మహారాష్ట్ర రాజ్యమాతగా ఆవు ఉత్తర్వులు జారీ చేసిన షిండే సర్కార్

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ ఆవులను "రాజ్యమాత–గోమాత" గా ప్రకటిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేదకాలం నుంచి దేశంలో ఆవుల సాంస్కృతిక ప్రాముఖ్యత, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం పేర్కొంది. ఆవులు భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైన భాగమని  ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపింది. ఆవులు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సైనిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని చెప్పింది. “పూర్వం నుంచి మానవుల రోజువారీ జీవితంలో ఆవులకు ప్రత్యేక స్థానం ఉంది. వేద కాలం నుంచి గోవులకు ఉన్న మతపరమైన, శాస్త్రీయ, ఆర్థిక ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని వాటిని " కామధేను " అని కూడా  పిలుస్తున్నాం" అని షిండే ప్రభుత్వం పేర్కొంది.