సమగ్ర సర్వేకు సన్నద్ధం

  • ఈ నెల 6 నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే 
  •  కామారెడ్డి జిల్లాలో 2,425 మంది ఎన్యుమరేటర్లు
  • మండలానికో స్పెషల్​​ ఆఫీసర్​
  • 215 మంది సూపర్​ వైజర్లు

కామారెడ్డి​​​ ​, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర సర్వేకు కామారెడ్డి జిల్లాలో యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సర్వే ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నారు. ఈ నెల 6 నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే జరగనుంది. ఏర్పాట్లపై కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆఫీసర్లకు మార్గనిర్దేశం చేశారు. ఇండ్ల గుర్తింపు, స్టిక్కరింగ్​, ఎన్యుమరేటర్లు, సూపర్​ వైజర్లు, స్పెషల్​ ఆఫీసర్లను నియమించారు. ఆఫీసర్లకు ఇప్పటికే జిల్లా స్థాయిలో ట్రైనింగ్​ ఇచ్చారు. సర్వేలో సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల వివరాలకు సంబంధించి 56 అంశాలు ఉంటాయి.

ఇప్పటికే ఇంటింటికి స్టిక్కర్​ వేయించారు. సర్వేకు సంబంధించిన సామగ్రి జిల్లాకు చేరింది. జనాభా లెక్కల ప్రకారం 2,26,386 ఇండ్లు , 2 లక్షల 90వేల కుటుంబాలు ఉన్నాయి. వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. 15ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్​ను నియమిస్తున్నారు. 150 ఇండ్లను కలిపి ఒక ఎన్యుమరేట్​ బ్లాక్​గా పరిగణిస్తారు. జిల్లాలో 2,385 ఎన్యుమరేటర్​ బ్లాక్​లు ఉన్నాయి. 

ఎన్యుమరేటర్ల నియమాకం

 ప్రైమరీ స్కూల్​లో పని చేసే టీచర్లు సర్వేలో పాల్గొంటారు. టీచర్లు సరిపోని చోట ఐకేపీ స్టాప్, పంచాయతీ సెక్రటరీలు, ఇతర స్టాఫ్​ను తీసుకోనున్నారు. సర్వే కోసం అంగన్​వాడి టీచర్లు, ఆశ కార్యకర్తల సేవలను కూడా వినియోగించుకుంటారు. జిల్లాలో 2,425 మంది ఎన్యుమరేటర్లను   నియమించారు. 215 మంది సూపర్​ వైజర్లు ఉంటారు. ఒక్కో సూపర్​ వైజర్​ 2, 3  గ్రామాలను పర్యవేక్షిస్తారు. మండలానికో జిల్లా ఆఫీసర్​ స్పెషల్​ ఆఫీసర్​ ను ఉన్నతాధికారులు నియమించారు. సర్వే మధ్యాహ్నాం నుంచి చేపడుతారు. పొద్దున 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రైమరీ స్కూల్స్​ పని చేస్తాయి. మధ్యాహ్న భోజనం తర్వాత సర్వేలో టీచర్లు పాల్గొంటారు.

ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు ..

సమగ్ర సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికార కాంగ్రెస్​ పార్టీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా మీటింగ్​లు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సర్వే ద్వారా బీసీల సంఖ్య తేల్చనున్న నేపథ్యంలో బీసీ సంఘాల ప్రతినిధులను పార్టీ మీటింగ్​కు పిలిచారు. సర్వే సజావుగా జరిగేలా ప్రజలకు అవగాహన కోసం పార్టీ శ్రేణులు కూడా పాల్గొననున్నాయి. కామారెడ్డిలో శనివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన మీటింగ్​కు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్​అలీ, పోచారం శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు, కార్పొరేషన్​ ఛైర్మన్​ బాల్​రాజు, డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు తదితరులు పాల్గొన్నారు.