యూట్యూబర్​: ఫ్లైట్ అటెండెంట్ నుంచి వ్లాగర్‌‌

ఫారిన్‌లో మంచి ఉద్యోగం. సరిపడా జీతం. కానీ.. జీవితంలో ఏదో మిస్‌ అవుతున్నాననే బాధ. అందుకే ఉద్యోగానికి రిజైన్‌ చేసి, ఇండియాకు తిరిగొచ్చాడు నిఖిల్‌. ఇక్కడికొచ్చి యాక్టింగ్‌ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ..పెద్దగా కలిసి రాక యూట్యూబ్‌ని కెరీర్‌‌గా ఎంచుకున్నాడు. కట్‌ చేస్తే.. లక్షల్లో ఫాలోవర్స్‌, సెలబ్రిటీ హోదా. 

అందరూ అతన్ని తన ఛానెల్‌ ‘‘ముంబైకర్ నిఖిల్”పేరుతో పిలుస్తారు. కానీ.. అసలు పేరు ‘నిఖిల్ అనిల్ బ్రిజ్ లాల్ కుమార్‌‌’. ఇప్పుడతను ఫేమస్ యూట్యూబ్ వ్లాగర్, మోడల్, యాక్టర్‌‌. మాజీ ఫ్లైట్ అటెండెంట్‌ అయిన నిఖిల్​ 2013 జూలై 3న యూట్యూబ్‌ ఛానెల్‌ ‘‘ముంబైకర్‌‌ నిఖిల్‌” మొదలుపెట్టాడు. ఛానెల్‌ పెట్టినప్పుడు అతని వయసు 22 ఏండ్లు. నిఖిల్‌ 1991 నవంబర్ 4న పుట్టాడు. 

చదువు మీద ఇంట్రెస్ట్‌ ఉండేది కాదు. కానీ.. కష్టపడి బాగానే చదివాడు. మొదట ముంబైలోని రిజ్వీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టడీస్ అండ్ రీసెర్చ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరాడు. అది చదువుతున్నప్పుడే ఆ పని తనకు సెట్‌ కాదని డిసైడ్​ అయ్యాడు. వెంటనే చదువు మానేశాడు. తర్వాత ఖతార్ ఎయిర్‌వేస్‌లో ఫ్లైట్ అటెండెంట్ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఉద్యోగం రావడంతో ఖతార్‌లోని దోహాకు మకాం మార్చాడు. కొన్నాళ్లు పనిచేశాక ఆ పని కూడా నచ్చలేదు. దాంతో యాక్టింగ్​లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ముంబైకి వచ్చాడు. 

టెలివిజన్ సీరియల్‌ ‘సావధాన్ ఇండియా’తోపాటు కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్‌ చేశాడు. లీడ్‌,  ఇంపార్టెంట్‌ రోల్స్‌ మాత్రం దొరకలేదు. ఈ రంగంలో కూడా సక్సెస్ కాలేకపోయాడు. కానీ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. అతని కుటుంబ సభ్యులేమో యాక్టింగ్‌ని వదిలేసి, ఫ్లైట్ అటెండెంట్‌ జాబ్‌లో మళ్లీ చేరమని ఫోర్స్‌ చేసేవాళ్లు. అయినా.. నిఖిల్ అదే రంగంలో ఉన్నాడు. 

2012 డిసెంబర్​లో నిఖిల్ తండ్రి అనిల్ శర్మ గుండెపోటుతో చనిపోయాడు. దాంతో కుటుంబభారం నిఖిల్‌పై పడింది. యాక్టింగ్‌ కెరీర్‌‌ని వదిలేయాల్సి వచ్చింది. కుటుంబం కోసం కొత్త బిజినెస్​లు కూడా మొదలుపెట్టాడు. అనుకున్నంత లాభాలు రాలేదు. దాంతో తన తండ్రి బిజినెస్‌లోనే సెటిలయ్యాడు. కానీ.. అది అతను కోరుకున్న లైఫ్‌ కాదు. తప్పని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించడానికి బిజినెస్‌ చేయాల్సి వచ్చింది. 

రోడ్డు మీద వాళ్లని చూసి...

ఒకసారి రోడ్డు మీద నడుస్తుంటే ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిళ్లపై వెళ్తూ వాళ్లని వాళ్లే వీడియో రికార్డ్ చేసుకోవడం నిఖిల్​ కంట్లో పడింది. దాంతో వ్లాగింగ్‌ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. తను కూడా వ్లాగింగ్ చేయాలని డిసైడ్‌ అయ్యాడు. 

కానీ.. ఆ వీడియోలను ఎక్కడ పోస్ట్‌ చేయాలో తెలియలేదు. ఒకసారి యూట్యూబ్‌ చూస్తుంటే అందులో వ్లాగింగ్ వీడియో కనిపించింది. దాంతో తన వీడియోలు కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి అనుకున్నాడు. అందుకోసం ‘ముంబైకర్‌‌ నిఖిల్‌’ పేరుతో ఛానెల్‌ పెట్టాడు. అలా వ్లాగింగ్‌ మొదలుపెట్టి.. నిఖిల్ తొలి భారతీయ వ్లాగర్లలో ఒకడిగా నిలిచాడు. 

పట్టు వదల్లేదు

ఛానెల్‌ పెట్టిన కొత్తలో ఎక్కువగా బైక్‌పై రైడ్‌ చేస్తూ రికార్డ్‌ చేసిన వ్లాగింగ్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసేవాడు. అతను పదిహేనేండ్ల వయసు నుంచే మోటర్‌బైక్స్‌ నడిపాడు. కాబట్టి, అతనికి మోటో వ్లాగ్స్‌ చేయడం ఈజీ అయ్యింది. తన బైక్ డిటెయిల్స్ చెప్తూ మొదటి వ్లాగ్‌ చేశాడు. కానీ, వ్యూస్‌ రాలేదు. ఆ తర్వాత చేసిన వ్లాగ్స్‌కి కూడా ఆదరణ రాలేదు. 

అయినా పట్టు వదలకుండా వీడియోలు చేసి, చివరికి సక్సెస్‌ అయ్యాడు. దేశమంతా బైక్ రైడ్స్‌ చేశాడు. వెళ్లిన ప్రతి చోట తీసిన క్వాలిటీ కంటెంట్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అతని ఛానెల్‌కు 4.06 మిలియన్ల సబ్‌స్ర్కయిబర్స్ ఉన్నారు. ఇప్పటికవరకు 2,300 వీడియోలు అప్‌లోడ్‌ చేశాడు. లడక్​లోని లేహ్‌కు వెళ్తూ చేసిన వీడియోకు వ్యూస్‌ బాగా వచ్చాయి. ఆ వీడియో తర్వాత నిఖిల్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. 

కాశ్మీర్‌‌ టు కన్యాకుమారి

దేశవ్యాప్తంగా ఉన్న తన ఫాలోవర్స్‌ని కలుస్తూ... కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తన కేటిఎం డ్యూక్ 390 మీద 2017లో రైడ్‌ చేశాడు. అదే ఏడాది ముంబై యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్‌కు నిఖిల్‌కి ఆహ్వానం అందింది. ఆ తర్వాత 2018 మార్చి16న అతని ఛానెల్‌ పది లక్షల సబ్‌స్క్రయిబర్ల మార్క్‌ దాటింది. 

లక్షల్లో సంపాదన 

ముంబికర్ నిఖిల్ యూట్యూబ్‌ ద్వారా ప్రతి నెలా  లక్షల్లో సంపాదిస్తున్నాడు. బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా కూడా కొంత డబ్బు వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అందులో బ్రాండ్‌ ప్రమోషన్లు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. సొంతంగా ‘ఎం.ఎన్‌.’ అనే ఫ్యాషన్ బ్రాండ్‌ పేరిట టీ-షర్టులు, టోపీలు, పర్సులు అమ్ముతున్నాడు.