హరహర మహాదేవ : శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే..!

శివుడు మనకు నేర్పించే పాఠాలు ఏముంటాయి? దేవుడంటే మనల్ని కాపాడేవాడే కాదు, మంచి వైపుకు నడిపించే ఆలోచనను ఇచ్చేవాడు కూడా! ఇవ్వాల్టి సమాజాన్ని పట్టి పీడించే ఎన్నో విషయాల్లో మనిషి ఎలా ఉంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో శివుడు తన ఆచరణల్లో చూపించాడు. శివుడికి పుట్టుక, చావు ఉండదని చెప్పుకున్నాం కదా! అలాగే ఆయన నుంచి నేర్చుకున్నే ఈ పాఠాలకు కూడా చావు ఉండదు. ఎన్ని తరాలైనా ఈ పాఠాలు నేర్చుకోవాల్సిందే. శివ తత్త్వం నుంచి పుట్టిన కొన్ని మంచి ఆలోచనలు ఇవి. శివుడి నుంచి మనం నేర్చుకునే గొప్ప విషయాలు ఇవి.

మంచితనం, కలుపుకుపోయే తత్త్వం

శివుడిని పూజించేది దేవుళ్లూ దేవతలూ మాత్రమే కాదు. రాక్షసులేమిటి, భూతాలేమిటి, అన్ని రకాల జీవులూ ఆయనను ఆరాధిస్తాయి. దయ్యాలూ, భూతాలూ, ప్రేతాలూ, పిశాచాలూ, అసురులూ ఇలాంటివారిని అందరూ తిరస్కారించి దూరంగా పెట్టేస్తే, శివుడు మాత్రం వాళ్ళను స్వీకరించాడు. ఆయన పెళ్లి జరిగినప్పుడు ఈ లోకంలో ఎంతో కొంత ప్రాముఖ్యత గల ప్రసిద్ధులందరూ ఆ పెళ్ళికి వెళ్లారు. ఏ ప్రాముఖ్యతా లేని అనామకులు కూడా వెళ్లారు. ఈ రెండు తరగతుల మధ్యలో ఉండేవారూ వెళ్లారు. అందరు దేవుళ్లూ, దేవతలూ, అసురులూ, దానవులూ, ఉన్మాదులు, దయ్యాలు, పిశాచాలూ ప్రతివారూ వెళ్లారు. మామూలుగా వీళ్ళందరికీ ఒకళ్లతో ఒకళ్లకు సరిపడదు. కానీ శివుడి పెళ్లి అంటే మాత్రం అందరూ వెళ్లారు. ఆయన 'పశుపతి'. పాశవిక తత్త్వానికి ప్రభువు కనుక పశువులన్నీ వచ్చాయి. ఇక ఆయన పెళ్ళికి పాములు రాకుండా ఉండవు కదా! పక్షులూ కీటకాలూ కూడా మేమూ రావాల్సిందే అంటూ అతిథుల గుంపులో చేరిపోయాయి. జీవంగల ప్రతి ప్రాణీ శివుడి పెళ్ళికి వెళ్లింది.

ఈ కథ వల్ల మనకు తెలిసి వచ్చేదేమిటంటే, శివుడు అనే వ్యక్త రూపం గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పేది ఒక అతి నాగరికుడైన 'పెద్దమనిషి' గురించి కాదు. ఒక ప్రాథమికమైన ఆదిమమైన శక్తి గురించి. జీవ చైతన్య స్రవంతితో సంపూర్ణమైన ఏకత్వం సాధించిన ఒకానొక మూర్తి గురించి. ఆయన శుద్ధ చైతన్య మూర్తి, ఏ భేషజాలూ ఎరగడు. ఆయన నిత్య నూతనుడు, నిత్య స్వతస్సిద్ధుడు, కల్పనాశక్తి గలవాడు, విరామమెరగని సృజనాత్మకత ఆయనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవ చైతన్యానికే వ్యక్తీకరణ.

ఎప్పుడూ ఆనందమయమే

శివుడిని ఎప్పుడూ ఎవరు చిత్రించినా ఒక తాగుబోతుగానూ, సన్యాసిగానూ చూపిస్తారు. ఆయన ఒక యోగి. ఆయన ధ్యానంలో కూర్చుంటే నిశ్చలంగా ఉండిపోతాడు. కానీ ఆయన మత్తులో సోలిపోతూ తిరుగుతూ ఉంటాడు కూడా. అంటే ఆయన ఏ బార్ కో వెళ్ళి మద్యపానం చేసి వస్తాడని కాదు! ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూనే, ఎప్పుడూ పరమానంద స్థితిలో ఉండగల మార్గాన్ని యోగ శాస్త్రం మీకు చూపుతుంది. యోగులు సుఖాలకు విరుద్ధులు కారు. అయితే, మరీ చిన్న చిన్న సుఖాలతో వాళ్ళు తృప్తిపడరు. వాళ్ళకు ఆశ ఎక్కువ. మీరు ఒక్క గ్లాసు 'వైన్' పుచ్చుకొంటే, అది కాస్సేపు మాత్రమే మీకు మత్తెక్కిస్తుందనీ, మర్నాడు ఉదయం మళ్ళీ తలనొప్పి తప్పదనీ వాళ్ళకు తెలుసు.

మత్తులో పారవశ్యాన్ని నిజంగా అనుభవించాలంటే, మీరు పూర్తి మత్తులో ఉండి కూడా, నూటికి నూరు పాళ్లూ నిశ్చలంగా, ఎరుకతో ఉండగలగాలి. ప్రకృతి మీకు అలాంటి అవకాశాన్ని కల్పించింది.
ఇజ్రాయిల్ దేశానికి చెందిన శాస్త్రజ్ఞుడు ఒకాయన మనుషుల మెదడు పనిచేసే తీరు గురించి చాలా సంవత్సరాలు పరిశోధనలు చేశాడు. మనిషి మెదడులో గంజాయి మత్తును గ్రహించగలిగే జీవ కణాలు లక్షల సంఖ్యలో ఉన్నాయని ఆయన కనుక్కొన్నాడు. ఆ తరువాత శాస్త్రజ్ఞులు మనిషి శరీరంలో ఒక రసాయనం తయారవుతుందనీ, అది మెదడులోని జీవ కణాలను గంజాయిలాగే తృప్తిపరచగలదనీ కనుక్కొన్నారు. ఈ రసాయనానికి తగిన పేరు పెట్టేందుకు ఆ శాస్త్రజ్ఞుడు ఎన్నో మత గ్రంథాలలో వెతికాడు. పరమానంద పారవశ్య స్థితిని గురించి మాట్లాడేది ఒక్క భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలేనని గమనించి చివరికి ఆ రసాయనానికి ఆయన 'ఆనందమైడ్' అని పేరు పెట్టాడు! అంటే మీరందరూ చేయాల్సిందల్లా కొంచెం 'ఆనందమైడ్'ని సృష్టించుకోవాలి, ఎందుకంటే, మనలో ఒక గంజాయి తోటే ఉంది కదా! మీరు దీనిని సరిగా పండించి ఉంచగలిగితే, మీరు ప్రతీక్షణం మత్తులో ఉండొచ్చు.

అదే శివతత్త్వం

మీరు శివుడి గురించి మాట్లాడుతున్నారంటే, అదేదో మతసంబంధమైన విషయం కాదు. ఈ రోజు ప్రపంచమంతా 'మీరు ఏ మతానికి చెందిన వారు?' అన్న విషయమే ఆధారంగా విడిపోయి ఉంది. అందువల్ల మీరు ఏది మాట్లాడినా, మీరేదో మతానికి చెందిన వారిగానే అనిపిస్తుంది. కానీ, మనం మాట్లాడుతున్నది మతం కాదు. ఇది జీవుల అంతర్గతమైన పరిణామానికి సంబంధించిన సైన్సు, ఇది ముక్తికీ, భౌతికాతీత విషయాలకూ సంబంధించింది. మీలో ఎలాంటి జన్యువులున్నా లేదు. మీ తండ్రి ఎవరయినా ఫరవాలేదు. మీరు జన్మతః ఎలాంటి పరిమితులతో పుట్టినా, ఏ పరిమితులు మీకు ఆ తరువాత అబ్బినా ఫరవాలేదు. మీరు నిజంగా దానికి సన్నద్ధులై శ్రమిస్తే, వీటన్నిటికీ అతీతులు కావచ్చు. ప్రకృతి ఏర్పరచిన కొన్ని జీవన సూత్రాల పరిమితులకు లోబడి మనుషులు ఉండాలి. ఈ భౌతిక నియమావళిని భంగం చేస్తూ వెళ్ళటమే ఆధ్యాత్మిక సాధన. ఈ దృష్ట్యా చూస్తే, మనందరమూ నియమ ఉల్లంఘనులమయితే, శివుడు అతి పెద్ద ఉల్లంఘనుడు. కనుక మీరు ఆయనను పూజించలేరు కానీ ఆయన బృందంలో చేరగలరు, అంతే. ఈ మహాశివరాత్రి మీకందరికీ కేవలం జాగరణ చేసే రాత్రి మాత్రమే కాకూడదు. ఇది మీలో అత్యంత చైతన్యాన్ని, జాగరూకతనూ పెంపొందించే రాత్రి కూడా కావాలి. ఈ రోజు ప్రకృతి మనకు అందిస్తున్న ఈ కానుకను మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నా కోరిక ఇంకా ఆశీస్సులు! ఈ సంరంభోత్సాహాల తరంగాల మీద మీరందరూ పయనిస్తూ, మనం 'శివుడు' అని ప్రస్తావించుకొనే తత్త్వంలోని సౌందర్యాన్నీ, తన్మయత్వాన్నీ ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను.

శివుడు నటరాజు

'నటరాజు', 'నటేశుడు' అంటే తాండవానికి ప్రభువైన పరమశివుడు. ఈ నటరాజ రూపం శివుడికున్న రూపాలన్నిటిలో అతి విశిష్టమైంది. నేను స్విట్జర్లాండ్లో సీ ఈఆర్ఎన్ అనే అణుధార్మిక పరిశోధన సంస్థకు వెళ్లినప్పుడు, అక్కడ ప్రధాన ద్వారం ముందే ఉంచిన నటరాజ విగ్రహం చూశాను. అక్కడ ఆ విగ్రహం ఉంచటానికి కారణం, ఆ సంస్థ వారు చేస్తున్న పరిశోధనలకు అంతకంటే సన్నిహితమైన ప్రతీక మానవ సంస్కృతిలోనే మరొకటి కనిపించక పోవటమట! నటరాజ విగ్రహం సృష్టి మహోన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది. శాశ్వత నిశ్చలత్వం నుంచి స్వయంసిద్ధంగా అవతరించిన సృష్టి నృత్య రూపం.

శివుడు.. కొన్ని ఆసక్తికర విషయాలు..

శివుడు తన జఠాజూఠంలో గంగను పట్టుకొని ఉండటం తెలుసు కదా! భగీరథుడు పరలోకం నుండి గంగ కోసం వేచిచూస్తున్న సమయంలో, గంగ ఎంతో అహంకారంతో పృథ్విని నాశనం చేసేంత శక్తి గల వేగంతో వస్తానని చెబుతుంది. అప్పుడు భగీరథుడి విన్నపం మేరకు పరమశివుడు గంగను తన జఠాజూఠంలో పట్టుకుని భూమిపైకి చిన్న ధారగా గంగా నదిగా వదిలాడు. అందుకే ఆయనకు ‘గంగాధర' అనే పేరొచ్చింది.

రాక్షసుల బాధపడలేక దేవతలు చేసిన క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలం అందరినీ నాశనం చేస్తుందన్న ఆలోచనతో శివుడు తానే ఆ విషాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. అందుకే ఆయనకు నీలకంఠుడన్న పేరుంది.

భక్తులకు కోరికలను తీర్చే మహాదేవుడిగా పేరున్న శివుడికి అందరు దేవుళ్లతో పోల్చితే ఇంకో ప్రత్యేకత ఉంది. ఇతర దేవతలకు ఎవరికీ లేని విధంగా శివుడికి లింగరూపం ఉంది. మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆ పరబ్రహ్మ తన ఇచ్ఛానుసారం కొన్నిసార్లు నిరాకారుడిగానూ, కొన్నిసార్లు సాకారుడిగానూ ఉంటాడు. నిరాకారుడికి చిహ్నమే శివలింగం.

చూసి భయపడేలా ఉన్నాడనుకుంటాం. ఆయన తాగుతాడని, శ్మశానంలో గడుపుతాడని అంటాం. ఇవన్నీ మనిషి జీవితంలో భాగమైన చెడు. అదే శివుడు వినాశనం నుంచి మనల్ని కాపాడటం, అందరినీ సమానంగా చూడటం లాంటివి చేస్తూ కనబడతాడు. ఇది మన జీవితాల్లోని మంచి. మంచి, చెడు ఎలా ఉంటుందో పరిచయం చేసేది జీవితమైతే, ఆ జీవితమంతా ఒక శక్తి రూపంలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ శక్తి పేరే శివుడు. ఆ శక్తిని మనకు నేర్పేదే శివతత్త్వం.

భోళా శంకర.. ఆదియోగి.. అన్నీ శివుడే!

భోళా శంకరుడు, ఆదియోగి, నటరాజు, త్రయంబకుడు.. ఎలా పిలిచినా ఆయన శివుడే. శివ పురాణం ప్రకారం చూస్తే శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నీ శివ తత్త్వంలోని గొప్పదనాన్ని ఒక్కోరకంగా పరిచయం చేసేవే. అందులో కొన్ని ఇవి...

భోళా శంకరుడు

శివుడి రూపాల్లో దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 'భోళా మనిషి' అని మనం కొందరి గురించి చెప్పుకుంటాం. అంటే లౌక్యం తెలియని మనిషి అని. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు వీళ్లు. భోళా శంకరుడు కూడా ఇలాగే. ఆయనకు ఎవ్వరినీ తక్కువ చేయడం ఇష్టం ఉండదు. ఆయన తెలివి తక్కువవాడనీ కాదు, తన తెలివిని అనవసరమైన విషయాల్లో చూపి తాను గొప్పవాడినని చెప్పుకోడు.

త్రయంబకుడు

శివుడి మూడో కన్ను గురించి చెప్పుకున్నాం కదా! అందుకే ఆయనను త్రయంబకుడు అని కూడా అంటారు. కేవలం ఒక కన్ను ఎక్కువ ఉండటం కాదు దీనర్థం. ఆయన కంటికి కనిపించనిది కూడా గ్రహిస్తున్నాడని.

కాలభైరవుడు
కాలభైరవుడంటే శివుడి రౌద్రరూపం. భరించలేని బాధను అంతం చేయడానికి పుట్టినదే ఈ రూపం.

ఆ మూడో కన్ను జ్ఞానమే

శివుడికి మనుషుల్లాగా భౌతిక ప్రపంచాన్ని చూడటానికి రెండు కళ్లతో పాటు మూడో కన్ను కూడా ఉంది. శివుడి మూడో కంటిని విధ్వంసానికి ప్రతీకగా చెప్పుకుంటారు. మామూలు ప్రపంచాన్ని చూసే రెండు కళ్లు చంద్రుడికి, సూర్యుడికి ప్రతీకలైతే, మూడో కన్ను అగ్ని. అయితే ఈ కన్ను విధ్వంసానికి మాత్రమే కాదు, జ్ఞానానికి కూడా ప్రతీక. మనం ప్రతి విషయాన్ని కంటితో చూసి మొత్తం తెలుసుకున్నామనుకుంటాం. కాకపోతే మనస్సుతో, ఆలోచనతో, మేధస్సుతో ప్రపంచాన్ని చూడగలగాలి. అప్పుడు కంటికి కనిపించేవన్నీ మనం మోసం చెయ్యలేవు. జ్ఞానం కూడా మనకు దొరికేది ఇక్కడే. ఆ మూడో కంటితో ప్రపంచాన్ని చూస్తేనే!.