మానుకోటలో కుండపోత

  • శనివారం రాత్రి 182.50 ఎంఎం వర్షపాతం నమోదు
  • రాష్ట్రంలోనే మహబూబాబాద్​లో అత్యధిక వర్షం
  • అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలంటున్న పోలీసులు


మహబూబాబాద్, వెలుగు: మానుకోటను భారీ వర్షాలు వీడటం లేదు. రాష్ర్టంలోనే అత్యధికంగా శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 182.50 ఎంఎం వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం, డోర్నకల్, చిన్నగూడురు, నరసింహులపేట మండలాల్లో 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి వర్షం జిల్లాను కుదుపేయడంతో ప్రజలు వణికిపోతున్నారు.

ప్రజలకు తప్పని తిప్పలు..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో ఎన్​జీవోస్ కాలనీ, భద్రన్న కాలనీ, జగ్జీవన్ రామ్​కాలనీ, గుమ్మడూరు, రెడ్డి బజారు, బీటీఆర్ నగర్, హస్తినాపురం, ఇల్లందరోడ్, రైల్వే స్టేషన్ సమీపంలో వరుదల ఉధృతి ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాలు వరదలతో చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసర సరుకులు నీటిలో తడిసిపోయాయి. వారం క్రితం కురిసిన వర్షాల నుంచి కోలుకోక ముందే మళ్లీ భారీ వర్షం కురవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.

జిల్లాలోని కంబాలపల్లి చెరువు ప్రమాద కరంగా అలుగుపోస్తుంది. బయ్యారం పెద్ద చెరువు తెగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ కోరారు. చెరువు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లెల వాగు ఉప్పొంగడంతో గుండం రాజుపల్లి_చిన్నగూడురు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆకేరు వద్ద లోలేవల్ కాజ్​వే పై వరదతో తొర్రూరు_ మహబూబాబాద్ రూట్​లో బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

డోర్నకల్ మండలం బండిపాడు వద్ద బుగ్గ వాగు ఉప్పొంగడంతో ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకరంగా ఉన్న చోట్ల వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఆర్ అండ్​బీ గెస్ట్ హౌజ్​లో భారీగా వరద చేరుకుంది.

గ్రీవెన్స్ రద్దు..

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సర్వే కోసం జిల్లాస్థాయి అధికారులను మండల ప్రత్యేకాధికారులుగా నియమించామని, రెండు, మూడు రోజులు భారీ వానలు పడే అవకాశం ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలని కోరారు.

అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలి..


రోడ్ల పై నుంచి వరద ప్రవహించే చోట ప్రయాణం చేయవద్దు. కరెంట్​ పోల్స్​కు ప్రజలు దూరంగా ఉండాలి. పాత భవనాలు, దెబ్బతిన్న ఇండ్ల వద్ద ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలి. అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి జనం రావద్దు.- ఎస్పీ సుధీర్ రామ్ నాథ్​కేకన్