మాకూ కావాలి హైడ్రా

  • గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాలి
  • పాత రికార్డుల ప్రకారం హద్దులు గుర్తించాలే..
  • కబ్జాలపై ఉక్కుపాదం మోపాలంటున్న జిల్లా వాసులు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక గొలుసుకట్టు చెరువులు, కందకాల ఆక్రమణలపై హైదరాబాద్​లోని హైడ్రా తరహాలో చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు కబ్జాదారులు అధికారుల అండదండలతో ఈ చారిత్రక చెరువులు, కందకాలను కబ్జా చేశారు. భూముల సర్వే నంబర్ల పేరిట రికార్డులు తారుమారు చేసి ఆ చెరువు భూములకు పట్టాలు సృష్టించుకొని ఆ స్థలాల్లో భారీ కమర్షియల్ కాంప్లెక్స్​లు, గృహ సముదాయాలు, అపార్ట్​మెంట్లు నిర్మిం చారు. దీంతో చెరువులు‌, కందకాల రూపురేఖలే మారిపో యాయి. చెరువులు కుంటలుగా మారితే..  చాలా చోట్ల కందకాలు  లేకుండాపోయాయి. ఫలితంగా ప్రతి ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునుగుతున్నాయి.

సర్వేలు బుట్టదాఖలు

చెరువుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు హద్దులు నిర్ధారించాలని అప్పట్లో సర్వే చేపట్టారు. కానీ ఆ సర్వే కేవలం 2 చెరువులకు మాత్రమే పరిమితమైంది. కంచరోని చెరువు, కుర్రన్నపేట చెరువు విస్తీర్ణాన్ని డీజీపీఎస్ తో సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. ఆక్రమణకు గురైన భూములను గుర్తించి హద్దుల ఆధారంగా ట్రెంచ్​లు ఏర్పాటు చేశారు. 

ఈ సర్వేను రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారు లతో నాటి కలెక్టర్ సంయుక్తంగా చేపట్టారు. కానీ ఆ తర్వాత ముందుకు సాగలేదు. మిగతా 10 చెరువుల సర్వే చేపట్టలేదు. సాంకేతికంగా చెరువు భూముల హద్దులను గుర్తించకపోవడంతో ఇష్టారాజ్యంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూముల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి.

పాత రికార్డులు వెలికితీస్తే నిజానిజాలు

కాగా ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్న చెరువు భూముల రికార్డులకు వాస్తవ పరిస్థితులకు భారీ తేడా ఉన్నట్లు సమాచారం. అడ్డగోలు ఆక్రమణలు, కబ్జాలతో చెరువుల విస్తీర్ణం 70 శాతానికి పైగా కనుమరుగైందని ఆరోపణలున్నాయి. బంగల్​పేట చెరువు 210.32 ఎకరాలు, మోతి తలాబ్ చెరువు 132.06, ఖజానా చెరువు 98.22, చిన్న చెరువు మంజులా పూర్ 81.34, జాపూర్ కూరన్నపేట చెరువు 76.18, ఇబ్రహీం చెరువు 76.18, కంచరోని చెరువు 74.19, ధర్మసాగర్ 65.10 , సీతాసాగర్ గొల్లపేట 48.11,  కొత్త చెరువు 33.11, రామ్ సాగర్ చెరువు 37.23 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారుల వద్ద ఉన్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 

కానీ అన్ని చోట్ల అనేక ఎకరాల్లో చెరువుల భూములు కబ్జాలకు గురై విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. పాత రికార్డల ప్రకారం రీ సర్వే జరిపినట్లయితే ఆ భూముల్లో జరిగిన ఆక్రమణల లెక్కలు తేలుతాయని స్థానికులు పేర్కొంటున్నారు. కబ్జాలపై హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హైడ్రాను ముథోల్​సెగ్మెంట్​లో అమలు చేయాలి

భైంసా, వెలుగు: హైదరాబాద్​లో చెరువుల అక్రమణలు, భూకబ్జాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాను ముథోల్​నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేయాలని సోషల్​జస్టిస్​ఫర్​హ్యూమన్ రైట్స్​కౌన్సిల్​ డిమాండ్ చేసింది. మంగళవారం భైంసాలో కౌన్సిల్​ సెగ్మెంట్​డైరెక్టర్​సాప పండరి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ముథోల్​నియోజకవర్గంలో హైడ్రా ద్వారా చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కబ్జాదారుల నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. కౌన్సిల్​సభ్యులు వాల్కోడే పెంటాజీ, సూర్యవంశీ సాయి, వికాస్, సాయినాథ్, దత్తు సింగ్ పాల్గొన్నారు.