కోదాడ అడ్డాగా  పశువుల దందా...పట్టించుకోని మార్కెట్ కమిటీ, పోలీస్ అధికారులు

  • జోరుగా పశువుల అక్రమ రవాణా
  • రెండు నెలల్లో 250 గోవులను పట్టివేత 
  • మామూళ్లు మత్తులో అధికారులు

సూర్యాపేట/కోదాడ : పశువుల అక్రమ రవాణా సూర్యాపేట జిల్లాలో జోరుగా సాగుతోంది. పశువుల అక్రమ రవాణాకు కోదాడ అడ్డాగా మారింది. ప్రతి వారం కోదాడలో జరిగే సంతలో తిష్ఠవేసిన కొందరు వ్యాపారులు పశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు. కోదాడ పశువుల సంత కేంద్రంగా ఈ దందా జోరుగా సాగుతోంది. ఈ దందాను అరికట్టాల్సిన మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది తమ కండ్ల ముందే పశువులు తరలిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.


నిబంధనలు పట్టించుకోని వ్యాపారులు..

కోదాడ పశువుల సంతకు ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద సంతగా పేరుంది. ఈ సంతలో పశువులతోపాటు మేకల, గొర్రెల క్రయ,విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతాయి. మేలు జాతి ఆవులు, ఎద్దులు, కోడె దూడలు, గేదెలు కోసం కర్నాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల నుంచి పశువుల వ్యాపారులు ఇక్కడికి వస్తారు. వయసు పెరిగిన, వ్యవసాయానికి పనికి రాని పశువులను హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు.

వాస్తవానికి పశువులను తరలించే వాహనంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లారీలో 6, డీసీఎంలో 3, ఆటోలో ఒక్క పశువును మాత్రమే తరలించాలి. ఆయా వాహనాల్లో పశువులకు గడ్డి, నీటి తొట్టి ఏర్పాటు చేయాలి. కానీ వ్యాపారులు ఇవేమీ పాటించడం లేదు. పశువులు వ్యవసాయానికి పనికి రావని వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేయాలి. సంతలో విక్రయించే పశువులకు వాటి విలువలో 1 శాతం మార్కెట్ ఫీజు చెల్లించాలి.

లేత లేగ దూడలు, వ్యయసాయనికి పనికి వచ్చే కోడె దూడలను ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండా, వాటి కాళ్లు విరగకొడుతూ ఒక్కో వాహనంలో 20 నుంచి 35 వరకు పడుకోబెట్టి తరలిస్తున్నారు. ఈ తతంగమంతా మార్కెట్ అధికారులకు తెలిసినా నామమాత్రంగా విలువ వేసి వాటిపై ఒక శాతం ఫీజు వసూలు చేసి పశువుల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారు.  

రెండు నెలల్లో 250 గోవుల పట్టివేత..

కోదాడ కేంద్రంగా జరుగుతున్న అక్రమ రవాణా రెండు నెలల్లో 12 మందిని అరెస్ట్ చేసి 250 గోవులను పట్టుకొని గోశాలకు తరలించారు. కోదాడకు చెందిన వ్యక్తి ఈ అక్రమ రవాణాలో ముఖ్య పాత్ర వహిస్తుండగా, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది.

పోలీసుల పేరుతో అక్రమ వసూళ్లు..

సంతలో జరిగే దందాలో మార్కెట్ అధికారుల తీరు ఇలాగే ఉంటే పోలీసుల వసూళ్లు మరో రకంగా ఉన్నాయి. సంతలో ప్రైవేట్ వ్యక్తిని తమ ప్రతినిధిగా నియమించి జోరుగా వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. సంత జరిగే రోజుల్లో ఆ వ్యక్తి బలవంతంగా ఒక్కో బండికి రేటు గట్టి వసూళ్లు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ మామూళ్లు ఇవ్వకుండా వెళ్లే వాహనాలను వెంబడించి మరీ దౌర్జన్యంగా వసూళ్లు చేస్తున్నారు.

ఇదేమిటని అడిగితే పోలీసులు కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వసూళ్లు చేస్తున్న మామూళ్లలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారులు వరకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని, అక్రమ వసూళ్ల నుంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు.