పశు మాంస ఉత్పత్తి, సమస్యలు

2017-–18లో  భారత జీడీపీకి  గొర్రెలు, మేకల రంగం రూ.66,814 కోట్లు అందించింది. ఈ విలువ రూ.1,50,000 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ప్రపంచంలో గొర్రెలు, మేక మాంసం ఎగుమతి చేసే అతిపెద్ద దేశం మనదే.  2018-–19లో  మన దేశం నుంచి  రూ.790.65 కోట్ల విలువైన 18,425.00 మెట్రిక్ టన్నుల మేకలు, గొర్రెల మాంసం ఎగుమతి చేశారు. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో పశువుల కోసం సుమారు 2,000 మార్కెట్లు ఉన్నాయి. అయినా  క్రయ విక్రయాల మీద సమాచారం దొరకదు. చాలా మార్కెట్లలో  పారదర్శక లావాదేవీలు జరగవు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాల కొరత ఉన్నది. పశువుల సంతల్లో మౌలిక సదుపాయాలు ఉంటే  పశువుల ఆరోగ్యం కాపాడవచ్చు, అపరిశుభ్ర వాతావరణం నివారించవచ్చు.

జంతువధ  రాష్ట్ర పరిధిలోని అంశం

జంతువుల వధ అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లోని జాబితా II లోని ఎంట్రీ 15 ప్రకారం రాష్ట్ర చట్టసభలకు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. జంతువుల వధశాలలు (కబేళాలు) పరిశుభ్రంగా ఉండడానికి తగిన సౌకర్యాలు కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన మాంసం అందించడం కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భారత ఆరోగ్య భద్రత సంస్థ నిబంధనలను పాటించడంలో ఈ జంతు వధశాలల సౌకర్యాలు ముఖ్య భూమిక వహిస్తాయి. చిన్న కబేళాల స్థాపనకు, నిర్వహణకు సంబంధించి  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్  సవరణ నిబంధనలు 2019 వర్తిస్తాయి. ఢిల్లీ (ఘాజీపూర్), ముంబయి (డియోనార్), హైదరాబాద్ వంటి మునిసిపల్ కార్పొరేషన్లు మాంసం ఉత్పత్తి కోసం పెద్ద యాంత్రిక కబేళాలను ఏర్పాటు చేశాయి.

కరోనా వైరస్​ వ్యాప్తితో సమస్యలు జటిలం

కరోనా మహమ్మారి నేపథ్యంలో పశువుల నుంచి మాంసం చుట్టూ అనేక సమస్యలు ముసురుకుంటున్నాయి. అమెరికా, చైనా తదితర దేశాల వల్ల, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల విధానాల వల్ల సమస్యలు ఇంకా జటిలం అవుతున్నాయి. కొవిడ్​ మహమ్మారి మొదలు అయిన వూహాన్ నగరంలో  కరోనా వైరస్ వ్యాప్తికి అక్కడి పశువుల మార్కెట్లు దోహదపడ్డాయి అని ఆనాడు, ఈనాటికీ కొందరు బలంగా నమ్ముతారు.  మహమ్మరిగా మారే వైరస్​లు  పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్న నేపథ్యంలో పశువులను పెంచే విధానం, సంరక్షించే పద్ధతులు, నిర్వహణ అన్నీ మారాలని అందరూ కోరుకుంటారు. 

పశువులకు వ్యాక్సిన్లు  అవసరమేనా?

 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకొక మహమ్మారిని నివారించాలంటే పశువులకు వ్యాక్సిన్లు ఇస్తే మంచిది అని భావిస్తోంది. ఇప్పటికే, మాంసం కోసం జైలు తరహా వాతావరణంలో పెంచే పశువులకు వ్యాధులు సంక్రమించకుండా నివారణకు ఇచ్చే యాంటి బయాటిక్స్ వల్ల మాంసాహారుల ఆరోగ్యం మీద దుష్ప్రభావం ఉంటున్న  నేపథ్యంలో, ఈ కొత్త తరహ నిర్వహణకు నాంది పలికే విధానాలు, పెట్టుబడులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నడుం  బిగించింది. దానికి పెట్టిన అందమైన పేరు ‘వన్ హెల్త్’. ఈ పేరు మీద పశుమాంసం ఉత్పత్తి పద్ధతులు మార్చాలని భావిస్తున్నారు.

మాంసం ఉత్పత్తికి శాఖాహారం

మాంసం ఉత్పత్తికి కావాల్సింది శాఖాహారమే. పశువులు.. గడ్డి, ఆకులు వగైరా ఆహారం మీద ఆధారపడితే వాటి ఆహారం మీద మానవులు ఆధారపడడం పెరిగింది. మాంసాహారం వలన కలిగే ప్రయోజనాల మీద చర్చలు చాల తీవ్రంగా ఉంటున్నాయి. అధికంగా మాంసం తీసుకుంటే మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు. ఆ చర్చ ఒక వైపు ఉండగా అసలు మాంసం ఉత్పత్తి రంగాల్లో వస్తున్న మార్పులు అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తున్నాయి అని నివేదికలు, అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలో 90 శాతం పైగా  మక్కలు  పశువుల దాణా కోసం  వినియోగిస్తారు. భారత్ దేశంలో కూడా ఈ తరహా పశుగణాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కానీ,  గడ్డి, ఆకుల ఆహారం పశువులకు కరువు అవుతుండడంతో పశుమాంసం సంపూర్ణ ఆరోగ్యకరం కాకుండాపోతున్నది.

భారీగా పడిపోయిన పశువుల సంఖ్య

మన దేశంలో పశు మాంసం ఎక్కువగా గొర్రెలు, మేకల  నుంచే వస్తుంది. గొర్రెలు, మేకలకు కావాల్సిన పచ్చిక బయళ్ళు కనుమరుగు అవుతున్నాయి.  పశుగణాభివృద్ధి ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారింది. గ్రామీణ వృత్తుల్లో ప్రధాన భాగమైన పశు సంవర్ధనకు యువత ముందుకు రావడం లేదు. తరతరాల నుంచి వస్తున్న పశువులను పెంచే జ్ఞానం కనుమరుగు అవుతున్నది.  ఇప్పుడు పశువుల సంఖ్య భారీగా పడిపోయింది. పాడికి, పంటకు, నేలకు , నేల సారానికి అవసరమైన పశువులు లేవు. సంప్రదాయ పశు పెంపకందారుల వృత్తులను కాపాడుతూ, వారి అభివృద్ధికి దోహదపడే విధానం రావాలి. 

71శాతం మాంసాహారులు

2014 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే  ప్రకారం, 15 ఏండ్లు పైబడిన భారతీయుల్లో 71 శాతం మాంసాహారులు.  మన దేశంలో  ప్రతి సంవత్సరం 30 బిలియన్ల డాలర్ల విలువైన మాంసం వినియోగం అవుతుంది.ఈ మాంసం 90 శాతం అసంఘటిత స్థానిక మార్కెట్ల నుంచి వస్తుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఆదాయం, ఆహారం, పోషకాహార వనరుగా మాంసం,  పౌల్ట్రీ రంగం  ఉన్నప్పటికీ అధిక భాగం అసంఘటిత రంగం పరిధిలోనే ఉన్నది. అందువల్ల,  ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురి అయ్యింది. సవాళ్ళకు దీటుగా తగిన విధానాల రూపకల్పన జరగడం లేదు. కేంద్రంలో,  రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉన్నా సాధారణ స్థాయి పాలనకు పరిమితం కావడం వల్ల ఫలితం లేకుండాపోయింది. పశుసంవర్ధన అనేది  వివిధ సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలతో ముడిపడి ఉంది. పశువుల మాంసం మీద మతాల మతలబు కూడా ఉన్నది. బహుశా ఏ దేశంలో కూడా ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితులు ఉండకపోవచ్చు. 

అంతరించిపోతున్న మేలైన జాతులు

పశ్చిమ దేశాల పశు మాంసం అభివృద్ధి విధానాలు అమానవీయంగా, అపరిశుభ్రంగా, రసాయనాలతో కూడిన ఉత్పత్తిగా, కర్బన ఉద్గారాలను పెంచే పరిశ్రమగా గుర్తిస్తున్నారు. ఆ దిశగా మన దేశం విధానాలు మార్చుకుంటే మనకు అనేక సమస్యలు వస్తాయి. ఇప్పటికే మన సంప్రదాయ పశువుల సంవర్ధన పద్ధతులు క్రమంగా  మాయమవుతున్నాయి. పశువుల సంఖ్య తగ్గుతున్నది. మేలైన జాతులు అంతరించిపోతున్నాయి. స్థానిక జాతులు కనుమరుగు అవుతున్నాయి. కృతిమ గర్భధారణ పద్ధతుల వల్ల జాతుల జన్యు ప్రత్యేకతలు సమసిపోతున్నాయి. సంకర జాతి పశువులు పెరుగుతున్నాయి. రోగాలను, వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి ఈ సంకర జాతులకు ఉండే అవకాశం చాలా తక్కువ. 

- డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​