ప్రభుత్వ ఇంటర్​ అడ్మిషన్లలో మహబూబ్​నగర్ టాప్

  • అడ్మిషన్లు పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇంటింటా ఇంటర్​ అడ్మిషన్​’
  • ఈ నెలాఖరు వరకు ఫేజ్​-1 కింద అడ్మిషన్ల స్వీకరణ
  • పది రోజుల్లో స్టేట్​వైడ్​గా 19,281 మందికి ప్రవేశాలు 
  • 43 కాలేజీల్లో ఇంకా ఒక్క అడ్మిషన్​ కూడా కాలే.. 

మహబూబ్​నగర్​, వెలుగు :  ప్రభుత్వ​ జూనియర్​ కాలేజీల్లో నిర్వహిస్తున్న మొదటి విడత ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో పాలమూరు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, నారాయణపేట జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. ప్రైవేట్​ జూనియర్​కాలేజీల దెబ్బకు ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గుతుండడంతో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటింటా ఇంటర్​ అడ్మిషన్’  పేరుతో కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కాలేజీ ప్రిన్సిపాల్స్​కు టార్గెట్​పెట్టిన ఉన్నతాధికారులు ప్రతిరోజూ జూమ్​ మీటింగులు నిర్వహిస్తూ అడ్మిషన్లపై ఫాలోఅప్​ చేస్తున్నారు.

ప్రిన్సిపాల్స్​తో పాటు లెక్చరర్లు తమ పరిధిలోని గ్రామాలను విజిట్ ​చేసి, స్టూడెంట్లకు అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేట్ ​కాలేజీల దోపిడీ గురించి చెప్తూ సర్కారు కాలేజీల్లో జాయిన్​ కావడం వల్ల  కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఈ ప్రక్రియ పాలమూరు జిల్లాలో సక్సెస్ ​ఫుల్​గా సాగుతోంది. ప్రతి కాలేజీ నుంచి రోజూ ఇద్దరు చొప్పున గ్రామాలకు వెళ్తూ అక్కడి నుంచే డైరెక్ట్​గా ఆన్​లైన్​లో అడ్మిషన్లు చేయిస్తున్నారు. ఫలితంగా పది రోజుల్లో 1,702 అడ్మిషన్లతో పాలమూరు జిల్లా రాష్ట్రంలోనే టాప్​ప్లేస్​లో నిలిచింది. 

పోటీ పడుతున్న జిల్లాలు 

రాష్ర్ట వ్యాప్తంగా 422 గవర్నమెంట్ ​జూనియర్​కాలేజీలు (జీజేసీ) ఉండగా, ఈ నెల ఫస్ట్​ నుంచి నెలాఖరు వరకు ఫేజ్​–-1 కింద కొత్త అడ్మిషన్లు తీసుకుంటున్నారు. సోమవారం వరకు ఫేజ్​–-1 కింద 379 గవర్నమెంట్​జూనియర్​కాలేజీల్లో 19,281 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు. హైదరాబాద్​ డివిజన్​-–1లో 1,402, నిజామాబాద్​లో 1,136, మేడ్చల్​లో 1,048, హైదరాబాద్​ డివిజన్​ –-3లో 974, సిద్దిపేట 974, నిర్మల్​943, హైదరాబాద్​ డివిజన్​–-2లో 754, హనుమకొండ 737, ఆదిలాబాద్​ 732, సంగారెడ్డి 695, రంగారెడ్డి 666, యాదాద్రి 622, నల్లగొండ 607, జగిత్యాల 601, పెద్దపల్లి 529, మెదక్​ 502, అసిఫాబాద్​ 496

నాగర్​కర్నూల్​ 433, వనపర్తి 412, కామారెడ్డి 385, గద్వాల 384, ఖమ్మం 373, వరంగల్​ 353, మహబూబాబాద్​284, సిరిసిల్ల 283, భదాద్రి కొత్తగూడెం 252, జనగాం 181, మంచిర్యాల 174, వికారాబాద్​ 151, ములుగు 143, కరీంనగర్​ 130, సూర్యాపేట 98, భూపాలపల్లిలో 62 అడ్మిషన్లు అయ్యాయి. 53 అడ్మిషన్లతో నారాయణపేట అన్నింటికన్నా చివరి స్థానంలో  నిలిచింది.   

‘ఇంటింటా ఇంటర్​ అడ్మిషన్’ ప్రోగ్రాం

సర్కారు జూనియర్​ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్​ బోర్డు ‘ఇంటింటా ఇంటర్​ అడ్మిషన్​’ కార్యక్రమాన్ని జూన్​ ఒకటో తేదీ నుంచి మొదలుపెట్టింది. స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి అడ్మిషన్లు తీసుకునే అవసరం లేకుండా.. లెక్చరర్లే నేరుగా టెన్త్​ పూర్తి చేసిన స్టూడెంట్ల ఇండ్లకు వెళ్లి అడ్మిషన్ ​చేయిస్తున్నారు. ప్రతి రోజూ ఆయా కాలేజీల్లో పని చేస్తున్న లెక్చరర్లు షిఫ్టుల వారీగా, ఒక్కో గ్రామానికి వెళ్తున్నారు.

సర్కారు కాలేజీల్లో చదవడం వల్లే కలిగే బెనిఫిట్స్​ గురించి స్టూడెంట్స్​కు, వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. తమ దగ్గర ఉన్న లెక్చరర్లు కార్పొరేట్​కళాశాలలతో పోటీ పడేలా చదువు చెప్తున్నారని, అడ్మిషన్ ​తీసుకుంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పాస్​ కావచ్చని చెప్తున్నారు. ఇలా అవగాహన కల్పిస్తూ సర్కారు కాలేజీలో అడ్మిషన్​అయ్యేలా వారిని ఒప్పిస్తున్నారు.  

43 కాలేజీల్లో జీరో అడ్మిషన్స్​​

రాష్ట్రంలో 422 జూనియర్​ కాలేజీలు ఉండగా 43 కాలేజీల్లో ఇంతవరకు ఒక్క అడ్మిషన్​ కూడా కాలేదు. జగిత్యాల జిల్లాలో 15 కాలేజీలుంటే ఆరు కాలేజీల్లో, ఖమ్మంలో 20 కాలేజీలకు ఐదు చోట్ల, కామారెడ్డిలో 20 కాలేజీలుంటే ఐదు కాలేజీల్లో, సంగారెడ్డిలో 20 కాలేజీలుంటే నాలుగు చోట్ల, రంగారెడ్డిలో 19 కాలేజీలకు గాను నాలుగు చోట్ల, వికారాబాద్​లో 12 కాలేజీలు ఉంటే మూడు చోట్ల అడ్మిషన్లు రాలేదు.

ఆదిలాబాద్​, కరీంనగర్​, నల్లగొండ, నాగర్​కర్నూల్​, నారాయణపేట జిల్లాలో రెండు కాలేజీల చొప్పున ఇంత వరకు అడ్మిషన్లు షురూ కాలేదు. భదాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యపేట, మేడ్చల్​, ములుగు, హైదరాబాద్ ​డివిజన్​-2 ప్రాంతాల్లో ఒక్కొక్క కాలేజీలో ఇంత వరకు ఒక్క అడ్మిషన్​ కూడా నమోదు కాలేదు.  

పాలమూరులో 6 వేల అడ్మిషన్లు టార్గెట్ 

మహబూబ్​నగర్​ జిల్లాలో ఆరు వేల అడ్మిషన్లు టార్గెట్​గా పెట్టుకున్నాం. పది రోజుల్లో 1,702 అడ్మిషన్లు చేయించాం. ఇంకా ఈ నెలాఖరు వరకు టైం ఉంది. అప్పటి వరకు టార్గెట్​ రీచ్​అవుతామన్న నమ్మకం ఉంది. అడ్మిషన్లు పెంచడంపై ప్రిన్సిపాల్స్​తో ఎప్పటికప్పుడు జూమ్​ మీటింగ్స్​ నిర్వహిస్తున్నాం.  

- శ్రీధర్​ సుమన్​, డీఐఈవో, మహబూబ్​నగర్​