సుల్తానాబాద్ రాజీవ్ రోడ్డుపై లారీ బీభత్సం

  •     బైక్​లు, పానీ పూరి బండిని ఢీకొడుతూ వెళ్లిన లారీ 
  •      చివరకు చెట్టును గుద్ది ఆగింది 
  •     పలువురికి గాయాలు,    ఇద్దరి పరిస్థితి విషమం

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. తప్ప తాగిన లారీ డ్రైవర్ విచక్షణారహితంగా నడిపి బైకులపై దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చివరకు లారీ ఓ చెట్టును ఢీకొని ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం...కరీంనగర్ వైపు నుంచి వస్తున్న ఓ లారీ ఎప్పుడూ రద్దీగా ఉండే పట్టణంలోని రాజీవ్ రహదారిపై పూసల చౌరస్తా వద్ద ముందుగా ఒక బైకును ఢీకొట్టింది. తర్వాత వరుసగా 8 బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. పక్కనే ఉన్న పానీ పూరి బండిని సైతం ఈడ్చుకు వెళ్లింది. షాపింగ్​ కాంప్లెక్స్​ ముందు నుంచి దూసుకుపోయి ఓ చెట్టును ఢీ కొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో ఇందిరానగర్​లోని ఒకే కుటుంబానికి చెందిన యూసుఫ్, ఇతడి భార్య నసీమా, కొడుకు దిల్షన్, బిడ్డ మనహ గాయపడ్డారు. నసీమా, దిల్సన్ తీవ్రంగా గాయపడగా కరీంనగర్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. లారీ డ్రైవర్​ను స్థానికులు చితకబాదుతుండగా పోలీసులు అడ్డుకుని పీఎస్​కు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. సాయంత్రం 4 గంటలకు ప్రమాదం జరగ్గా, ఎండ తీవ్రతకు జనాలు రోడ్డుపై లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 

రోడ్డు ప్రమాదంలో మూడేండ్ల పాప మృతి

మంగపేట : ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట శివారులో ఓ బైక్​ కల్వర్టును ​ఢీకొట్టడంతో మూడేండ్ల చిన్నారి ప్రాణాలు విడిచింది. మంగపేట ఎస్సై గోదారి రవికుమార్ కథనం ప్రకారం...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేటలోని సుందరయ్య కాలనీకి చెందిన మాడవి అజయ్, తన తల్లి జ్యోతి, కూతురు ఆద్యతో కలిసి బైక్ పై మంగపేట మండలం శ్రీరాంనగర్ గోత్తి కోయగూడానికి బైక్​పై బయలుదేరాడు. జానంపేట శివారులోకి వచ్చేసరికి అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఆద్య, జ్యోతి గాయపడ్డారు. ఏటూరునాగారం హాస్పిటల్​కు తరలించగా ఆద్య చనిపోయింది. జ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎంకు తరలించారు.