Telangana Special : గోవర్థనగిరిలోని అందాల గుట్టలో.. అంజన్న ఆలయం.. వరదపాశం ఇక్కడ స్పెషల్

ఎక్కడైనా పచ్చని పంట పొలాలు, అందమైన దృశ్యాలు కనిపిస్తే.. వావ్ సూపర్ స్పాట్.. అచ్చం కోనసీమలా భలే ఉంది. కదా! అంటుంటాం. అలాంటి స్పాట్ మన తెలంగాణలోనూ ఒకటుంది. అదే సిద్దిపేటలోని గోవర్ధనగిరిలోని సంజీవరాయుని గుట్ట. శ్రావణమాసం సందర్భంగా ఈ గుట్ట టూరిస్టులు, భక్తులతో నిండిపోతుంది.

గుట్ట మీద నుంచి కిందకు చూస్తే ప్రకృతి సమ్మక్క, సారలమ్మ గద్దెలు కూడా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. ఎటు చూసినా పచ్చని పొలాలు కనిపిస్తాయి. ఈ గుట్ట సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరిలో ఉంది.  వంద ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ గుట్టపైకి ఎక్కుతుంటే తిరుపతి కొండను ఎక్కుతున్న ఫీలింగ్ కలుగుతుంది. గుట్ట ఎక్కుతున్నప్పుడు రకరకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. గుట్టపై ఉన్న చారిత్రక కట్టడాలు ఆకట్టుకుంటాయి. 

చాళుక్యులు నిర్మించిన ఖిల్లా. నీటి కొలను, సొరంగం, రేగొండ దర్వాజ, ఆంజనేయ స్వామి గుడిని ఇక్కడ చూడొచ్చు. పరిసర ప్రాంతాలు అరకు లోయ మాదిరిగా, ప్రకృతి పచ్చని చీర కట్టుకున్నట్టు ఉంటుంది. గుట్ట కింది భాగంలో సమ్మక్క, సారలమ్మ గద్దెలు కూడా ఉన్నాయి. 

Also Read :- ప్లాస్టిక్ పెరిగితే పిల్లలు పుట్టరట

శ్రావణ మాసంలో ఇక్కడ వన భోజనాలు చేస్తారు. వానలు కురవాలని, పంటలు బాగా పండాలని గుట్ట మీద అంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అంజనేయుడిని దర్శించుకోవడానికి రెండు బండరాళ్ల మధ్య నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఒకరు మాత్రమే వెళ్లే వీలుంటుంది. ఇక్కడ గుడిని దర్శిస్తే.. కొండగట్టు అంజన్నను చూసిన అనుభూతి కలుగుతుందంటారు భక్తులు.

వర్షాలు బాగా కురవాలని గొల్లకుర్మ యాదవులు ఈ గుట్టపై వరదపాశం నిర్వహిస్తారు. ఇది మొత్తం ఆసక్తిగా ఉంటుంది. గ్రామం నుంచి గంపలో బియ్యం, బెల్లం, పాలు, ఇతర ఆహార పదార్థాలు పెట్టుకుని, డోలు చప్పుళ్లతో ఊరేగింపుగా గుట్టపైకి తీసుకొస్తారు. గుట్టపై స్నానం చేసి వరదపాశం తయారు చేసి కోనేరు సమీపంలో గుట్టపై పోస్తారు. వేడి వేడి పాశం పారుతూ కోనేరులోకి జారిపోతుంది. పండుగను జరుపుకునేవాళ్లు నేల మీద పారు తున్న పాశాన్ని తిని.. ఆ తర్వాత స్నానం చేస్తారు. మహిళలు గుట్టపై బతుకమ్మ ఆడతారు. వరుణ దేవుడిపై పాటలు పాడతారు. ఆ తర్వాత వరద పాశం తీసుకెళ్లి పంట పొలాల్లో చల్లుతారు. వరదపాశం చల్లితే పంటలు బాగా పండుతాయని ఇక్కడివాళ్ల నమ్మకం.