నుంచి మహబూబ్​నగర్​ స్థానానికి చల్లా వంశీచంద్​ రెడ్డి, నాగర్​కర్నూల్​ నుంచి మల్లు రవి పోటీలో ఉన్నారు.

వీరికి మద్దతుగా సీఎం ఇప్పటికే కొడంగల్, కోస్గి, మద్దూరు, మహబూబ్​నగర్, నారాయణపేట, బిజినేపల్లిలో రోడ్​ షోలు, కార్నర్​ మీటింగులు, బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడారు. తాజాగా కొత్తకోటలో శనివారం సాయంత్రం సీఎం వంశీచంద్​ రెడ్డికి మద్దతుగా రోడ్​ షో, కార్నర్​ మీటింగ్​లో మాట్లాడనున్నారు. వచ్చే వారం మక్తల్​ కేంద్రంగా జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొనే ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.

పాలమూరుకు మోదీ.. కందనూలుకు షా..

ప్రధాని మోదీ గత నెల 17న నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ బీజేపీ క్యాండిడేట్​ భరత్​ ప్రసాద్​కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. అదే నెల ఆయనకు మద్దతుగా గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్ పర్యటించారు. త్వరలో ఇదే పార్లమెంట్​లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా పర్యటించనున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 10న ప్రధాన మంత్రి నారాయణపేటకు రానున్నారు. మహబూబ్​నగర్​ పార్లమెంట్​ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహంచే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. త్వరలో మహబూబ్​నగర్​లో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్​ కూడా డీకే అరుణకు మద్దుతుగా నిర్వహించే రోడ్​ షో, కార్నర్​ మీటింగ్​లో పాల్గొననున్నట్లు తెలిసింది.

కేటీఆర్, హరీశ్​రావు పర్యటనలు..

మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​ బీఆర్ఎస్​ క్యాండిడేట్లు మన్నె శ్రీనివాస్​ రెడ్డి, ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​లకు మద్దతుగా కేసీఆర్​ ఇటీవల మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​లలో రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​లో నిర్వహించారు. రానున్న వారంలో ఆ పార్టీ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు పర్యటించనున్నట్లు తెలిసింది. భూత్పూర్, కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, నాగర్​కర్నూల్​లో పర్యటించేలా షెడ్యూల్​ రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఆదివారం రాహుల్​ గాంధీ సభ..

నాగర్​కర్నూల్​ కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్​ గాంధీ ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభ అనంతరం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. అయితే రాహుల్​ గాంధీ ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లాకు రావడం ఇది ఐదో సారి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కోస్గిలో సీఎం రేవంత్​ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచార సభకు, మహబూబ్​నగర్, గద్వాల, కొల్లాపూర్  నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు.