తెలుగు పంచాంగం ప్రకారం...... ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుద్ధ నవమి తిథి నాడు శ్రీరామ నవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో రామ రక్ష మంత్రాలను తప్పక పఠించాలి. శ్రీరామ నవమి సందర్భంగా తప్పకుండా పఠించాల్సిన మంత్రాలేవి... వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...
హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రీరాముడు సకల సుగుణవంతుడు.. పురుషులలో ఉత్తముడు.. ఏకపత్నీవ్రతుడు, అమ్మనాన్నల మాటను శిరసా వహించేవాడు.. నిత్యం నిజం చెప్పే గొప్పవాడు.. ఇలా ఎన్నో విశిష్టతలు ఉండే శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామ నవమి రోజున కొన్ని మంత్రాలను కచ్చితంగా పఠించాలి. ఇవి అత్యంత ప్రభావవంతమైనవి.. ఈ శ్లోకాలను పఠిస్తే శ్రీ మహా విష్ణువు సహస్రనామం పఠించినట్టే అని పండితులు చెబుతున్నారు.
ఈ ఒక్క మంత్రంతో శుభ ఫలితాలెన్నో..
‘‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం, రామ రామ వరాననే’’
ఈ ఒక్క శ్రీరాముని శ్లోకం పఠించడం వల్ల శ్రీ మహా విష్ణువు సహస్రనామం పఠించినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు. శివయ్య తన భార్య పార్వతీ దేవితో ఈ మంత్రం చెప్పినట్లు పురాణాల్లో వివరించబడింది. ఈ మంత్రంలో ‘ర’కారము రుద్రుడిని.. ‘అ’కారము బ్రహ్మయ్యను, ‘మ’కారము శ్రీహరిని సూచిస్తుంది. అందుకే ‘రామ’ అనే పదాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా పరిగణిస్తారు.
ఎలాంటి ఫలితాలొస్తాయంటే..
శ్రీరామ నవమి రోజున రాముడికి ప్రత్యేక పూజలు చేసి, శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని, రామ మంత్రాలను జపించడం వల్ల సకల పాపాలు తొలగిపోవడమే కాదు.. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. అందుకే ఈ పవిత్రమైన ‘రామ’ నామాన్ని కచ్చితంగా జపించండి. పురాణాల ప్రకారం, ఈ నామాన్ని ఉచ్చరించడం వల్ల పుట్టుకతోనే అతి కిరాతకంగా ఉండే బోయ వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రచించే స్థాయికి ఎదిగాడు. తను గొప్ప స్థాయికి ఎదిగేందుకు ‘‘రామ రామ రామ’’ అనే తారక మంత్రం ఎంతగానో తోడ్పడింది.
‘రామ’ అనే రెండక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.
చిన్నారులతో ఈ శ్లోకాలను..
శ్రీరామ నవమి రోజున రాముని విశిష్టత తెలిపే ఈ శ్లోకాలను పిల్లలతో చదివించండి.. వారు రాముని జీవితం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దండి.
‘‘ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహుమ్
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్’’
ఈ శ్లోకాలను పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు పలు వేదికలపై తెలిపారు.