ఎమ్మెల్సీ బై పోల్​లో..డబ్బులు తీసుకోలేదా..?

  •     బీఆర్​ఎస్​ జడ్పీటీసీలపై జడ్పీ చైర్​పర్సన్​ ఫైర్​
  •     అవమానాలు భరించలేకనే పార్టీ మారా
  •     మహబూబ్​నగర్​ జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణా సుధాకర్​రెడ్డి
  •     పార్టీ మారడంపై బీఆర్ఎస్​ సభ్యుల ఆరోపణలు
  •     వాకౌట్​ చేయడంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసిన సీఈవో

పాలమూరు, వెలుగు : ‘నాపై ఆరోపణలు కాదు. మీరు ఏం చేశారో మరిచిపోకండి. ఎమ్మెల్సీ బై పోల్​లో కాంగ్రెస్​ పార్టీ క్యాండిడేట్​ నుంచి మీరు డబ్బులు తీసుకోలేదా? చివరకు మోసం చేసి, బీఆర్ఎస్​కు ఓట్లు వేశారు. పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఇతర లీడర్లు డబ్బులు ఆశించకుండానే బీజేపీకి ఓట్లు వేశారా?’ అని మహబూబ్​నగర్​ జడ్పీ​చైర్​పర్సన్​ స్వర్ణా సుధాకర్​రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్​ అయ్యారు. జడ్పీ చివరి సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిద్దామని ఆశించానని, కానీ బైకాట్​​చేయడం వల్ల అసంతృప్తిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్​ సభ్యుల వాకౌట్..​

జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణా సుధాకర్​రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం పదిన్నరకు మహబూబ్​నగర్​ జడ్పీ సమావేశం ప్రారంభమైంది. సభలో 14 మంది జడ్పీటీసీలు బీఆర్ఎస్​ పార్టీకి చెందిన వారు ఉండగా, అందులో ఆరుగురు సభ ప్రారంభమైన వెంటనే చైర్​పర్సన్​పై విమర్శలకు దిగారు. కాంగ్రెస్​ పార్టీలో చేరడంతో వ్యక్తిగత విమర్శలకు దిగారు. గులాబీ జెండా కింద గెలిచి, కాంగ్రెస్  కండువా కప్పుకొని రాజకీయాలను చెడగొట్టారని ఆరోపించారు. సమావేశం నుంచి ఆ పార్టీ సభ్యులు వాకౌట్​ చేశారు. 11.30 గంటలకు కోరం లేకపోవడంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సీఈవో రామారావు  ప్రకటించారు. 

అవమానించినా ఓర్చుకున్నా..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలను గెపించినందుకు కేసీఆర్​ జడ్పీటీసీగా గెలిచిన తనను చైర్​పర్సన్​గా నియమించారని స్వర్ణా సుధాకర్​రెడ్డి తెలిపారు. సమావేశం వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు తనను అవమానించారన్నారు. అయినా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేశానన్నారు. తనను విమర్శిస్తున్న జడ్పీటీసీలు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ బై పోల్​లో కాంగ్రెస్​ పార్టీ క్యాండిడేట్​ నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.

ఆ తర్వాత బీఆర్ఎస్​కు ఓట్లు వేశారన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారలేదని, ప్రజలకు న్యాయం చేయాలనే పార్టీ మారానని తెలిపారు. తనపై కక్షతోనే చివరి సమావేశాన్ని బై కాట్ చేశారని విమర్శించారు. ఐదేండ్లలో అందరి సహకారంతో ప్రజల సమస్యలు పరిష్కరించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

ఫొటోలు దిగుదాం రండి..

జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంసీటీసీలకు ఇదే చివరి జడ్పీ సమావేశం కావడంతో సభ్యులంతా కలిసి ఫొటోలు దిగాల్సి ఉన్నా, బీఆర్ఎస్​ సభ్యులు వాకౌట్​ చేశారు. వీరితో ఫొటో దిగేందుకు మహబూబ్​నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి వచ్చారు. అక్కడికి ఎవరు రాకపోవడంతో ఎమ్మెల్యే యెన్నం సభ్యులకు ఫోన్​ చేసి మాట్లాడారు. ఆయన మాటను గౌరవించి మహబూబ్​నగర్, హన్వాడ, భూత్పూర్  జడ్పీటీసీలు వచ్చారు. వారిని సీఈవో శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యేలతో కలిసి గ్రూప్  ఫొటో దిగారు. 

చట్టాలపై కేసీఆర్​కు నమ్మకం లేదు..

శాసన సభ రూపొందించిన చట్టాలపై బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​కు నమ్మకం లేదని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి ఆరోపించారు. జడ్పీ మీటింగ్​ వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జడ్పీటీసీలు మీటింగ్​కు రాకుండా బీఆర్ఎస్​ రాష్ట్ర నేతలు అడ్డుకున్నారని విమర్శించారు. కేసీఆర్​ చట్ట సభలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించడానికి ముందుకు రాలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్లమెంట్​లో తెలంగాణపై చర్చ జరుగుతున్నా సమావేశానికి కూడా వెళ్లలేదన్నారు.

ఎన్నికల కోడ్  కారణంగా ఏడాదిగా జడ్పీ మీటింగ్​లు జరగలేదని, బీఆర్ఎస్​ కుట్రలతో చివరి మీటింగ్​లో ఎలాంటి చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను గౌరవించకపోవడంతోనే పార్లమెంట్​ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఉండదన్నారు. జడ్పీ మీటింగ్​కు రాని సభ్యులకు ప్రజాక్షేత్రంలోనే తగిన బుద్ధి చెబుతామన్నారు.