మహారాష్ట్ర కూటముల్లో ఓటు బదిలీయే కీలకం

దేశ ఆర్థిక రాజధాని ముంబయితో  కూడుకున్న మహారాష్ట్ర  దేశంలోనే కీలక రాష్ట్రం.  శాసనసభ ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది.  మోహరించిన  రెండు కూటముల మధ్య పోటీ  హోరాహోరీగానే ఉంది.  ఎవరు ఏకొంచెం ఆధిక్యత సాధించినా వారి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.   నిన్నటి లోక్​సభ  ఎన్నికల్లో  భంగపడిన  ‘ఎన్డీఏ’ కూటమి  ఈ  అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచే  జాగ్రత్తపడితే, అప్పుడు విజయఢంకా మోగించిన ‘ఇండియా’ కూటమి పొత్తులు సర్దుకోవడానికే  బోలెడు టైమ్ పట్టింది.  

మతం, కులం, అభివృద్ధి, వెనుకుబాటుతనం, స్థానికత, వలసలు,  సంక్షేమ పథకాల అమలు,  రేపటి హామీలు.. ఇలా  పలు ప్రభావాలు  సయ్యాటాడుతున్న  బరిలో  ఏది నిర్ణాయకాంశం అవుతుందన్నదే ఉత్కంఠ!   పోటీ  కూటముల మధ్య కనుక, పార్టీల నడుమ ‘ఓటు బదిలీ’ కీలకం కానుంది.  

సంకీర్ణ శకంలో  కూటమి రాజకీయాలు, సామాజిక సమీకరణాలను విరగ్గొడుతూ, అతికిస్తూ... ఆటలాడుకోవడం ఇటీవలి పరిణామం.  మహారాష్ట్రలో ఇప్పుడదే జరుగుతోంది.  మరాఠాలు,  ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) మధ్య ఓట్ల కోసం,  రాజకీయాలు  కుంపటి  రగిలిస్తున్నాయి.  ఇదొక్కటే  అక్కడ  ఎన్నికల ప్రభావిత అంశంగా లేదు.  పలు అంశాలు ఓటింగ్ సరళిని  ప్రభావితం చేసేలా ఉన్నాయి.  

కూటముల్లో  భాగస్వాములు  పరస్పరం  ఎంతగా మేలు/కీడు చేస్తారన్నది   కీలకమౌతోంది.   కూటముల మధ్యనే కాదు,  ఇరు కూటముల్లోనూ ఆధిపత్య పోరున్నట్టు సమాచారం.  ఎన్డీఏ  అమలుపరుస్తున్న సంక్షేమ, -అభివృద్ధి  పథకాలను మరిపించే  కొత్త  పథకాలు, కార్యక్రమాలను  ‘ఇండియా’  పక్షాలు  ఇస్తాయనే  నమ్మకం కలిగిస్తే తప్ప జనం అటు మొగ్గకపోవచ్చు.  ఎందుకంటే, 2024 లోక్​సభ ఎన్నికల్లో పరాజయం (17/48) తర్వాత అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని, మహిళలకు నగదు బదిలీ చేసేలా పాలక ‘మహాయుతి’ సర్కారు అమలుపరుస్తున్న ‘మాజీ -లాడ్ కీ -బహెన్ యోజన’  బాగా క్లిక్ అయింది.  అభివృద్ధిపరంగా  మహారాష్ట్రలో  ప్రాంతీయ అసమానతలున్నాయి. అలాగే  స్థానికులు, -ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారి మధ్య అంతరాలున్నాయి.  మహారాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారీ.. ఇతర అప్రధాన పార్టీలు, స్వతంత్రులు, ప్రధానపార్టీల తిరుగుబాటు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుస్తుంటారు.  గెలవకున్నా కొందరు ఇతరుల తలరాతల్ని మారుస్తుంటారు. ఇలా.. ఏ అంశం ఏ మేరకు  ఓటరు  ఆలోచనల్ని  ప్రభావితం చేస్తుందనే దాన్నిబట్టి  పార్టీల  జాతకాలు మారే అవకాశమున్నట్టు ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చర్లు గుర్తించారు.

అభివృద్ధి, అసమానతలకు సవాల్!

ఒక్క మహారాష్ట్రలో  రెండు  రాష్ట్రాలున్నాయని విశ్లేషకులు వ్యంగ్య వ్యాఖ్య చేస్తారు. ఆరు భౌగోళిక ప్రాంతాలుగా విడివడ్డ మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన,  - వెనుకబడిన  ప్రాంతాల మధ్య ఓ స్పష్టమైన విభజన రేఖ ఉంది.  నగర, పట్టణ ప్రాంతాల్లోని అభివృద్ధి   గ్రామీణ  ప్రాంతాల్లో లేదు. విదర్భ,  మరాఠ్వాడా, ఉత్తర  మహారాష్ట్ర ఆర్థికంగా వెనుకబడిన,  వ్యవసాయక గ్రామీణ ప్రాంతాలు. ఈ ప్రాంతవాసులతో  పోల్చిచూస్తే రెండు,  మూడింతల వార్షిక తలసరి ఆదాయాలు.. నగర, -పట్టణ ప్రాంతాలతో  కూడిన ముంబయి, థానే, - కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర  ప్రాంతవాసులవి.  ఇది కొంత అశాంతికి కారణమవుతోంది.  దేశపు, స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)కి అత్యధికంగా 13.3 శాతం జోడించేది మహారాష్ట్ర.  

అదే సమయంలో  దేశంలో  అత్యధికంగా  (37.6 శాతం)  రైతు ఆత్మహత్యలు  నమోదైంది కూడా మహారాష్ట్రలోనే.  ఈ పరస్పర విరుద్ధ ప్రగతి  ఎన్నికల్లో  ప్రచారాంశమే!   ఈ రెండు ప్రాంతాల్లో ఓటర్లూ దాదాపు సమానం.  దేశంలో  మరెక్కడా లేనంతగా ఇక్కడి స్థానికులు  అప్పుడప్పుడూ  వలసదారులపై  విరుచుకుపడుతుంటారు. వలసదారులు  రాష్ట్ర  ఓటర్లలో 8 శాతం.  అందులో, ఉత్తరప్రదేశ్, కర్నాటక,  గుజరాత్,  మధ్యప్రదేశ్, రాజస్థాన్  రాష్ట్రాలవారే ఎక్కువ.  

ముంబాయిలో  43 శాతం  వలసదారులే.  19 శాతం  ఒక్క గుజరాతీలే  ఉంటారు.  మహారాష్ట్రకు రావాల్సిన ఎన్నో అభివృద్ధి పథకాలను, పెట్టుబడులను  ప్రధాని మోదీ గుజరాత్​కు తరలించుకుపోతున్నారనే  వాదనను  ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ లు ఈ ఎన్నికల్లో బాగా ప్రచారం చేస్తున్నారు.

మరాఠా ప్రైడ్ ఏం చేసేనో?

మరాఠ్వాడా, విదర్భ,  పశ్చిమ  మహారాష్ట్ర  ప్రాంతాల్లో  మరాఠాల ప్రభావం అధికం.  ముంబయి లోనూ  కొంతమేర (ఓటర్లలో వారి వాటా 42 శాతం) ప్రభావం చూపుతారు. వెనుకబడినందున  మరాఠాలకు  రిజర్వేషన్ కల్పించాలని సాగిన ఉద్యమం మహారాష్ట్రలో మంటలు రేపి, సామాజికంగా  అలజడి  సృష్టించింది.    

2024  లోక్​సభ  ఎన్నికల్లో  మరాఠాల  ఆధిపత్య  ప్రాంతాల్లో  ఎన్డీఏకు ఒక్క సీటూ దక్కలేదు.  మరాఠ్వాడాలోని 32 అసెంబ్లీ సెగ్మెంట్లలో 12 చోట్ల మాత్రమే  మహాయుతికి  ఆధిక్యత  దక్కింది.  ఆ ఎన్నికల్లో,  బీజేపీని  ఓడించేవారికే  ఓటేయండని రిజర్వేషన్  కోటా  యోధుడు  మనోజ్ జరంగే పాటిల్  పిలుపిచ్చారు.

దానికి ప్రతిగా.. రిజర్వేషన్లలో  మీ వాటా తగ్గొద్దంటే, దాని వ్యతిరేకుల్ని ఓడించండని మహాయుతి నేత  చగన్​భుజ్​బల్​ ఓబీసీలకు పిలుపిచ్చారు.  ‘మామూలుగానే ఎవరి ఓట్లు వారికొస్తాయి,  మీ ప్రకటన వల్ల  ఇండియా కూటమికి ఓబీసీ  ఓట్లు  తగ్గే  ప్రమాదముంద’ని  వచ్చిన  ఒక వినతి మేరకు,  జరంగే  తన  ప్రకటనను  వెనక్కి తీసుకున్నారు.  ‘మరాఠాలు తమ ఇష్టానుసారమే ఓటు వేసుకోవచ్చు’ అని ఆయన సవరణ ప్రకటన కూడా చేశారు. అయినా, బీజేపీకి  ఓబీసీల మద్దతు 11 నుంచి 16 సెగ్మెంట్లకు పెరిగింది.   మరాఠాలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

బీజేపీ, కాంగ్రెస్​లపై కూటముల భారం

స్పష్టమైన ఆధిక్యత  హర్యానాలో ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది. మధ్యప్రదేశ్​లోనూ అదే జరిగింది. గెలుపు ముంగిట బోల్తాపడటానికి కారణాలేమిటో ఆ పార్టీ అన్వేషించాలి. అతి విశ్వాసమో, వ్యూహం లేని అజాగ్రత్తో... కాంగ్రెస్​ను  తరచూ దెబ్బతీస్తోంది.  ఎమ్వీఏ  కూటమి  పెద్దన్నగా  కాంగ్రెస్​పై  ప్రజల విశ్వసనీయత  ప్రభావం  భాగస్వామ్య పక్షాలపైనా ఉంటుంది.  కానీ,  కూటమిలో  కాంగ్రెస్ బలహీనంగా ఉంది.  రెండు శిబిరాల్లోని శివసేన పార్టీలు  దాదాపు ఏకరీతిలోనే  ప్రభావం చూపుతున్నా, శరద్ పవార్ నేతృత్వంలోని  ఎన్సీపీ (ఎమ్వీయే) అజిత్ పవార్  ఎన్సీపీపై  స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.  

అధికార కూటమిలో పెద్దన్న బీజేపీ.. లోక్​సభ ఎన్నికల నాటితో పోల్చి చూస్తే ఇప్పుడు  మెరుగైన  వాతావరణం కనిపిస్తోంది.  కూటముల్లోని పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉన్నట్లు సమాచారం ఉంది. పార్టీలుగా  గెలిచిన సీట్లు,  పొందిన ఓటు వాటా శాతాలు భిన్నంగా ఉన్నా, మొత్తంమ్మీద కూటముల మధ్య ఓటు వాటా శాతాల్లో పెద్ద తేడాల్లేవు. 17 సీట్లు  గెలిచిన మహాయుతి  ఓటు వాటా 43.55 శాతం అయితే, 30 స్థానాల్లో నెగ్గిన ఎమ్వీఏ ఓటు వాటా 43.71 శాతం.  ఇంత స్వల్పమైన ఓటు వాటా వ్యత్యాసాల పరంగా చూసినపుడు  పోటీ  హోరాహోరీగా ఉన్నట్టే స్పష్టమౌతోంది.  ఎన్నికల నిర్వహణ సామర్థ్యం అదనపు హంగు!  కూటములను ముంచినా, తేల్చినా బీజేపీ, -కాంగ్రెస్​దే భారం!

 నేటి అమలు వర్సెస్  రేపటి హామీ

విపక్షానికి గట్టి నినాదం లేదు. అధికారం కోసం.. శివసేన, ఎన్సీపీలను నిలువునా చీల్చిందని ఎన్డీఏను విమర్శించడం వాడిన పాత ఆయుధమే!  పైగా, అలా వాడి గత లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి కూడా  పొందారు.  సాధారణంగా  ఒక తప్పుకు  ఒకసారే  శిక్షించే  మనస్తత్వం భారత ఓటర్లది!   లోక్​సభ  ఎన్నికల్లోలాగే  ఇప్పుడూ  ఓటర్లు  తమకు  పట్టంగడతారనే నమ్మకాన్ని మించిన ఆశతో  మహా వికాస్ అఘాడీ (ఎమ్వీఏ) నిరీక్షిస్తోంది.  

మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతున్న అంశాలకు విరుగుడుగా మహాయుతి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం తర్వాత... 2.34 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరేలా చేపట్టిన ‘మాజీ, -లాడ్​కీ -బహెన్ యోజన’ పథకం వారికెంతో లాభిస్తోంది.  రాష్ట్రంలోని సగం జనాభాపై  ప్రత్యక్షంగా, మొత్తం కుటుంబాలపై పరోక్షంగా గురిపెట్టారు.

18-–59 మధ్య వయస్కులైన  మహిళలందరికీ ప్రతినెలా రూ.1500  ఇచ్చే  పథకమిది!  మళ్లీ అధికారం కట్టబెడితే దాన్ని  రూ.2100 కు  పెంచుతామనీ  చెబుతున్నారు. ఇండియా కూటమి ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రభావవంతంగా లేదనే వాదన వినిపిస్తోంది.  

 -దిలీప్ రెడ్డి, పొలిటికల్  ఎనలిస్ట్, డైరెక్టర్  పీపుల్స్ పల్స్ రీసెర్చ్​ సంస్థ-