మాఘమాసం తెలుగు క్యాలండర్లో 11 వ నెల. శివుని భక్తులకు అత్యంత పవిత్రమైన మాసం. ఫిబ్రవరి 10న ప్రారంబమై.. మార్చి 10 వ తేదీ వరకు ఉంటుంది. మాఘమాసంలో పుణ్య స్నానం ప్రధానమైన ఆచారం. పుణ్య నదుల్లో ( గోదావరి, కృష్ణ, తుంగభద్ర మొదలైనవి) స్నానాలు ఆచరిస్తారు. వెళ్లేందుకు అవకాశం లేని వారు పొద్దున్నే ఇంటి దగ్గర మోటారు దగ్గర కాని, బావి దగ్గర గాని కుళాయి దగ్గర కాని స్నానం చేయవచ్చు. ఈ నెలలో ముఖ్యంగా ఆరు పర్వ దినాలున్నాయి. ఆ రోజుల విశిష్టత గురించి తెలుసుకుందాం. . .
1. శ్రీపంచమి (ఫిబ్రవరి 14)
మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు. ఈ రోజున సరస్వతీ దేవికి పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. సరస్వతీదేవి ఈ విరాట్ పురుషుని నుండి పుట్టిందని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. జగత్తంతా నడవడానికి బుద్ధి ముఖ్యం. ఆ బుద్ధి సక్రమంగా పనిచెయ్యడానికి సరస్వతీదేవి అనుగ్రహం ముఖ్యం కాబట్టి, ఆనాడు సరస్వతీ ఉపాసన చెయ్యాలని పండితులు చెబుతున్నారు.
2. రథసప్తమి (ఫిబ్రవరి 16)
అదితి, కశ్యపుల పుత్రుడైన సూర్యుడు లోకాలకు వెలుగు నివ్వడం కోసం రథ సప్తమి రోజున రథమెక్కి ఆకాశంలో సంచారానికి బయలు దేరాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని, త్రిమూర్త్యాత్మకుడని వేదాలు ప్రశంసించాయి. బుగ్వేదంలోని మహాసౌరమంత్రాలు, యజుర్వేదంలోని అరుణకేతుకం అనే అరుణ ప్రశ్నశాస్త్రంలో సూర్య దేవుని మహిమను అనేక విధాలుగా ఉందని ప్రశ్నా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
సూర్యుడు శరీరారోగ్య కారకుడని పురాణాలు వర్ణిస్తాయి. త్రిచవిధాన సూర్యనమస్మార పద్ధతి అని ఒకటి ఉన్నది. దాని ప్రకారం ఈ సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా నశిస్తాయని పెద్దలంటారు. 12 రోజులపాటు మహాసౌరయాగం చేసే పద్ధతి కూడా ఉన్నది.తల్లిదండ్రులు మనకు ఎలా భౌతిక ప్రత్యక్షదైవాలో అలాగే ఈ సూర్యదేవుడు కూడా దివ్యరూపంలో కనిపించే ప్రత్యక్షదైవం. రథసప్తమి నాడు రేగుపళ్ళు, జిల్లేడు ఆకులు నెత్తిమీద పెట్టుకుని నదీ స్నానం చేయాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
శ్లోకం
సప్తే సప్తే త్రిమూర్త్యాత్మన్ సప్తాశ్వరథవాహన!
సప్త్రజన్మకృతం పాపం స్నానేనైవ వినాశయ.!!
రథసప్తమీ నదీస్నానం చేయడం ఉత్తమం. పై శ్లోకమును చదువుచూ నదీ స్నానం చెయ్యాలి. ఇంటికి వెళ్ళి అవుపాలతో పాలపొంగలి చేసి సూర్యునికి 12 చిక్కుడాకులలో పెట్టి నివేదన చెయ్యాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఆరోగ్యమును కోరేవారు సూర్యుని ఆరాధించాలి.
3. భీష్మాష్టమి(ఫిబ్రవరి 16)
మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్చంద మరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మాఘస్నానానంతరం భీష్మునికి తర్పణం చెయ్యాలి. తిలలతో తర్పణం చేయాలి.
శ్లోకం:
వైయాఘ్రపాదగోత్రాయ సాంకృతి ప్రవరాయ చ,
గంగాపుత్రాయ భీష్మాయ, ప్రదాస్యేహం తిలోదకమ్,
అపుత్రాయ దదామ్యేత జం భీష్మాయ వర్మణే ॥
అనే శ్లోకం మూడుసార్లు చదివి మూడు సార్లు తిలతర్పణం చేయాలి.
4. భీష్మ ఏకాదశి(ఫిబ్రవరి 16)
భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం. భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు.ఆరోజు నదీస్నానం, మాధవుని పూజ, ఉపవాసం, వేద, పురాణాదుల శ్రవణం చేయడం ప్రశస్తం. భగవద్గీతా పఠనం చెయ్యడం కూడా మంచిదే.
5. మాఘపూర్ణిమ(ఫిబ్రవరి 24)
దీనినే మహామాఘి అని అంటారు. ఇది దేవికి ప్రీతికరమైన పర్వదినం. దేవీ ప్రీతికోసం పూజలు చేయాలి. సముద్రస్నానం చేయగలిగితే చాలా మంచిది.
6. మహాశివరాత్రి( మార్చి8)
ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాసశివరాత్రి అంటారు. ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. మాఘమాసంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు చతుర్దశి ఏ రోజున ఉంటుందో దానినే మహాశిరాత్రి అంటారు. ఇది శివునికి ప్రీతికరమైన తిథి.
మహాశివరాత్రి రోజున ఉదయమే సంకల్ప సహితంగా స్నానంచేసి, శుచిగా శివాలయానికి వెళ్ళి గాని, ఇంట్లో లింగం పెట్టికాని, లేదా దేవతార్చన ఉన్నవారు సాలగ్రామాలకు గానీ అభిషేకాలు, పూజలు (బిల్వదళాలతో) చేస్తారు. కొందరు సహస్రలింగార్చన- మహాలింగార్చన చేస్తారు. పగలంతా ఉపవాసం చేసి, రాత్రి శివపురాణాలు కథలూ చదువుతూ జాగరణం చేస్తారు. కొందరు పాలు, పెరుగు, తేనె, ఆవునెయ్యి పంచదార, చెరకురసం, గంధోదకం, పుష్పోదకాలు మొదలైన ద్రవ్యాలతో అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ జాగరణం చేస్తారు.