పీసీసీ చీఫ్​గా మహేశ్ కుమార్ గౌడ్

  • ఏఐసీసీ ఉత్తర్వులు అందరూ ఊహించినట్టే బీసీకే దక్కిన పీసీసీ పీఠం
  • ఇక మిగిలింది కేబినెట్ విస్తరణే

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్​ను పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందరూ ఊహించినట్టే బీసీ వర్గానికే పీసీసీ చీఫ్ పదవిని హైకమాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్​ పలుమార్లు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్​ను ఢిల్లీకి పిలిపించుకొని పీసీసీ చీఫ్ ఎంపికపై చర్చించింది. పార్టీ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్.. 

రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చల అనంతరం తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీసీ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్​లో ఉండడం.. పార్టీలో వివాదరహితుడిగా పేరుండడంతో.. మహేశ్​ను కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరించినట్టు భావిస్తున్నారు. కాగా, కర్నాటక టూర్​లో ఉన్న మహేశ్​ ​గౌడ్.. తనను  పీసీసీ చీఫ్​గా నియమించారన్న విషయం తెలియగానే.. అక్కడి నుంచే హైకమాండ్ పెద్దలకు ఫోన్ చేసి, కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకరణ ఉంటుందని,  సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తేదీ ఖరారు చేస్తారని తెలిసింది.

పార్టీని మరింత బలోపేతం చేస్త : మహేశ్ కుమార్ గౌడ్

తనపై నమ్మకం ఉంచి, కీలకమైన పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించిన హైకమాండ్​కు మహేశ్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేసి తెలంగాణలో పార్టీని మరిం త బలోపేతం చేస్తానని అన్నారు. నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తానని, రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్ఠతకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. కాగా, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ ను నియమించడం పట్ల గాంధీ భవన్​లో పార్టీ 

పలువురి హర్షం 

మహేశ్ ​కుమార్ ​గౌడ్ నియామకంపై పలువురు కాంగ్రె స్ ముఖ్య నేతలు హర్షం వ్యక్తం చేశారు. మహేశ్​ను ఈ పదవిలో నియమించిన అధిష్టానానికి వారు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభా కర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు మహేశ్ కుమార్ గౌడ్​కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఎన్ఎస్​యూఐ నుంచి పీసీసీ ప్రెసిడెంట్ దాకా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్​నగర్ లో 1966  ఫిబ్రవరి 24 న మహేశ్ కుమార్ గౌడ్ జన్మించారు. బీకాం చదివిన మహేశ్ 1986  నుంచి 1990 వరకు నిజామాబాద్ జిల్లా ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ అధ్యక్షుడిగా, 1990 నుంచి 1998 వరకు ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ ఏపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1998 –2000 వరకు నేషనల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, 2000–2003 వరకు పీసీసీ సెక్రటరీగా, 2012– 2016 వరకు పీసీసీ అధికార ప్రతినిధిగా

2013 – 2014 వరకు ఏపీ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్​గా, 2016 –2021 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​గా కొనసాగుతున్నారు. 1994లో డిచ్​పల్లి నుంచి, 2014 లో నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి, ఓడిపోయారు.

ఇక మిగిలింది కేబినెట్ విస్తరణే

పీసీసీ చీఫ్​గా మహేశ్​ కుమార్ గౌడ్  నియామకంతో ఇక అందరి చూపు మంత్రివర్గ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై పడింది. శ్రావణంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినా.. జరగలేదు. కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 4 భర్తీ చేసి, మిగిలిన రెండు పెండింగ్​లో పెడతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే, ఇప్పటికే 37 వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 15 నుంచి 20 పదవులను భర్తీ చేయాల్సి ఉంది.

ఇక రేవంత్​ - మహేశ్​ జోడీ

మూడేండ్లపాటు పీసీసీ చీఫ్​గా కొనసాగిన రేవంత్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగిసింది. అప్పటి నుంచి ఆ పదవి కోసం చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడినా.. మహేశ్ కుమార్ గౌడ్​నే హైకమాండ్ ఎంపిక చేసింది. మూడేండ్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, తెలంగాణలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ సేవలను ఈ సందర్భంగా హైకమాండ్ కొనియాడింది. ఇక ఇప్పటి నుంచి రాష్ట్రంలో రేవంత్-మహేశ్ జోడీ కొనసాగ నున్నది. తెలంగాణకు మహేశ్​ నాలుగో పీసీసీ చీఫ్ కావడం విశేషం. 

నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్​కు ఈ పదవి రావడంతో.. ఆ జిల్లాకు రెండోసారి పీసీసీ చీఫ్ పదవి దక్కినట్టు అయింది. ఇదే జిల్లాకు చెందిన డి.శ్రీనివాస్ గతంలో రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే, ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మహేశ్ కుమార్ గౌడ్​ను పీసీసీ చీఫ్ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా పార్టీలో కష్టపడే కార్యకర్తలకు ఉన్నతమైన పదవులు దక్కుతాయనే సంకేతాలను రాష్ట్ర క్యాడర్​కు హైకమాండ్ పంపినట్టయింది. 

నాపై నమ్మకం ఉంచి కీలకమైన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన హైకమాండ్​కు ధన్యవాదాలు. చిత్తశుద్ధి, అంకిత భావంతో పని చేసి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్త. నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్త.మహేశ్ కుమార్ గౌడ్