ఒక్కో దేవుడు ఒక్కో రకంగా దర్శనమిస్తాడు. శ్రీ మహా విష్ణువు ఆదిశేషుడిపై పవళించి ఆయన పాదాల చెంతన భూదేవి... వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువుంటారు, శివుడి తలపై గంగ... తన శరీరంలో అర్దభాగాన్ని పార్వతికి ఇచ్చాడు . కాని అయ్యప్ప స్వామి పట్టబంధంలో కనిపిస్తాడు. మోకాళ్లకు పట్టీ ఉండి.. కూర్చొని యోగాసనంలో భక్తులకు దర్శనమిస్తాడు. దీనికి గల కారణమేమిటో ఒకసారి తెలుసుకుందాం. . . .
హరిహరాదుల అంశతో జన్మించిన శబరిమల అయ్యప్పస్వామి చిన్ముద్రిధారియై భక్తులకు దర్శనమిస్తారు. మిగతా దేవతలతో పోలిస్తే స్వామివారు యోగాసనంలో కూర్చుంటారు. స్వామి మోకాళ్ల చుట్టూ బంధనం ఉంటుంది. దీన్ని పట్టబంధనం అంటారు.
ధర్మ స్థాపన కోసం మానవరూపం
మహిషి సంహారం కోసం మానవ రూపంలో అవతరించిన హరిహరసుతుడు పందళరాజు వద్ద పెరిగాడని పురాణాలు చెబుతున్నాయి . సంతానం లేక బాధపడుతోన్న పందళరాజు అడవిలో దొరికిన బాలుడిని మణికంఠుడిగా పెంచి పెద్ద చేశాడు.ఆయనకు విద్యాబుద్దులు చెప్పించి, రాజుగా పట్టాభిషేకం చేయాలని భావించాడు. అయితే తాను హరిహరసుతుడనని, ధర్మసంస్థాపన కోసం మానవ రూపంలో మహిషి సంహారం కోసం అవతరించాననే సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్నారు.
యోగాసనంలో జ్ఞాన పీఠంపై...
మహిషిని వధించిన అయ్యప్పస్వామి తన అవతారం పూర్తయిందని పందళరాజుకు చెప్పి, తన కోసం ఆలయాన్ని నిర్మించమన్నారు. స్వామి కోరిక మేరకు శబరిమల ఆలయంలో పందళరాజు ఆలయం నిర్మించారు. అలా చిన్ముద్ర దాల్చి యోగాసనంలో జ్ఞాన పీఠంపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటారు. శబరిగిరిపై ఆలయం నిర్మించి, స్వామికి ఆభరణాలు సమర్పించేందుకు పద్దెనిమిది మెట్లెక్కి పందళరాజు వస్తారు.
స్వామి మోకాళ్లను పట్టు వస్త్రంతో బంధించిన రాజు
తన పెంపుడు తండ్రి పందళరాజు రాకను గుర్తించిన స్వామి.. యోగాసనం నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తారు. దీంతో పందళరాజు స్వామివారిని నిలువరించి తన భుజాన ఉన్న పట్టు వస్త్రంతో స్వామివారి మోకాళ్లకు చుట్టి బంధిస్తారు. తాను అయ్యప్పస్వామిని ఏ విధంగా చూసి తరించానో అదేవిధంగా భక్తులకు అదే రూపంలో దర్శనం ఇవ్వాలని అయ్యప్పస్వామిని అర్థించడంతో ఆయన అనుగ్రహించారు. అలా కట్టి ఉన్నదానిని పట్ట బంధం అంటారు. ఇది శివకేశవులను ఐక్య పరిచే బంధమని కూడా అంటారు. తనకు ఎలాంటి భవబంధాలు లేవని చెప్పడానికి స్వామి ఈ ఆసనంలో కూర్చుంటారని అంటారు.