ప్రపంచంలో బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం సహజం. పెళ్లిళ్లు, పుట్టిన రోజు, పెళ్లి వార్షికోత్సవం, లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, పండగలు, నూతన సంవత్సరం ఇలా అనేక సందర్భాలలో రకాల బహుమానాలను కుటుంబ సబ్యులకు, స్నేహితులకు లేదా సహచరులకు ఇస్తుంటాము. అయితే దీపావళి రోజున ఈ బహుమతుల ద్వారా ఇచ్చిన వారు, తీసుకున్న వారు ఆనంద పడుతుంటారు. జ్యోతిష్యం, వాస్తు విజ్ఞానశాస్త్రం పరంగా కొన్ని బహుమతులను ఇచ్చినా, పుచ్చుకున్నా అదృష్టం కలసి వస్తుందంట. ఇంతకీ ఆ విలువైన బహుమతులేలేంటో ఓసారి చూద్ధాం...
పండుగ సంబురం రెట్టింపు అవ్వాలంటే ఆత్మీయులతో కలిసి జరుపుకోవాలి. ఇల్లు, పిల్లలు, కుటుంబం, బంధువులు అంతా కలిస్తేనే పండుగ. ఈ పండుగ టైంలో ఆత్మీయులతో మాటా ముచ్చట పంచుకున్నట్టే 'బహుమతులు కూడా పంచుకోవాలి. ఈ దీపావళి సందర్భంగా అయినవాళ్లకు ఈ బహుమతులు ఇవ్వాలి.
దీపావళి పండుగకి హ్యాండ్లూమ్ బట్టలు బహుమతిగా ఇస్తే యునిక్ గా ఉంటుంది. ఒంటికి హాయిగా ఉంటుంది.
గణేశుడి, లక్షీదేవి విగ్రహాలు
గణేశుడి ఫోటో లేదా పెయింటింగ్‌ను బహుమతిగా ఇవ్వడం లేదా స్వీకరించడం చాలా శుభప్రదమైనవి. దీని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. గణేశుని అనుగ్రహంతో జీవితంలోని కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ పండుగ నాడు లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు. ఈ సందర్భంలో బంధువులు తమ ఇంటిని అలంకరించుకొని పూజ చేయడానికి చిన్న సైజ్ గణపతి విగ్రహాన్ని, లక్ష్మి విగ్రహాలను ఇవ్వొచ్చు.
వెండి
స్వచ్ఛమైన లోహాలలో వెండి ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం వెండితో చేసిన బహుమతులును ఇతరులకు ఇవ్వడం లేదా స్వీకరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. దాంతో ఇంట్లో డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్ష్మీ దేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందట.
ఏనుగు
హిందూ మతంలో ఏనుగు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏనుగు గణేశుడి వాహనం. ఏనుగు బొమ్మను బహుమతిగా ఇచ్చినా లేదా తీసుకున్నా చాలా శ్రేయస్కరం. వెండి, ఇత్తడి లేదా చెక్కతో ఉండే ఏనుగులను బహుమతిగా ఇస్తే మంచిది. అయితే గాజుతో చేసిన ఏనుగు బొమ్మను బహుమతిగా ఇవ్వొద్దు.
గుర్రం
ఏడు తెల్లని గుర్రాలు పరిగెడుతున్నట్టుగా ఉండే పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చినా లేదా తీసుకున్నాచాలా శుభం జరుగుతుంది. తెల్లని గుర్రాల ఫొటోను ఇచ్చిన వారు లేదా తీసుకున్న వ్యక్తులు తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ.. ధనం బాగా సంపాదిస్తారట.
దుస్తులు
మనం ప్రతిశుభ కార్యంలో వస్త్రాలను మన బందువులకు అందిస్తాం. వీటిని బహుమతి రూపంలో పొందినా లేదంటే ఎవరికైనా ఇచ్చినా ఇరువురికి మంచే జరుగుతుందట. అయితే నలుపు రంగు దుస్తులను మాత్రం బహుమతులుగా ఇవ్వకూడదు
గ్రీటింగ్ కార్డ్
ఈ దీపావళి గ్రీటింగ్ కార్డ్ కూడా మార్కెట్ లో ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిలో సీడ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ గిఫ్ట్ కార్డులతో దీపాలు వెలిగించి, ఆరిపోయిన తర్వాత మట్టితో కప్పితే మొక్క పెరుగుతుంది. ఇవి నేచురల్ ఫ్రెండ్లీ గిఫ్ట్ కూడా..