అబద్ధాల పునాదులపై ఆగమైంది

‘ఈ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేయకుండా కావాలని ఆలస్యం చేస్తున్నది.. వచ్చేది వర్షాకాలం.. అప్పుడు వరదలొస్తే మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగే ప్రమాదం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును మూలకు పడేసే కుట్ర ఇది.  మేమే అధికారంలో ఉంటే వేలకొద్దీ హిటాచీలను పెట్టి రెండు నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసేవాళ్లం’ : ఇది గత పాలకుల వాదన.

ఈ ఆరోపణల్లో ఎంత నిజముందో చూద్దాం.. 

 మేడిగడ్డ బ్యారేజీ 21 అక్టోబర్ 2023 నాడు కుంగింది. బ్యారేజీ కుంగిన తరువాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (NDSA) నిపుణులు బ్యారేజీని 23-–25 అక్టోబర్ 2023 నాడు సందర్శించి 1 నవంబర్, 2023 నాడు ఒక రిపోర్టును విడుదల చేశారు. ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ మొదలైన అంశాలలో వైఫల్యం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమై ఉంటుందని వారు తమ ప్రాథమిక నివేదికలో తేల్చారు. పూర్తి వివరాలకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర  విచారణ  చేయించాల్సి  ఉంటుందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. 
NDSA నిపుణుల నివేదికపై గత పాలకులు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా ఈ పెద్దమనుషులు మాట్లాడిన మాటలు గుర్తుకుతెచ్చుకోవాలి.

‘అసలు సమస్య ఏమిటో తెలుసుకోడానికే కనీసం ఆరేడు నెలలు పడుతుంది. అలాంటిది రెండు రోజులలో బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు ఇవీ అని నిపుణుల కమిటీ ఎలా తేల్చింది? నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వ పెద్దల రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఈ నివేదిక ఇచ్చింది. కేవలం స్వతంత్ర నిపుణుల కమిటీ తోనే మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు బయటకు వస్తాయి. ఖర్చులన్నీ కాంట్రాక్టరే భరిస్తాడు. ఈ మేరకు కాంట్రాక్టరే బహిరంగంగా ప్రకటన చేశాడు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. మా నాయకుడే అధికారంలో ఉంటే వేల హిటాచీలు పెట్టి రెండు నెలల్లో మేడిగడ్డ రిపేర్లు పూర్తి చేసే వాళ్ళం..’

పై మాటలతో గత పాలకులకు రెండు విషయాలపై స్పష్టత ఉన్న విషయం మనకు తెలుస్తున్నది. మొదటిది, మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుందని. వారి మాటలలో ఆరేడు నెలలు పడుతుంది. రెండవది,  స్వతంత్ర నిపుణుల కమిటీ పూర్తిస్థాయి దర్యాప్తు ద్వారానే వాస్తవాలు బయటపడతాయి. 

అంటే, అసలు సమస్యను గుర్తించడానికే ఆరేడు నెలలు పడితే, ఇక సమస్యను గుర్తించి పూర్తి స్థాయిలో రిపేర్లు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇదివరకే చెప్పినట్టు సమస్య కేవలం ఆ 7 వ బ్లాకులోని 12 పిల్లర్లకా..?  లేక మిగతా పిల్లర్లలో కూడా సమస్య ఉందా..? బ్యారేజీ ముందు, వెనుక ఉన్న కట్-ఆఫ్- వాల్స్ పరిస్థితి ఏంటి? CWC ఇప్పటికే చెప్పినట్టు బ్యారేజీ స్థలం ఎంపికే సరిగ్గా జరగలేదా..? అప్పుడు ఏం చేయాలి? ఎన్‌డి‌ఎస్‌ఏ కమిటీ ప్రాథమిక నివేదిక ప్రకారం డిజైన్ వైఫల్యమే అయితే దానిని పూర్తి స్థాయిలో సరి చేయడం సాధ్యమా?  సమస్య ఇంత జటిలంగా ఉంటే.. మా నాయకుడే ఉంటే, వేలాది హిటాచీలు పెట్టి ఈ పాటికి మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేసి ఉండేవాడు అనడం ఎంత హాస్యాస్పదం? వీళ్ళ మాటలు నమ్మడానికి తెలంగాణ సమాజం మరీ అంత అజ్ఞానంలో ఉందని వీళ్ళు  భ్రమిస్తున్నారా?

వేల హిటాచీలు అప్పుడేమైనట్టు?  

వేల హిటాచీలు పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద రిపేర్లు పూర్తి చేసేవారమన్న పెద్దల నిర్వాకం ఇప్పటికే చూశాం. (హిటాచీలంటే మట్టితీసే యంత్రాలు). నవంబరు 2019 గోదావరి వరదలలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల ఆప్రాన్​లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు మొత్తం కొట్టుకుపోతే నాలుగేండ్లు
దాటినా ఎలాంటి రిపేర్లకు ఇవి నోచుకోలేదన్న విషయం మనకు తెలుసు. బ్యారేజీకి రక్షణ కవచంలా ఉండే ఇవి దెబ్బతినడమే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఒక ప్రధాన కారణం. బ్యారేజీలకు ప్రమాదం ఉందని తెలిసీ నిర్లక్ష్యానికి కారణం ఏమిటి? మరి ఎప్పుడో నాలుగేళ్ల క్రితం బ్యారేజీలకు ఇంత తీవ్ర సమస్య వస్తే ఇప్పటివరకూ ఈ పెద్దమనుషులకు హిటాచీలే దొరకలేదా? ఇన్ని తప్పులు తమవైపు పెట్టుకొని ఎదుటివారిపై బురద చల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.   

రిపేర్ల ఖర్చు భరించేదెవరు? 

 మేడిగడ్డ బ్యారేజీ కుంగగానే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆఘమేఘాల మీద కాంట్రాక్టర్ల  ప్రతినిధులతో  రిపేర్ల ఖర్చంతా తామే భరిస్తామనే ప్రకటన ఇప్పించారు. ఎలక్షన్లయిపోగానే కాంట్రాక్టరు ప్లేటు ఫిరాయించాడు. రిపేర్లకు, తమకు ఎలాంటి సంబంధం లేదనీ, ‘డిఫెక్ట్  లయబిలిటీ  పీరియడ్’- అంటే పని పూర్తయ్యాక నిర్మాణంలో ఏదైనా సమస్యలొస్తే రిపేర్లకు అయ్యే ఖర్చు కాంట్రాక్టరే భరించాల్సిన సమయం- అయిపోయిందని.. అసలు డిఫెక్ట్ లయబిలిటీ సమయంతో సంబంధం లేకుండా తాము నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే నిర్మాణం పూర్తి చేశాం కాబట్టి రిపేర్లకు తాము బాధ్యత వహించబోము’ అని బాంబు పేల్చారు. కాంట్రాక్టరు మాట నిజమే అనుకుంటే ఇప్పుడు రిపేర్లకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నమాట. మొదట కాంట్రాక్టరే ఖర్చు భరిస్తాడని చెప్పిన గత పాలకులు ప్రస్తుతం మాట మార్చారు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఖర్చైనా ప్రభుత్వం భరించాలనీ, అంత భారీ ప్రాజెక్టులో ఇవన్నీ సర్వ సాధారణమేననీ, గతంలో అనేక ప్రాజెక్టులలో ఇలాంటి సమస్య లొచ్చాయనీ మాట మార్చారు. 

ఇది చాలా తీవ్రమైన విషయం..ఎందుకంటే, కొత్త ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు అమలులో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. పనులు మొత్తం పూర్తయ్యాక ‘డిఫెక్ట్ లయబిలిటీ సమయం’ మొదలైనట్టు ఇవ్వాల్సిన సర్టిఫికేట్, పని పూర్తి కాకుండానే అధికారులు కాంట్రాక్టరుకు ఇచ్చినట్టు అనేక ఆధారాలు లభించాయి. (డిఫెక్ట్ లయబిలిటీ సమయం అంటే బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యాక రెండేళ్లలో బ్యారేజీలో ఏదైనా సమస్య బయటపడితే కాంట్రాక్టరు తన సొంత ఖర్చుతో రిపేర్లు చేయాలి). కాంట్రాక్టు నిబంధనలపై సమగ్ర అధ్యయనం చేయకుండా మొత్తం రిపేరు ఖర్చు ప్రభుత్వమే  భరించడమంటే వేలకోట్ల భారం ప్రజలపై పడ్డట్లే. అలా కాకుండా మొదట పని కానిచ్చి, తరువాత బాధ్యత కాంట్రాక్టరుదా? లేక డిపార్టుమెంటుదా? అని నిర్ణయిద్దామంటే, ఈ అంశం తేలేదాకా కాంట్రాక్టరు పని మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ మొత్తం అంశంలో అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఇవన్నీ సమగ్రంగా విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

2019 నవంబరులో ఆప్రాన్​లు, కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోయినప్పుడు నష్టం ఎవరు భరించారు? 
 2019 వరదలకు బ్యారేజీ ఆప్రాన్​లు, కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోయి జరిగిన నష్టం రూ.180 కోట్లు. ‘డిఫెక్ట్ లయబిలిటీ సమయం’ పూర్తికాలేదు  కాబట్టి ఈ ఖర్చునంతా కాంట్రాక్టరే భరిస్తాడని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది.

 రిపేర్ల ఖర్చు రూ. 476 కోట్లుగా అంచనా వేశారు. అయితే బ్యారేజీని ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే పనులు చేశాం కాబట్టి, ఈ ఖర్చు తాము భరించబోవడంలేదని కాంట్రాక్టరు కరాఖండిగా చెప్పేశాడు. కాంట్రాక్టరే ఖర్చు భరిస్తాడని ప్రభుత్వం చెప్పినా, దీనికి ఎలాంటి ఆధారాలు లేవని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. 
అంటే గతంలో పాలకులు సకాలంలో బ్యారేజీల రిపేర్లు చేయకపోవడం.. దాని పర్యవసానంగా బ్యారేజీలు కుంగడం.. దానివల్ల పడే భారాలు.. టెండరు కండిషన్లు.. రిపేర్ల భారం కాంట్రాక్టరు మోయాలా? ప్రభుత్వమా? ఇవన్నీ సంక్లిష్టమైన న్యాయపరమైన అంశాలతో కూడుకున్నవి. తొందరపాటుతో చిన్న తప్పు చేసినా, పాత డ్యామేజీలకు రిపేరు ఖర్చులు, ఇప్పుడు బ్యారేజీల కుంగుబాటు రిపేరు ఖర్చులు, భవిష్యత్తులో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చే రిపేర్లు.. అన్నింటిపై దాని ప్రభావం ఉంటుంది. వేలకోట్ల రూపాయల భారాలతో కూడిన అంశం కాబట్టి ప్రభుత్వం ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది.
 పై విషయాలన్నింటినీ దాచి, తమ పాలనలో ప్రాజెక్టు నిర్వహణలో చూపిన పూర్తి అశ్రద్ధ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుత దయనీయ పరిస్థితి దాపురించిందనే విషయం పక్కన పెట్టి, గత పాలకులు ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం అత్యంత జుగుప్సాకరంగా ఉంది.   

కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు పెరిగింది
 కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థించుకునే పనిలో భాగంగా అనేక అసత్యాలు గత పాలకులు ప్రచారం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నులు ఉండేదనీ, 2023 నాటికి అది 3 కోట్ల టన్నులకు చేరిందనీ.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రాన్ని దాటి దేశంలోనే  తెలంగాణ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నామని.. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాధించిన ఘనతేననీ.. గత పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారాల్లో వీసమంత కూడా నిజం లేదు.ఇదెలాగో చూద్దాం.

ప్రభుత్వ గణాంకాలు ఏం చెబుతున్నాయి? 

 తెలంగాణ ప్రభుత్వం 2014-–15 సంవత్సరానికి గానూ ప్రచురించిన Agricultural Statistics at a Glance రిపోర్టు ప్రకారం 2013–-14లో తెలంగాణ ప్రాంతంలో ధాన్యం ఉత్పత్తి 106.86 లక్షల టన్నులు.  అలాగే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2023 నాటి నివేదిక ప్రకారం 2021-–22 నాటికి తెలంగాణలో మొత్తం ధాన్యం ఉత్పత్తి 151 లక్షల టన్నులు. మరి అప్పటి 45 లక్షల టన్నుల లెక్క, ఇప్పటి 3 కోట్ల టన్నుల లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ పెద్ద మనుషులే చెప్పాలి.  రాష్ట్రం ఏర్పడేనాటికి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ స్థానం 10. 2022 లో తెలంగాణ స్థానం 9. పంజాబ్ స్థానం 2. ‘తెలంగాణ వచ్చిన తరువాత అద్భుతమైన ప్రగతి..దేశంలోనే నంబర్ వన్..పంజాబ్​ను దాటేశాం..’ అంటూ గత పాలకులు చేసిన ప్రచారమంతా బూటకమని తెలిసిపోతుంది. 

ఇక పెరిగిన ధాన్యం 
ఉత్పత్తిలో కాళేశ్వరం పాత్ర ఎంత? 

 కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి గత ఐదేండ్లలో ఎత్తిన నీరు 160 టీఎంసీలు. మేడిగడ్డ నుంచి ఎత్తడం మొదలై అన్నారం, సుందిళ్ల దాటుకొని ఎల్లంపల్లి రిజర్వాయర్​ను చేరుకోగానే పైనుంచి గోదావరి వరద మొదలయ్యేది. మహారాష్ట్రలో వరదలకు, పైన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు ఎల్లంపల్లిని చేరేది. అంటే అప్పటిదాకా ఎత్తిన నీరంతా వృథానే. ఇలా ప్రతి ఏటా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తడం,
 పై నుంచి వరద రాగానే తిప్పిపోయడం ఒక నిత్యకృత్యమైపోయింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కాదు.. తిప్పిపోతల పథకం.. అని 2018 లోనే టీ‌జే‌ఏ‌సీ చెప్పింది. 

ఐదేండ్లలో 75 టీఎంసీలా?

ఈ ఐదేండ్లలో మొత్తం ఎత్తిన నీళ్లలో తిరిగి నదిలోకి తిప్పిపోసిన నీరు కనీసం 60 టీఎంసీలు. ఆవిరి నష్టాలను పరిగణనలోనికి తీసుకోకున్నా మిగిలినవి 100 టీఎంసీలు మాత్రమే. అయితే ఈ మిగిలిన నీరు మొత్తం పొలాలను చేరలేదు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లలో సుమారు 25 టీఎంసీల నీటిని నిలువ ఉంచారు. అంటే ఈ ఐదేండ్లలో సాగుకు ఉపయోగించిన కాళేశ్వరం నీళ్లు సుమారు 75 టీఎంసీలు. అంటే ఏటా పొలాలకు చేరింది 15 టీఎంసీలు మాత్రమే. ఒక టీఎంసీ నీటితో వరి 6000 ఎకరాలు, ఆరుతడి పంటలు 10 వేల ఎకరాలు సాగవుతాయి. సగటున 1 టీఎంసీకి 8000 ఎకరాలు అనుకుంటే, 15 టీఎంసీలకు సాగయ్యింది 1.2 లక్షల ఎకరాలు మాత్రమే. మరి కాళేశ్వరంతో కోటి ఎకరాల సాగు ఎక్కడ..? 

రాష్ట్రం ఏర్పడేనాటికి, అంటే 2014 వరకు తెలంగాణలో ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. 2014 నుంచి ఫిబ్రవరి 2023 వరకు వచ్చిన అదనపు ఆయకట్టు 15.81 లక్షల ఎకరాలు. ఇందులో కాళేశ్వరం ద్వారా వచ్చిన అదనపు ఆయకట్టు కేవలం 98,000 ఎకరాలు. ప్రచారహోరు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగింది ఏమీలేదు అని మనకు అర్థమౌతున్నది. వరదల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటిని కాళేశ్వరం నీటిగా గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టింది. 
మరో విషయం.. ఈ మాత్రం కాళేశ్వరం ఎత్తిపోతలకు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇంకా చెల్లించకుండా పెండింగులో పెట్టిన బకాయిలు రూ.14,000 కోట్ల పైమాటే. ‘చారానా కోడికి బారానా మసాలా’ అన్న సామెత కాళేశ్వరం ఖర్చుల ముందు దిగదుడుపే.
ప్రాజెక్టు అవినీతిపై కాగ్​ నివేదికను పట్టించుకోవలసిన అవసరం లేదు. వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉండదు: ఇది గత పాలకుల వాదన

 కంప్ట్రోలర్​ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం స్థాపించిన భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వం గణనీయంగా నిధులు సమకూర్చే కార్పొరేషన్లతో సహా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయడానికి వారికి అధికారం ఉంది. ఇటీవల కాగ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను సమర్పించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 220 పేజీల నివేదిక ఇది. ఒకే ఒక ప్రాజెక్టులో ఈ స్థాయి అక్రమాలను, అవకతవకలను ఆధారాలతో సహా కాగ్ వెలికితీయడం భారతదేశ చరిత్రలో ఇదే 
మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. 

కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగులో జరిగిన లోపాలు, టెండర్ల  ప్రక్రియలో లోటుపాట్లు, మోటార్లు,  పంపు
సెట్ల కొనుగోళ్లలో జరిగిన తప్పులు, పనులలో అవకతవకలు, వేలకోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. కాగ్ లేవనెత్తిన అంశాలపై అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు.. వాటిపై కాగ్ స్పందన కూడా ఈ రిపోర్టులలో ఉంది.  

కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు

ఉదాహరణకు, కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు, పంపుల కాంట్రాక్టులలో అన్ని ప్యాకేజీలు కలిపి మొత్తం విలువ  సుమారు రూ.18,000 కోట్లు.  ఇందులో కేవలం నాలుగు ప్యాకేజీలలో (ప్యాకేజీ సంఖ్య: 6,8,10,11 ) కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులను కాగ్ విశ్లేషించింది. ఈ నాలుగు ప్యాకేజీల కాంట్రాక్టు విలువ రూ 7,212 కోట్లు. ఇందులో 30% లాభాన్ని మినహాయించిన తరువాత కూడా, కాంట్రాక్టర్లకు సుమారు రూ 2,684 కోట్ల అయాచిత లాభం చేకూరిందని కాగ్ పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టింది. దీనిపై గత ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను  కాగ్ తోసిపుచ్చింది. దేశంలో ఇతర రాష్ట్రాలలో ఇదేసమయంలో జరిగిన ఇలాంటి పనులనే విశ్లేషించినప్పుడు కూడా మన దగ్గర జరిగిన అధిక చెల్లింపుల విషయం తేటతెల్లమౌతుంది. అలాగే మొత్తం టెండర్లు పూర్తయ్యాక టెండరు కండిషన్లను మార్చడం వల్ల కూడా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరింది. ఉదాహరణకు టెండర్లు పిలిచినప్పుడు స్టీలు, సిమెంటు లాంటి వాటి ధరలు పెరిగితే కాంట్రాక్టరే పెరిగిన ఖర్చు భరించాలి అన్న నిబంధన ఉంది. ఈ నిబంధనను మార్చి పెరిగిన ధరలను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించింది. దీంతో కాంట్రాక్టర్లకు సుమారు రూ. 1342 కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయి. ఇంకా డిజైన్లలో మార్పుల వల్ల ఖర్చుపెరిగితే కాంట్రాక్టరుకు వందల కోట్ల రూపాయలు అధిక చెల్లింపులు చేసిన ప్రభుత్వం, ఖర్చు తగ్గితే కాంట్రాక్టర్ల చెల్లింపులలో ఎలాంటి తగ్గింపు చేయలేదు.
కాగ్ కు సాంకేతిక అవగాహన ఉంటది

అయితే, గత పాలకుల వాదన ఇక్కడ పనిచేయదు. స్పష్టమైన ఆధారాలతో, లెక్కలతో అవకతవకలను కాగ్ ప్రస్తావించినప్పుడు పై మాటలు చెప్పి తప్పించుకోవడం కుదరదు. కాగ్ కు సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదన్న వాదన కూడా తప్పు. నివేదిక తయారుచేసేటప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులతో కాగ్ విస్తృతంగా చర్చిస్తుంది. పూర్తిస్థాయిలో తాము సంతృప్తి చెందితేనే కాగ్ వాటిని బయటపెడుతుంది. అయినా ప్రభుత్వాలు కాగ్ లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. కానీ, అసలు సరైన వివరణలేవీ ఇవ్వకుండా కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం వేలకోట్ల రూపాయల అవినీతిపై, అక్రమాలపై చర్చను పక్కదోవ పట్టించే ప్రయత్నమే. కాగ్​ నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేసిన సందర్భాలున్నాయి    

నిజానికి అధిక చెల్లింపులపై కాగ్ లేవనెత్తిన అనేక అంశాలను గత ప్రభుత్వం కాగ్​కు ఇచ్చిన తమ సమాధానాల్లోనే ఒప్పుకున్నది. కొన్నింటిపై సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దం పాటించింది. కాగ్ లేవనెత్తిన తప్పులను సరి చేసుకొని కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన కోట్లాది రూపాయలను తిరిగి  రాబట్టామని,  ఇంకా రాబట్టని చోట త్వరలో రాబడతామని రాతపూర్వకంగా ఒప్పుకుంది.  ఉదాహరణకు, జనవరి, 2015 లో స్థానిక ప్రభుత్వ పనులకు నది ఇసుకను ఉచితంగా వాడుకోవచ్చని ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది. అయితే ఎస్టిమేట్లలో మాత్రం ఇసుక ధరను కలిపి అంచనాలు వేశారు. దీనివల్ల ఒక్క 21-ఏ ప్యాకేజీలో రూ. 23.15 కోట్ల విలువ పెరిగింది. కాగ్ ఈ తప్పును పట్టుకున్నాక, భవిష్యత్తు బిల్లులలో ఇసుక ధరను కాంట్రాక్టర్ల నుంచి రాబడతామని కాగ్​కు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అలాగే 12వ ప్యాకేజీలో స్టీలుకు రూ.62.82 కోట్లను అధికంగా చెల్లించారని కాగ్ చెప్పింది. కాగ్ ఈ తప్పును పట్టుకున్నాక ఈ మొత్తాన్ని కాంట్రాక్టరు నుంచి రాబట్టామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కాగ్ నివేదికలో ఇలాంటి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి.  పై  లోటుపాట్లను కాగ్ లేవనెత్తకుంటే, వందల కోట్ల రూపాయలు శాశ్వతంగా కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్ళేవే. మరి కాగ్ నివేదికకు శాస్త్రీయత లేదు అని ఎలా అంటారు?  అయితే గత ప్రభుత్వం కాగ్ లేవనెత్తిన అనేక అంశాలపై సరైన వివరణ ఇవ్వలేదు. వీటి విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ప్రభుత్వం వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. 

కొత్త ప్రభుత్వంపై బురద చల్లడానికే.. 

గత పాలకులు కాళేశ్వరంపై ప్రస్తుతం చేస్తున్న అనేక వాదనలు, ఆరోపణలు అన్నీ తమ హయాంలో  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళికలలో, డిజైన్లలో, నిర్మాణంలో,నాణ్యతలో, నిర్వహణలో జరిగిన తప్పులను, అక్రమాలను  కప్పిపుచ్చుకొని కొత్త ప్రభుత్వంపై బురద చల్లడానికేనన్న విషయం స్పష్టమౌతున్నది. 

రెండు కీలక విషయాలు

1. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు: పైన సూచించిన రిపేర్లతో సంబంధం లేకుండా, ఎల్లంపల్లి వరకు నీటిని ప్రాణహిత-–చేవెళ్ళ పథకంలో తలబెట్టిన తుమ్మిడిహెట్టి నుంచి తరలించే అన్ని మార్గాలను పరిశీలించాలి. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజి నిర్మించినా పుష్కలంగా నీరు వస్తుంది. దీని ద్వారా ఏటా సుమారు వెయ్యి కోట్ల కరెంటు ఖర్చు తగ్గుతుంది. పైపెచ్చు ఆదిలాబాద్ జిల్లాలో తాగునీరు, సుమారు 2 లక్షల ఎకరాలకు అతితక్కువ ఖర్చుతో సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించకముందే ప్రాణహిత నదీ ప్రవాహాన్ని కొంత మళ్లించే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్యారేజీ నిర్మాణం నీటి తరలింపునకు ప్రతిబంధకం కావద్దు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు సరిపోవు అన్నప్పుడు మేడిగడ్డ నుండి నీటిని ఎత్తే అవకాశం వాడుకోవాలి.

2. పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ : రాష్ట్రంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలన్నీ ఏడాదిలో అత్యధికంగా మూడు, నాలుగు నెలలు నడుస్తాయి. మిగతా సమయాల్లో వీటితో ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే వీటిని ‘పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్’ లాగ మార్చడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. అంటే, నీటిని ఎత్తిపోయడమే కాకుండా, మిగతా 9 నెలల పాటు అవసరమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా వీటిని ఉపయోగించడం. అలాగే భవిష్యత్తులో నిర్మించబోయే ఎత్తిపోతల పథకాలన్నీ ‘పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్’ లాగ
నిర్మిస్తే రాష్ట్రానికి అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది.  ఏదేమైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే విషయంపై ఒక నిపుణుల కమిటీని తక్షణం వేయాలి. నిపుణుల కమిటీ సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రం కరువు పరిస్థితుల్లో ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యం, అక్రమాల  కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత జాగరూకతతో  వ్యవహరించాలి.

‘మేడిగడ్డ పియర్లు కుంగినా నీళ్లు

ఎత్తిపోయడానికి వచ్చిన సమస్యేమీ లేదు..కొన్ని ఇసుక బస్తాలు నదికి అడ్డంగా వేసి మేడిగడ్డ పంపు హౌసు నుంచి నీటిని ఎత్తిపోయవచ్చు’: ఇది గత పాలకుల వాదన. 

  పై వాదన ఎంత అర్థరహితమో చూద్దాం..

గోదావరి నదిలో ప్రాణహిత ఉపనది కలిసిన తరువాత మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. ఇప్పుడు బ్యారేజీ కుంగడంతో నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు అక్కడ నీళ్లు నిలువ ఉంచడంలేదు. అయితే ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లను మేడిగడ్డ పంపు హౌసు వైపు మళ్లించి అక్కడ నుంచి ఎత్తిపోయవచ్చనేది వీరి వాదన. మేడిగడ్డ గేట్లు
 ఎత్తే ఉంటాయి కాబట్టి బ్యారేజీలో నీళ్లు నిలువ ఉండవు. కాబట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఒత్తిడి ఉండదు. బ్యారేజీకి వచ్చే ప్రమాదమేమీ లేదు. ఇక్కడి వరకూ నిజమే అనుకున్నా అసలు సమస్య మేడిగడ్డ పంపు హౌసు నుంచి నీటిని అన్నారం బ్యారేజీలో వేసిన తరువాతనే వస్తుంది. 

ఎందుకంటే, మేడిగడ్డ నుంచి ఎత్తిన నీళ్లు మొదట అన్నారంలో నిలువ చేయాలి. అన్నారం గేట్లు మూసి కనీసం 10 మీటర్ల నీటిని అన్నారంలో నిలువ చేస్తే కానీ బ్యారేజీ నీరు పైన ఉన్న అన్నారం పంపు హౌసు వరకు చేరదు. అన్నారం బ్యారేజీ గేట్లు మూస్తే బ్యారేజీపై ఒత్తిడి పడుతుంది. ఇప్పటికే అన్నారం బ్యారేజీకి భారీ బుంగలు పడి, పియర్లు కుంగే పరిస్థితి ఉంది. NDSA నిపుణుల ఆదేశాల మేరకు అన్నారం బ్యారేజీలో నీటిని నిలువ చేయడం కుదరదు. కాబట్టి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసినా అన్నారం బ్యారేజీలో నిలువ చేయడం సాధ్యపడదు. నీళ్లు బ్యారేజీలో నిలువ చేయకుండా అన్నారం పంపు హౌసు నడపడం కుదరదు. ఇదే సమస్య సుందిళ్ల బ్యారేజీకి ఉంది. అక్కడ కూడా బ్యారేజీకి అనేక బుంగలు పడ్డాయి. సుందిళ్లలో కూడా కనీసం
 7 మీటర్ల నీటిని నిలువ చేస్తే కానీ నీరు సుందిళ్ల పంపు హౌసును చేరదు. నీటిని నిలువ చేస్తే బ్యారేజీకి ప్రమాదం.  
ప్రస్తుతానికి మేడిగడ్డ పంపుహౌసు నుంచి నీటిని ఎత్తడం అనాలోచిత ప్రతిపాదన. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఒక వేళ ఏమైనా తాత్కాలిక రిపేర్లకు అనుమతిస్తే, అవన్నీ పూర్తిచేసిన తరువాత నీళ్లను ఎత్తే అవకాశం ఉంది. ఈలోగా తొందరపడి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారం బ్యారేజీలో పోస్తే, ఆ ఒత్తిడికి అన్నారం కూడా కుంగితే అది మరింత ప్రమాదం.

కాళేశ్వరం పనికి రాకుండా పోతుందా?  ప్రభుత్వం 
ముందున్న మార్గం ఏమిటి?

లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు పూర్తిగా పనికి రాకుండా పోతుందా? ఇది ప్రజల మనసును తొలుస్తున్న ప్రశ్న. ఇంకో యాభైవేల కోట్లు ఖర్చు పెట్టి, సుమారు 31,000 ఎకరాల భూసేకరణ జరిగితే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొదట గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోసే ప్రణాళిక చేశారు. తరువాత అదనంగా రోజుకు 1 టీఎంసీ, అంటే మొత్తం రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రణాళికలు మార్చారు. మొత్తం లక్షన్నర కోట్ల అంచనా వ్యయంలో అదనపు టీఎంసీ అంచనా వ్యయం రూ 33,459 కోట్లు. ఇందులో రూ 20,372 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. ఈ అదనపు టీఎంసీ ఖర్చు పూర్తిగా వృథానే.  అదనపు టీఎంసీ పనులలో నీటిని సొరంగాల ద్వారా కాకుండా పైపుల ద్వారా తరలిస్తారు. దీనికి ఎత్తిపోతల కరెంటు ఖర్చు చాలా ఎక్కువ. పుష్కరానికి ఒక రోజు తప్ప మూడవ టీఎంసీ పంపులు వాడే అవకాశం ఉండదు. 
ఇక మిగిలిన పనులలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపు హౌసుల నిర్మాణం లోపభూయిష్టంగా జరిగింది. వీటిని సరిచేయడానికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖర్చు చేసి రిపేరు చేసినా, ఏటా విద్యుత్ ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. రిపేర్లు చేయాలా? వద్దా? అన్న విషయం నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను బట్టి నిర్ణయం తీసుకోవాలి. పూర్తి స్థాయిలో రిపేర్లకు ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు. 

- కంచర్ల రఘు
విద్యుత్​ రంగ నిపుణుడు,
(కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
‘రీ‑ ఇంజనీరింగ్​‑భారీ 
ఇంజనీరింగ్​ తప్పిదం’ 
పుస్తక రచయిత)