న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మరోసారి ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కుల గణనకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. "కుల గణనకు నా పార్టీ(ఎల్‌జేపీ) మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నాను. కులాల ఆధారంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన జరగాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులాన్ని దృష్టిలో ఉంచుకునే అనేక పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. అలాంట ప్పుడు ఏ కులం జనాభా ఎంత ఉందో లెక్క తేల్చాల్సిందే. ఎక్కువ జనాభా ఉన్న వెనుకబడి న వర్గాల ప్రజల ప్రయోజనం కోసమే పథకాలు అమలు చేయాలి. బడ్జెట్ కేటాయింపులు కూడా కులగణన ప్రాతిపదికనే జరగాలి" అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఇటీవల లేటరల్ ఎంట్రీ విధానాన్ని కూడా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా కుల గణనను ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను పార్లమెంటులో బీజేపీ వ్యతిరేకించింది.