- దాయమంతా ఊర్లోని బ్యాంకుల్లో డిపాజిట్
- విదేశాల్లోనే దాదాపు 1,200 కుటుంబాలు
గాంధీనగర్: రిచెస్ట్ పర్సన్స్, రిచెస్ట్ కంట్రీ, రిచెస్ట్ సిటీ గురించి వినే ఉంటారు. కానీ రిచెస్ట్ విలేజ్ గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును. ఆసియాలోనే అత్యంతసంపన్నమైన గ్రామం ఒకటుంది. అదీ మనదేశంలోనే. ఆ ఊరు విశేషాలేంటో తెలుసుకుందాం.
గుజరాత్‌లోని కఛ్ జిల్లా మధాపర్ విలేజ్ ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా అవతరించింది. ఈ గ్రామంలోని ప్రజలకు వివిధ బ్యాంకుల్లో రూ.7 వేల కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆసియాలోని ఏ గ్రామానికి కూడా ఇంత పెద్ద అమౌంట్ ఎఫ్డీ లేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. మాధాపర్‌లో దాదాపు 32 వేల మంది నివసిస్తున్నారు. దాదాపు 20 వేల ఇండ్లు ఉన్నాయి. గ్రామంలో హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, పీఎన్బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో సహా మొత్తం 17 బ్యాంకులున్నాయి. మధాపర్ ప్రజలంతా తమ గ్రామంలోని బ్యాంకుల్లో మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్లు చేస్తుంటారు. అలా జమ చేసిన మొత్తం ఇప్పుడు రూ. 7 వేల కోట్లకు చేరింది.
ఇంత డిపాజిట్ ఎలాగంటే..!
మధాపర్ రిచెస్ట్ విలేజ్ అవ్వడానికి ఎన్నారై కుటుంబాలే కారణం. జనాభాలో దాదాపు 1,200 కుటుంబాలు విదేశాల్లో నివసిస్తున్నాయి. సెంట్రల్ ఆఫ్రికాలో నిర్మాణ వ్యాపారాల్లో గుజరాతీలదే ఆధిపత్యం. యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌లోనూ గుజరాతీలు బిజినెస్ చేస్తున్నారు. మధాపర్ కుటుంబాలు ఆయా దేశాల్లో బిజినెస్ చేసి వచ్చిన ఆదాయాన్ని సొంత గ్రామంలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఇలా ఆ గ్రామ బ్యాంకులకు ఏటా కోట్లలో వచ్చాయి. మధాపర్ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సొంత గ్రామంపై అభిమానం కురిపిస్తున్నారని అధికారులు తెలిపారు.
గ్రామాభివృద్ధి భేష్
మధాపర్లోని ఓ జాతీయ బ్యాంకు స్థానిక బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ.. భారీగా డిపాజిట్లు రావడంతో గ్రామం అభివృద్ధి చెందిందన్నారు. నీరు, పారిశుధ్యం, రోడ్లు, వంటి అన్ని ప్రాథమిక సౌలతులున్నాయని చెప్పారు. ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు, గుడులు, చెరువులు, దేవాలయాలు గ్రామ ప్రజలే డెవలప్ చేశారని పేర్కొన్నారు.