బైక్ అంబులెన్స్ లు కాదు..ఫీడర్​ అంబులెన్స్ ​కావాలే

  • మన్యంలోని మారుమాల గ్రామస్తుల వేడుకోలు
  • ఇటీవల ఐటీడీఏకు 10 బైక్​ అంబులెన్స్ లు పంపిన ప్రభుత్వం 
  • అత్యవసరంగా మందులు పంపేందుకు ఓకే.. పేషెంట్​ను తరలించేందుకే ఇబ్బంది
  • సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామంటున్న వైద్యాధికారులు 

భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో దారిలేని మారుమూల అటవీ గ్రామాల్లో అత్యవసర వైద్యం కోసం బైక్ అంబులెన్స్ లు కాదు.. ఫీడర్ ​అంబులెన్స్ ​కావాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల ఐటీడీఏకు ప్రభుత్వం 10  బైక్​ అంబులెన్స్ లను కేటాయించింది. వీటితో కొండలు, గుట్టలు, వాగుల ఆవల ఉన్న గ్రామాలకు వెళ్లి పేషెంట్​కు చికిత్సలు అందిస్తారు.

 కానీ పేషెంట్​ను సమీప పీహెచ్​సీకి తీసుకురాలేని పరిస్థితి ఉంటుంది.  ఏపీ, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో వాడుతున్న ఫీడర్​ అంబులెన్స్​ తరహా వాటిని భద్రాద్రికొత్తగూడెం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ ప్రభుత్వాన్ని అడిగింది. కానీ బైక్ ​అంబులెన్స్​లు ఇచ్చారు.  ఫీడర్​ అంబులెన్స్ లో ఒక పేషెంట్​ పడుకునేలా చిన్న క్యాబిన్​, ఆక్సిజన్​ సిలిండర్​, 12 రకాల వైద్య పరికరాలు, అత్యవసర మందులు ఉంటాయి. అవసరమైతే పేషెంట్​ను అందులోనే దగ్గరలో ఆసుపత్రికి తీసుకురావొచ్చు. 

75 మారుమూల గ్రామాల కోసం...

భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని చర్ల, సత్యనారాయణపురం, దుమ్ముగూడెం, పర్ణశాల, మంగపేట, ఉల్వనూరు,ఆళ్లపల్లి, గుండాల, గుమ్మడివల్లి, పినపాక పీహెచ్​సీల పరిధిలో 75 మారుమూల గ్రామాలకు పెద్ద వాహనాలు వెళ్లడానికి మార్గం లేదు. మధ్యలో వాగులు, రహదారి సౌకర్యం లేని  ఈ గ్రామాల్లో గిరిజనుల కోసం ఇటీవల బైక్​ అంబులెన్స్ లను ప్రభుత్వం కేటాయించింది. 

ఇవి ఇటీవల మేడారం జాతరలో భక్తుల వద్దకు వేగంగా వైద్యసిబ్బంది చేరుకునేందుకు ప్రభుత్వం ఉపయోగించింది. 40 బైక్​లు ఉండగా అందులో 10 బైక్​లను భద్రాచలం ఐటీడీఏకు వైద్యారోగ్యశాఖ ప్రపోజల్స్ మేరకు పంపించారు. అవెంజర్స్ ఫస్ట్ రెస్పాండర్​ అంబులెన్స్ అని పిలిచే ఈ బైకులో కేవలం ఫస్ట్ ఎయిడ్​ బాక్స్ మాత్రమే ఉంది. దీనికి ఒక మైక్​ ఉంది. రోగిని పరీక్షించి, మందులు మాత్రమే ఇస్తారు. పేషెంట్​ను అత్యవసరంగా తరలించే వీలు లేదు.

జట్టీలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో...

ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వరదల సమయంలో ఆదివాసీలు వైద్యశాలకు రావాలంటే జట్టీలే దిక్కు. మంచాన్ని తిరగేసి కర్రలు కట్టి అందులో పేషెంట్​ను పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకొస్తారు. పెద్ద వాహనాలు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. వీటికి స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో వైద్య,ఆరోగ్యశాఖ ఏపీ, ఛత్తీస్​గఢ్​ తరహాలో ఫీడర్ అంబులెన్స్ లు కావాలంటూ ప్రపోజల్స్ పెట్టారు. గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగులను ఇందులో తీసుకురావడానికి వీలుగా ఇవి ఉండాలని కోరారు. కానీ మేడారం జాతరలో ఉపయోగించిన బైక్ అంబులెన్స్ లు ఇవ్వడంతో ప్రభుత్వం మరోసారి ఆలోచించి పీడర్​ అంబులెన్స్​లు ఇచ్చేలా చూడాలని  పలువురు కోరుతున్నారు.

పీవో దృష్టికి తీసుకెళ్తాం

బైక్​ అంబులెన్స్ ల విషయం ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన 10 బైక్​లను మోడిఫై చేసి వినియోగించుకునేలా చర్యలు చేపడతాం. ఏపీ,  ఛత్తీస్​గఢ్​ తరహాలో ఫీడర్​ అంబులెన్స్ లు కావాలని ప్రపోజల్స్ ఇచ్చాం. ఆఫీసర్ల సూచనల మేరకు వాటిని వినియోగిస్తాం.

డాక్టర్​చైతన్య, మాతా,శిశు విభాగం, జిల్లా కో ఆర్డినేటర్