రుణమాఫీ దేశానికే రోల్ మోడల్

 రైతుల గుండెల్లో,  చరిత్ర పుటల్లో,  సువర్ణ అక్షరాలతో  చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు18 జులై 2024.  దేశవ్యాప్తంగా ఉన్న  రైతు సంఘాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతులంతా తెలంగాణ వైపే చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు, రైతులు ఏరికోరి తెచ్చుకున్నది కాంగ్రెస్​ ప్రజాపాలన.  రైతు కళ్లల్లో ఆనందం కోసం ఎంత భారమైనా మోస్తాం, ఎంత దూరమైనా వెళ్తామని సీఎం రేవంత్​ రెడ్డి రుజువు చేశారు. 

 ఏకకాలంలో   రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరొకసారి రుజువైంది.  రుణమాఫీ  ప్రారంభంతో  రైతుల సంతోషానికి హద్దులు, అవధులు లేవు.  రుణమాఫీతో  రైతులు వారి కుటుంబాలు రుణం విముక్తులు కావడంతో ఈ ప్రజాపాలన పదికాలాలు పచ్చగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నారు. రాహుల్ గాంధీ  6 మే  2022న వరంగల్ రైతు డిక్లరేషన్​లో ఇచ్చిన మాటకోసం ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం, కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.

కే సీఆర్ పాలనలో తెలంగాణ లూటీకి గురైంది.  రాష్ట్ర  ఖజానాను కేసీఆర్​ఆయన కుటుంబ సభ్యులు యథేచ్ఛగా కొల్లగొట్టారు. ఆంధ్రా పెట్టుబడిదారుల కంటే ఎక్కువ  కేసీఆర్ పరిపాలనలోనే తెలంగాణ ఆర్థికంగా చితికిపోయింది. రూ.17,000 కోట్ల మిగులు బడ్జెట్​తో మొదలైన ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. దీంతో  కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన దోపిడీని మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 32.50 లక్షల మంది రైతులకు  మేలుచేసే రుణమాఫీకి, కట్ ఆఫ్ డేట్ 12 డిసెంబర్  2018 నుంచి 9 డిసెంబర్  2023 వరకూ, ఈ ఐదు సంవత్సరాలలో రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయాలని రుణమాఫీ  ప్రక్రియ మొదలుపెట్టింది కాంగ్రెస్​ ప్రభుత్వం. 

రుణమాఫీకి 31 వేల కోట్ల నిధులు 

జులై 18న లక్ష వరకు రుణం ఉన్న రైతులందరికీ మొత్తం ఒకేసారి బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించింది.  మెసేజ్ రాగానే పాస్ పుస్తకాలను వెంటనే రైతులు బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. ఆగస్టులోపు రూ.1.5 లక్షలు, రుణం ఉన్న రైతులకు ఒకేదఫా మాఫీ జరుగుతున్నది. రూ.2 లక్షలు రుణం ఉన్న రైతులకు ఆగస్టు 15 లోపల పూర్తిగా రుణమాఫీ జరుగుతుంది.  కేసీఆర్​ పదేండ్లలో చేసింది కేవలం రూ. 28 వేల కోట్లు మాత్రమే,  రైతులు డిఫాల్టర్లుగా మారి, కేసీఆర్ దఫదఫాలుగా రుణమాఫీ జాప్యం చేసిన కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ, ప్రజాప్రభుత్వం 8 నెలల్లోనే 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తోంది. 

రుణమాఫీ అప్పుడూ, ఇప్పుడూ కాంగ్రెస్​ ప్రభుత్వాలే చేశాయి

గతంలో యూపీఏ  ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఒకేసారి 3.73 కోట్ల మంది రైతులకు రూ.72వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని,  తెలంగాణలో  అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఇంత పెద్ద హామీని అమలుచేస్తున్న  సీఎం రేవంత్​ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ అభినందించారు. ఇంత సాహసోపేతమైన నిర్ణయాన్ని స్పష్టతతో  అమలుచేస్తున్న క్రమంలో నిర్మాణాత్మక పాత్రలో ప్రతిపక్ష పార్టీలు ప్రజా ప్రభుత్వానికి సహకరించాలి. కానీ, ఇందుకు భిన్నంగా ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి.

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు

రైతులను కన్ఫ్యూజన్ కు గురిచేసి ప్రతిపక్షాలు రాక్షసానందం పొందుతున్నాయి.  బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి,  బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతులను తప్పుదోవ పట్టించేటట్టుగా మాట్లాడుతున్నారు.  ప్రజా ప్రభుత్వం రైతులకు చేస్తున్న సాయాన్ని అందిస్తూనే విపక్షాల వంకర బుద్ధికి సమాధానం చెపుతున్నది.  కుటుం బానికి రెండు లక్షల రుణమాఫీ మా హామీ నెరవేర్చడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. 

కుటుంబ సభ్యుడు అని నిర్ధారించుకోవడానికి రేషన్ కార్డు చూస్తామన్నామే తప్ప రుణమాఫీకి రేషన్ కార్డుకి ఏమీ లింక్ లేదు.  తెలంగాణ  రైతు, తెలంగాణలో భూమి,  ఆ భూమిపై  బ్యాంకులో రుణం ఉండాలి. ఈ మూడు అంశాలను ఆధారంగా చేసుకుని రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతున్నది.  రైతులను ఆందోళనకు గురి చేయడానికే  ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. 

రేషన్​కార్డు లేని రైతులకూ రుణమాఫీ

‘రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడటానికి ఎంత భారమైన మోస్తాం’ ఇదే మన ప్రజా ప్రభుత్వం నినాదం.  రేషన్ కార్డులు లేని రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుంది.  ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించేటట్టుగా, వివాద పరిష్కార  కేంద్రాన్ని ప్రతి మండలంలోని సంబంధిత వ్యవసాయ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తామని  ప్రజా ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.  

రైతులకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు తెలుగులోనే జీవో జారీ చేయడం జరిగింది. మరి జీవోలో ఇంత స్పష్టంగా ఉంటే హరీష్ రావు, కేటీఆర్,  బీజేపీ నాయకులు ఎవరికోసం పోరాడుతున్నారో దయచేసి  ప్రజలు గమనించాలని కోరుతున్నాం. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వందల ఎకరాలు ఉన్న బడాబాబులకు, వ్యాపార దిగ్గజాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, జాతీయ రహదారులకు ప్రజల సొమ్మును పుట్నాలవలె పంచి పెట్టాలని వారి వారి సన్నిహితుల కోసం పోరాడుతున్నారు అంతేగాని సామాన్య రైతుల కోసం కాదు. 

హరీష్​రావు రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలి

కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్​లోమే 6,  2022 నాడు హామీ ఇస్తే  ఆనాటి నుంచి కాకుండా డిసెంబర్ 12, 2018 నుంచి రుణమాఫీ  చేస్తున్నామంటేనే  మాకు  రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి మన రైతన్నలకు తెలుసు. మాజీ మంత్రి హరీష్ రావు, తన రాజీనామా లేఖను  స్పీకర్ ఫార్మాట్ లో సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది, రుణమాఫీ చేస్తే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అమరవీరుల  స్థూపం సాక్షిగా ప్రమాణం చేసి, ఇప్పుడు తప్పించుకునేందుకు పోరాడుతున్నారు. 

కేంద్రంలో మోదీ,  తెలంగాణలో కేసీఆర్​ పాలనలో ఆగమైన రైతుల బతుకులను ఆదుకోవడానికి,  రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఇంత సాహసోపేతమైన నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో  మన ప్రజా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రికి, రాష్ట్ర  మంత్రులకు రైతులు ప్రతి ఊరు,- ప్రతి వాడలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమను రుణ విముక్తుల్ని చేసి అండగా నిలబడే ఈ ప్రజాపాలన పది కాలాలు పచ్చగా వర్ధిల్లాలని ఈ ప్రజా ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు.

 డాక్టర్ కొనగాల మహేష్,
కాంగ్రెస్ పార్టీ
అధికార ప్రతినిధి