మహా శివరాత్రి స్పెషల్ : త్రిలింగ క్షేత్రం.. మన కాళేశ్వరం పుణ్యక్షేత్రం

త్రిలింగక్షేత్రాలలో ఒకటి కాళేశ్వరం. ఒకే పానవట్టం మీద ఇద్దరు దేవుళ్లుగా మహాదేవుని దర్శనం.. నాలుగు వైపులా రాజ గోపురాలు.... నాలుగు నందులు.. నాలుగు ద్వారాలు... అష్ట తీర్థాలతో .. నిత్యం భక్తులతో కళకళలాడుతుంది క్షేత్రం. ఇంకెన్నో విశేషాలతో వర్ధిల్లుతున్న కాలేశ్వరం గురించి...

దట్టమైన అరణ్యంలో ప్రకృతి రమణీయలతో అలరారుతూ ఉండే క్షేత్రం కాళేశ్వరం. 1965లో పురావస్తుశాఖ ఈ దేవాలయానికి సంబంధించి నాలుగు శాసనాలు ఉన్నట్లు. ప్రకటించింది. 1972లో జగద్గురువు శంకరాచార్యులు ఆధ్వర్యంలో ఈ ఆలయ పునరుద్ధరణ జరిగింది. అప్పటి నుంచీ ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నిత్యపూజలు, కార్తీకమాసంలో విశేష పూజలతో పాటు మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. చుట్టు పక్కల గ్రామాల్లో విశేషమైన దేవాలయాలెన్నో ఉండటంతో ఈ ప్రాతం పర్యాటక ప్రాతంగా మారిందని దేవాదాయ శాఖ వారు చెబుతున్నారు. 

ప్రత్యేకతలు

ముక్తీశ్వరునికి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి. అభిషేకం చేసిన నీళ్లు నేరుగా గోదావరిలో అంతర్వాహినిగా ఉన్న సరస్వతీ నదిలో కలుస్తాయి. ప్రత్యేక అభిషేణాలు, లక్ష బిల్వార్చన, మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ముక్తీశ్వరునితో పాటు అనేక దేవతా మూర్తులు కొలువై ఉన్నారు.

ఒకే పానవట్టం పై రెండు లింగాలు

 ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేని విధంగా ఈ క్షేత్రంలో కాలుడు, శివుడు ఇద్దరూ లింగ రూపంలో ఒకే పానవట్టం మీద కొలువై ఉన్నారు. ముందుగా యముడ్ని దర్శించి తదుపరి ముక్తీశ్వరున్ని దర్శించుకుంటేనే ముక్తి లభిస్తుందని కాళేశ్వర ఖండంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించినా, మనసులో తలుచుకున్నా జ్ఞానము కలిగి జన్మజన్మల పాపములన్నీ నశించి, ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలు కలిగి, వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. 

సూర్యదేవాలయం

ప్రపంచంలో కోణార్క, అరసవెల్లి, కాళేశ్వరం మూడుచోట్ల మాత్రమే సూర్యదేవాలయాలు. ఉన్నాయి. ప్రధాన దేవాలయానికి ఈశాన్యం మూలన ఈ దేవాలయం ఉండడం మరో విశేషం.

శైవ క్షేత్రంలో కోదండరామాలయం

శైవ క్షేత్రమైన కాళేశ్వరంలో అనుబంధ దేవాలయంగా సీతాసమేత రాముని ఆలయం ఉంది. భద్రాచలంలో పోలిన విధంగా సీతారామ చరిత్ర త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నాలుగు వైపులా రాజగోపురాలు, నాలుగు నందులు, నాలుగు ద్వారాలు ఉండటం ఒక విశేషం. కాగా ఈ మడలంలో నలుదిక్కులా నాలుగు లింగాల ప్రతిష్టాపనతో చంద్రశేఖర ఆలయం, ఏలికేశ్వరాలయం, అమరేశ్వర ఆలయం, ఆగస్తీశ్వరాలయం సహిత లక్ష్మణ విగ్రహాలు ఉండడం విశేషం. ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు, గోదా కళ్యాణం, శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

సంగమేశ్వరుడు

త్రివేణి సంగమం దగ్గర సంగమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇంకా ప్రాకార మండపంలో కాళభైరవుడు, మహావిష్ణువు పది అవతారాలలోని మత్స్యావతారంలో దర్శనమిస్తారు.

విజయ గణపతి

కంచి కామకోటి పీఠాధిపతి ఆలయంలో విజయ గణపతి నైరుతి మూలన కొలువు ఉంటాడు. అదే విధంగా కాళేశ్వరంలో కూడా నైరుతి మూలన విజయ గణపతి కొలువు దీరాడు. ఈ రెండు ప్రాంతాలలో తప్ప మరెక్కడా విజయ గణపతి విగ్రహాలు లేవు.

పార్వతిదేవి అమ్మవారు

ఇక్కడ పార్వతిదేవిని శుభానందా దేవిగా కొలుస్తారు. అమ్మవారికి మంగళవారం, శుక్రవారాల్లో కుంకుమ పూజలు విశేషంగా నిర్వహిస్తారు. 

జ్ఞాన మహా సరస్వతి

కాళేశ్వరంలో చదువులతల్లి మహాసరస్వతికి నిత్యం ప్రత్యేక పూజలు చేస్తారు. మహాకాళి, మహాలక్ష్మి. మహాసరస్వతి త్రిమూర్తి రూపంలో అమ్మవారు కొలువై ఉంది. ఈ ఆలయంలో అక్షరాభ్యాసం, శ్రీ పంచమి రోజున విశిష్ట పూజలు జరుగుతాయి .

 ఆది ముక్తీశ్వర ఆలయం

 ప్రధాన ఆలయానికి ఒక కిలోమీటరు. దూరంలో ఆది ముక్తీశ్వరాలయం ఉంది. యముని కోరిక మేరకు యమ కుండమున ఆదిముక్తీశ్వరుడు వెలిశాడు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికంటే ముందే ఈ క్షేత్రం వెలిసినట్టు పండితులు చెబుతున్నారు. ఈ ఆలయం వద్ద తవ్విన కొద్ది భస్మం ఉండలు బయటపడుతుంటాయి. పూర్వం శివుడు శరీరమంతా భస్మంతో ఉండగా చిన్న ముక్క ఈ ప్రాంతంలో పడిందని అవి నేటికి భస్మ ఉండలు బయటపడుతున్నట్లు స్థానికులు చెబుతుంటారు.