బైబై గణేశా.. గంగమ్మ ఒడికి గణపయ్య

  • గంగమ్మ ఒడికి గణపయ్య
  •  భారీ భద్రత మధ్య గణేశ్​నిమజ్జనం
  •  భక్తుల కోలాహలం మధ్య గణేశుడి శోభాయాత్ర

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్​, వెలుగు : తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న గణేశుడు.. ఇక వెళ్తున్నా.. మళ్లొస్తా అంటూ గంగమ్మ తల్లి ఒడికి చేరాడు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేశ్​నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. భక్తుల కోలాహలం మధ్య గణేశుడు ఊరేగారు. వాయిద్యాల హోరులో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గణేశుడిని కీర్తిస్తూ భక్తులు దేవదేవుడిని తల్లి గంగమ్మ ఒడికి చేర్చారు.

యాదాద్రి జిల్లాలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి పూజలు నిర్వహించారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, సూర్యాపేటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, సహా వివిధ పార్టీల నాయకులు గణేశుడికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. యాదాద్రిలో బందోబస్తు ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్​బాబు, డీసీపీ రాజేశ్ చంద్ర, నల్గొండలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ కేశివరాంరెడ్డి పర్యవేక్షించారు. 

నల్గొండ మోడల్​జిల్లా : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రంలోనే నల్గొండను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. మతం కన్నా.. మానవత్వం ముఖ్యమని తెలిపారు. నల్గొండ జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మానవత్వంతో పనిచేయాలని, పేదలను ఆదుకోవడమే మన ఆశయం కావాలని పిలుపునిచ్చారు. రూ.2 వేల కోట్లతో హైదరాబాద్- – విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ పనులకు త్వరలోనే కేంద్ర మంత్రి గడ్కరి శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు.

రూ.13.50 లక్షలకు లడ్డూ దక్కించుకున్న నాగం వర్షిత్​రెడ్డి 

నల్గొండ పాతబస్తీలోని హనుమాన్ నగర్​వినాయకుడి లడ్డూ వేలం పాటలో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. వేలం పాటలో రూ.13.50 లక్షలకు ఆయన లడ్డూ దక్కించుకున్నారు. లడ్డూ తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.