- బీఆర్ఎస్కు కానరాని క్యాండిడేట్
- పోటీకి గులాబీ లీడర్ల వెనుకడుగు
- పార్టీయే ఖర్చు భరిస్తే ఓకే అంటూ సంకేతాలు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో లోక్‌సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. బీజేపీ నుంచి మరోసారి పోటీ చేయనున్న ఎంపీ అర్వింద్ పూర్తిగా నియోజకవర్గంపై ఫోకస్ చేశారు. స్థానికంగా జరిగే పార్టీ ప్రోగ్రామ్స్‌కు అటెండ్ అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడానికి లీడర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఎవరికి వారే టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్నుంచి పోటీ చేయడానికి గులాబీ నేతలెవరూ ఇంట్రెస్ట్‌గా లేనట్లు తెలుస్తోంది. హైకమాండ్ క్యాండిడేట్ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
డీసీసీ నుంచి ముగ్గురి పేర్లు
రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్‌లోకి రావడంతో పార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ డీసీసీని సంప్రదించగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి, మైనార్టీ నేత తాహెర్ బిన్హందాన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్ పేర్లను హైకమాండ్‌కు పంపారు. ఈ ముగ్గురు నేతలు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ ఆశించారు.
లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మొన్నటి ఎన్నికల్లో ఆరుగురు ఓసీలు, ఒక మైనార్టీ నేత పోటీ చేశారు. కాబట్టి లోక్‌సభ టికెట్బీసీకి ఇవ్వాలనే వాదన ఆ సామాజిక వర్గం నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ మేయర్ సంజయ్ కూడా టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కూడా రేసులో ఉన్నారు. జిల్లాకు చెందిన సినీ నిర్మాత దిల్‌రాజు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా పోటీకి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్లో నిస్తేజం..
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, బీజేపీలు ఏదో రకమైన యాక్టివిటీ చేపడుతుండగా, బీఆర్ఎస్లో మాత్రం నిస్తేజం నెలకొంది. లోక్‌సభ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నా గెలుపుపై నమ్మకంతో ఎంపీ ఎన్నికల్లో రంగంలోకి దిగడానికి లీడర్లెవరూ ముందుకు రావడంలేదు. గతంలో అర్వింద్ చేతిలో ఓడిన ఎమ్మెల్సీ కవిత కూడా వెనుకడుగు వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తాను పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తుండగా, ఖర్చు మొత్తం పార్టీనే భరించాలనే ప్రతిపాదన హైకమాండ్ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. బిగాల గణేశ్‌గుప్తా తమ్ముడు బిగాల మహేశ్గుప్తాను సంప్రదించగా ఆయన పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది.
ఎంపీ అర్వింద్‌కు క్లియరెన్స్!
బీజేపీ నుంచి మరోసారి కాంటెస్ట్ చేసేది తానేనన్న ధీమాతో ఎంపీ అర్వింద్ సెగ్మెంట్లో ఎక్కువ టైమ్‌కే టాయిస్తున్నారు. నిత్యం ఆయా ప్రోగ్రామ్స్‌తో ప్రజల మధ్య ఉంటున్నారు. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు. సరిగ్గా ఎలక్షన్ వేళ తన అనుచరుడైన దినేశ్కులాచారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇప్పించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, ప్రధాని మోదీ క్రేజ్ పార్టీ ఓటు బ్యాంకును మరింత పెంచుతాయనే అంచనాలో ఆ పార్టీ లీడర్లు ఉన్నారు.
ఎంపీ అర్వింద్సైతం రామరాజ్యం ప్రస్తావన లేకుండా స్పీచ్ ఇవ్వడం లేదు. ఆర్ఎస్ఎస్బ్యాక్ గ్రౌండ్ ఉన్న అల్జాపూర్ శ్రీనివాస్ కూడా ఎంపీ టికెట్ కోసం పార్టీకి బయోడేటా పంపడం చర్చనీయాంశమైంది. 40 ఏండ్ల నుంచి కాషాయ పార్టీలో ఆయా బాధ్యతలు నిర్వహించిన తనకు పోటీ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.