శివరాత్రికి చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ముగిసిన తర్వాత ఆకలి మీద ఏదో ఒకటి తినేస్తుంటారు. కానీ, ఆ సమయంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి పండ్లు. వాటితో పాటు తొందరగా జీర్ణమయ్యే కొన్ని వంటకాలు ఇవి.
* రోజంతా ఉపవాసం ఉంటే శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. కాబట్టి, వీలైనంతగా శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. అంతేకాదు భోజనంలో ప్రొటీన్లు వీలైనంత ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం మేర ప్రొటీన్లు ఉంటే మంచిది.
* భోజనంలో వీలైనంత వరకు పండ్లు, కాయగూరలు, సలాడ్లు, హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఉండేలా జాగ్రత్తపడాలి. చక్కెర తక్కువగా ఉండే తృణధాన్యాలు, జీన్స్, ఉలవలు, పెసలు, అలసందలు లాంటి ధాన్యాలు తీసుకోవాలి. ఉపవాస దీక్ష విరమించి, భోజనం చేయగానే నిద్ర పోకూడదు. కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలి.
* మధుమేహం, ఎసిడిటీ లాంటి సమస్యలున్నవాళ్లు చక్కెర లేని ద్రవపదార్థాలు తాగడం మంచిది. అలాగే, పండ్ల రసాల కన్నా పండ్లు తినడం ద్వారా సహజమైన చక్కెర లభిస్తుంది.
* ఉపవాసం చేసిన మర్నాడు ఆకలిగా ఉందని అతిగా తినేయకూడదు. ముందు ద్రవాహారం తీసుకోవాలి. ఆ తర్వాత ఘనాహారం తీసుకుంటే మంచిది. ఎక్కువ మసాలాలు కాకుండా తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. అన్నం కూరలతో పాటు, పండ్ల ముక్కలు తినాలి.
యాపిల్ విత్ డ్రైఫ్రూట్స్
కావాల్సినవి
- యాపిల్ ముక్కలు : రెండు కప్పులు పుచ్చకాయ ముక్కలు: నాలుగు
- అరటిపండు ముక్కలు : ఐదు
- కావాల్సిన డ్రైఫ్రూట్స్ : పావు కప్పు పాలు : ఒక కప్పు
- చక్కెర : అరకప్పు తేనె : ఒక టేబుల్స్పూన్
తయారీ
యాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో సగం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక గిన్నెలో మిగిలిన యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు వేయాలి. పాలు వేడి చేసి అందులో చక్కెర, తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. పాలు చల్లారిన తర్వాత పండ్ల ముక్కల్లో కలపాలి. అందులోనే యాపిల్ గుజ్జు, డ్రైఫ్రూట్స్ వేసి బాగా కలిపి ఫ్రిజ్లో అరగంట ఉంచితే సరిపోతుంది. ఉపవాసం ఉన్నవాళ్లకు ఇది శక్తినిచ్చే ఆహారం.
మిక్స్ డ్ దాల్ సలాడ్
కావాల్సినవి
- కాబూలీ శెనగలు : అర కప్పు,
- శెనగలు: అర కప్పు
- ఎండు బఠానీ : అర కప్పు,
- పల్లీలు : అరకప్పు
- రాజ్మా: అర కప్పు,
- నెయ్యి : ఒక టీస్పూన్
- ఆవాలు : ఒక టీస్పూన్,
- ఇంగువ : చిటికెడు
- కరివేపాకు : ఒక రెమ్మ,
- ఎండుమిర్చి: రెండు,
- ఉప్పు : తగినంత
- పచ్చి కొబ్బరి తురుము : పావు కప్పు
తయారీ
పప్పులన్నింటినీ ముందు రోజు రాత్రే నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో పప్పులతో పాటు సరిపడా ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు పాన్లో - నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి వేగాక ఇంగువ, కరివేపాకు.. ఎండుమిర్చి వేగించి పాన్ దింపేయాలి. ఈ పోవును ఉడికించిన పప్పుల్లో కలపాలి. చివరగా తురిమిన కొబ్బరి కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చిన కూరగాయ ముక్కలు కూడా కలుపుకోవచ్చు.
మునక్కాయల పాయసం
కావాల్సినవి
- మునక్కాయ ముక్కలు : అర కప్పు
- అంజీర తరుగు : పావు కప్పు
- పాలు: మూడు కప్పులు
- నీళ్లు: ఒక కప్పు
- చక్కెర : ఒక కప్పు
- నెయ్యి : రెండు టీ స్పూన్లు
- జీడిపప్పు: అరు
- ఎండుద్రాక్ష: ఆరు
- ఉడికించిన సగ్గుబియ్యం: పావు కప్పు
- యాలకుల పొడి : చిటికెడు
తయారీ
మునక్కాయ ముక్కలు ఉడికించి, వాటి నుంచి గుజ్జు తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు నెయ్యి వేడి వేసి తర్వాత జీడిపప్పు, అంజీర తరుగు, ఎండు ద్రాక్షవేగించాలి. తర్వాత పాలు వేడి చేసి వాటికి కొంచెం నీళ్లతో పాటు మునక్కాయల గుజ్జు, ఉడికించిన సగ్గుబియ్యం, అంజీర వేసి ఉడికించాలి. అంజీర ఉడికిన తర్వాత చక్కెర, యాలకుల పొడి కూడా కలపాలి. దింపే ముందు డ్రైఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే మునక్కాయల పాయసం రెడీ.
రైస్ కిచిడీ
కావాల్సినవి..
- అన్నం : అర కప్పు
- కంది పప్పు, పెసర పప్పు: పావు కప్పు
- మునక్కాయలు: ఒకటి
- టొమాటో: ఒకటి
- పచ్చిమిర్చి : మూడు,
- కొత్తిమీర : ఒక కట్ట
- ఉల్లిపాయ: ఒకటి
- చింతపండు రసం : ఒక టేబుల్స్ స్పూన్
- నూనె : ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు : తగినంత
తయారీ
అన్నం కొంచెం మెత్తగా వండుకోవాలి. ఒక గిన్నెలో కందిపప్పు, పెసరపప్పు, టొమాటో, మునక్కాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. పాన్లోనూనె వేడి చేసి తాలింపు గింజలు, చింతపండు రసం, ఉప్పు వేయాలి. దానిలో ఉడికించిన అన్నం, ఉడికించిన కందిపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద కాసేపు ఉంచి దించేయాలి. నెయ్యితో గార్నిష్ చేస్తే బాగుంటుంది.