గద్వాలలో లోకల్, నాన్ లోకల్ వార్!

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో స్థానిక వ్యాపారులు, ఇతర రాష్ట్రాల వ్యాపారుల మధ్య లోకల్, నాన్ లోకల్ వార్ ముదురుతోంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు గద్వాల జిల్లాతో పాటు గద్వాల టౌన్ లో ఎక్కడా షాపులు పెట్టకూడదని, వ్యాపారాలు చేయకూడదని డిమాండ్ చేస్తూ స్థానిక వర్తక వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గురువారం బంద్​నిర్వహించింది. ఇందులో కిరాణా, స్వీట్స్, హార్డ్ వేర్, టైల్స్, ఎలక్ట్రికల్, బార్బర్,  హోటల్స్, బట్టల షాపులతో పాటు అన్ని రకాల వ్యాపార సంస్థలు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి షాప్​ల రెంట్లను, డిపాజిట్లను అమాంతం పెంచేసి స్థానిక వ్యాపారులు బిజినెస్ ​చేసుకోకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా డూప్లికేట్ వస్తువులను తయారు చేసి తక్కువ ధరలకు అమ్ముతూ తమ పొట్ట కొడుతున్నారంటున్నారు. దీంతో తమకు న్యాయం జరగాలంటే స్థానిక వ్యాపారులు 80% బిజినెస్ చేసుకునేలా, 20 శాతం స్థానికేతరులు, కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకునేలా చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఏడాదిగా ఒక్క షాపు ఏర్పాటు కాలే..

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో రాజస్థాన్, గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాల వారు షాపులు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే సంఘంగా ఏర్పడిన స్థానిక వ్యాపారులు కొంతకాలంగా అడ్డుకుంటున్నారు. దీంతో ఏడాదిగా ఒక్క కొత్త షాపు కూడా ఏర్పాటు కాలేదు. ఇదివరకు షాపులు పెట్టుకున్న వారు నడుపుకోవచ్చని, కొత్తగా మాత్రం పెట్టడానికి వీల్లేదంటున్నారు.  

 బిన్నాభిప్రాయాలు

ఇతర రాష్ట్రాల వారు షాపులు ఏర్పాటు చేయవద్దంటూ స్థానిక వ్యాపారులు చేస్తున్న డిమాండ్​పై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వారి షాపులో తక్కువ ధరకే వస్తువులు దొరుకుతున్నాయని,  తమకు ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే కొనుక్కుంటామని, వారితో పోటీ పడాలి కానీ, షాపులే పెట్టొద్దంటే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినవారు కూడా ఇతర ప్రాంతాల్లో షాపులు నడుపుతున్నారని వారికి కూడా అక్కడ ఇదే పరిస్థితి ఎదురైతే ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల వారు రావద్దు

గద్వాలటౌన్​ చిన్నది. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారి రాకతో, కార్పొరేట్ వ్యవస్థలతో వీధి వ్యాపారులతో పాటు చిన్న వ్యాపారులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నరు. అప్పులు చేసి ఊర్లు వదిలిపెట్టి వేరే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్థానికులకి 80% బిజినెస్​పై రిజర్వేషన్ కల్పించి చట్టం చేయాలి.
- శ్రీహరి, వర్తక వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడు, గద్వాల