మహబూబ్​నగర్ చెరువులు వెలవెల.. వర్షాలు పడుతున్నా నీళ్లు చేరక ఆందోళన

  •     వరి సాగుకు  దాటిపోతున్న అదును
  •     లిఫ్ట్​ల  కింద ఉన్న చెరువులు నింపాలని కోరుతున్న రైతాంగం

మహబూబ్​నగర్, వెలుగు: చెరువులు వెలవెలబోతున్నాయి. భారీ వర్షాలు లేక నోరెళ్లబెడుతున్నాయి. వర్షాకాలం మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నార్మల్​ రెయిన్​​ ఫాల్​ మాత్రమే నమోదైంది. సీజన్​లో ఇంత వరకు భారీ వర్షాలు రికార్డ్​ కాకపోవడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న 6,418 చెరువులు, కుంటలకు నీరు చేరలేదు.

సాధారణ వర్షపాతమే..

ఉమ్మడి జిల్లాలో జూన్, జులైలో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఇన్​ టైంలో నైరుతి రుతుపవనాలు వచ్చినా.. వర్షాలు పడలేదు. జులై రెండో వారం నుంచి రుతువపనాలు, అల్పపీడన ప్రభావాలు చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచి కొట్టాయి. కానీ, మహబూబ్​నగర్​, నారాయణపేట, నాగర్​కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు మాత్రమే పడ్డాయి. దాదాపు మూడు వారాల పాటు ఏకధాటిగా వర్షాలు పడినా.. ఈ జిల్లాల్లో ముసురు తప్ప భారీ వర్షాలు పడలేదు. మహబూబ్​నగర్​ జిల్లాలో జూన్, జులైలో నార్మల్​ రెయిన్​ ఫాల్​ 222.2 మిల్లీమీటర్లకు గాను 322.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.

వంద మి.మీ. వర్షపాతం అధికంగా నమోదైనా.. చెరువుల్లోకి నీరు చేరలేదు. 1,265 చెరువులు ఉండగా, ఒక్క చెరువు కూడా ఫుల్​ కెపాసిటీకి చేరుకోలేదు. ఈ జిల్లాలో 17 మండలాలు ఉండగా.. కౌకుంట్ల, జడ్చర్ల, మూసాపేట, అడ్డాకుల, హన్వాడ మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో నార్మల్​ రెయిన్​ ఫాల్​ 224.0 మి.మీ.కు గాను 340.7 మి.మీ. వర్షం కురిసింది. 116.7 మి.మీ. వర్షపాతం ఎక్కువగా నమోదైనా ఫాయిదా లేకుండా పోయింది. ఈ జిల్లాలో 890 చెరువులు ఉండగా, కొన్ని చెరువులు ఒట్టిపోయే కనిపిస్తున్నాయి.

స్కీమ్​లపైనే ఆధారం..​

ప్రియదర్శని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులు ఫుల్​ కెపాసిటీకి చేరుకున్నాయి. వీటి పరిధిలో ఉన్న నెట్టెంపాడు, భీమా–1, భీమా–2, కోయిల్​సాగర్​, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​లకు నీటిని తరలిస్తున్నారు. అయితే ఈ లిఫ్ట్​ల పరిధిలోని చెరువులకు నీటిని అందించాలని రైతుల నుంచి డిమాండ్​లు వస్తున్నాయి. ఆగస్టు నెల మొదలు కావడంతో వరి నాట్లు జోరందుకోనున్నాయి. ఇప్పటికే నెల ఆలస్యం కావడంతో ఈ నెలలో ఎలాగైనా నాట్లు వేసుకోవాలని రైతులు వరి నాట్లకు సిద్ధమయ్యారు.

ఉమ్మడి జిల్లాలో 7.69 లక్షల ఎకరాల్లో వరి సాగు సాధారణ విస్తీర్ణం కాగా, ఇప్పటికే బోర్ల సౌలత్, కాలువల కింద ఉన్న రైతులు 3.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసుకున్నారు. అయితే చెరువుల కిందే ఉమ్మడి జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉండడంతో లిఫ్ట్​ల కింద ఉన్న చెరువులు నింపాలని డిమాండ్​ చేస్తున్నారు. మరో రెండు వారాలు వర్షాలు లేకుంటే ఉన్న నారు మడులు ఎండిపోతాయని, వరి సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.