ఒకప్పుడు పెద్ద పెద్ద రైతుల దగ్గరే ట్రాక్టర్లు ఉండేవి. అవన్నీ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. వాటిని అక్కడి భూస్వాములు వాడుకునేందుకు వీలుగా ఎక్కువ పనిచేసే కెపాసిటీతో తయారుచేశారు. కానీ.. ఇండియాలో తక్కువ భూమి ఉండే ఎక్కువమంది రైతులకు వాటిని కొనడం తలకు మించిన భారమే. అందుకే చిన్న రైతుల కోసం చిన్న ట్రాక్టర్ తీసుకురావాలనే ఆశయంతో ఇండియన్ గవర్నమెంట్ ఓ పెద్ద ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం నుంచి పుట్టిందే ‘స్వరాజ్ ట్రాక్టర్’. పంజాబ్ గవర్నమెంట్ సాయంతో ప్రొడక్షన్ మొదలుపెట్టి కొన్నేండ్లపాటు రైతు నేస్తంగా సేవలందించింది స్వరాజ్.
హరిత విప్లవంలో అన్ని దేశాలతోపాటు మనమూ ముందుకు వెళ్లాలనే ఆలోచన. మరో వైపు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలనే లక్ష్యం. ఈ రెండింటి వల్లే స్వరాజ్ ట్రాక్టర్ తయారైంది. మన దేశంలో1960ల్లోనే వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీ వాడకం మొదలైంది. అధిక దిగుబడిని ఇచ్చే విత్తన రకాలను నాటడం, పురుగుమందులు, ఎరువులు ఉపయోగించడం కూడా అప్పుడే మొదలైంది. దాంతో దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. కానీ.. వ్యవసాయానికి సాయం చేసే యంత్రాలు మాత్రం సరిగ్గా అందుబాటులో లేవు. అందుకే ప్రభుత్వం కూడా ఆధునిక వ్యవసాయ సాంకేతికతను తయారుచేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా పుట్టిందే స్వరాజ్ ట్రాక్టర్.
మనవాళ్ల కోసం..
ఇండియా వ్యవసాయానికి సాయపడే ఆధునిక యంత్రాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు లాంటివి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా అప్పటి సోవియట్ యూనియన్, చెకోస్లోవేకియా, రొమేనియా, జర్మనీ, లండన్, పోలాండ్ నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యేవి. 1963–64లో ట్రాక్టర్లకు పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను గమనించిన స్థానిక పారిశ్రామికవేత్తలు ఇంటర్నేషనల్ ట్రాక్టర్ తయారీదారులతో కలిసి జాయింట్ వెంచర్లను తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ.. ఇక్కడ ఒక సమస్య తలెత్తింది. ఆ కంపెనీలు విదేశాల్లో ఉండే పెద్ద రైతుల కోసం ట్రాక్టర్లను తయారుచేసేవి. కాబట్టి అవి ఎక్కువ శక్తివంతమైనవి. ఎక్కువ ఖరీదు కూడా. కానీ.. మన దేశంలో చాలామంది రైతులకు భూములు తక్కువ పరిమాణంలో ఉండేవి. ఇంటర్నేషనల్ బ్రాండ్ల ట్రాక్టర్లను కొనే శక్తి వాళ్లకు లేదు.
సీఎంఈఆర్ఐ
మహాత్మాగాంధీ చెప్పిన ‘స్వావలంబన’ అన్న ఆలోచనతో ఇండియాలోనే ఆధునికి యంత్ర పనిముట్లు తయారు చేసే టెక్నాలజీని డెవలప్ చేయాలి అనుకుంది ప్రభుత్వం. అందుకే1960ల్లోనే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ)ని పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఇనిస్టిట్యూట్ ద్వారా చిన్న, మధ్య తరహా రైతుల కోసం తక్కువ బడ్జెట్‌లో దొరికే చిన్న ట్రాక్టర్లను తయారుచేయాలి అని నిర్ణయించుకుంది. 1968–69 నాటికి మన దేశంలో ట్రాక్టర్ల వార్షిక డిమాండ్ సుమారు 40,000 యూనిట్లకు చేరుకుంటుందని ఊహించారు. అయితే.. వాటిలో 50 శాతం ట్రాక్టర్లు తప్పనిసరిగా 20 హెచ్‌పీ(హార్స్ పవర్) లేదా అంతకంటే తక్కువ కెపాసిటీతో నడిచేవి ఉండాలని నిర్ణయించింది భారత ప్రణాళికా సంఘం. అందుకే నాలుగో పంచవర్ష ప్రణాళికలో 20 హెచ్‌పీ ట్రాక్టర్‌ను డెవలప్ చేయడం దేశంలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా చేర్చింది. ఈ ప్రాజెక్టుని అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్ నుండి టెక్నాలజీ, -ఆర్థిక సాయం తీసుకుని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం యూఎస్‌ఎస్‌ఆర్‌కు వెళ్లి రీసెర్చ్ చేయడానికి సీఎంఈఆర్‌ఐలో ఒక టీంని కూడా రెడీ చేసింది ఇండియన్ గవర్నమెంట్.
టీం రెడీ
ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సీఎంఈఆర్ఐకి ఇండియాలోని టాప్ మెకానికల్ ఇంజినీర్లలో ఒకరైన మన్మోహన్ సూరిని1964లో డైరెక్టర్‌గా నియమించారు. ఆ తర్వాత1965లో అప్పటి ప్రధాన మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రితోపాటు ఆయన మాస్కోకు వెళ్లారు. అక్కడి పరిస్థితులు పరిశీలించిన తర్వాత మన దేశంలో చిన్న రైతుల కోసం ఏడాదికి12,000 చొప్పున 20 హెచ్‌పీ ట్రాక్టర్‌లను తయారుచేయాలనే ఆలోచనతో తిరిగి వచ్చారు. అదే ఏడాదిలో కేంద్ర ప్రణాళికా సంఘానికి ఐదు పేజీల ప్రతిపాదన లేఖ కూడా రాశారు. కానీ.. ‘‘ట్రాక్టర్లను డెవలప్ చేయడానికి ఎలాంటి సాయం చేయలేమ’’ని సోవియట్ యూనియన్ చెప్పింది.
స్వరాజ్ ఇలా పుట్టింది
యూఎస్‌ఎస్‌ఆర్ సాయం చేయకపోయినా.. స్వదేశీ 20 హెచ్‌పీ ట్రాక్టర్లను డెవలప్ చేయాలని సూరి డిసైడ్ అయ్యాడు. ఇతర దేశాల సాయం లేకుండానే ఇండియా కోసం పూర్తి స్వదేశీ ట్రాక్టర్‌ను తయారుచేసే బాధ్యతను సీఎమ్‌ఇఆర్‌ఐ తీసుకుంటుందని ప్రణాళికా సంఘానికి చెప్పారు. అంతేకాదు.. ఇండియన్ ట్రాక్టర్లలో దిగుమతి చేసుకున్న విడిభాగాలను కూడా వాడకూడదని నిర్ణయించుకున్నారు. ట్రాక్టర్ తయారీ ప్రాజెక్ట్‌లో సాయంగా ఉండేందుకు అప్పటికే ఇండియన్ రైల్వేస్‌లో పనిచేస్తున్న చంద్ర మోహన్1965లో సూరి ఆహ్వానం మేరకు సీఎంఈఆర్‌ఐలో చేరారు.
డిజైన్
స్వదేశీ ట్రాక్టర్‌ను డెవలప్ చేసేందుకు ప్రణాళికా సంఘం నిధులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఆ తర్వాత పరిశ్రమలు, యూనిర్సిటీలు, రైతులు, ట్రాక్టర్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ స్టేషన్ (టీటీటీఎస్)లోని కొంతమందితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెక్నికల్‌ఎక్స్‌పర్ట్స్ కమిటీ కొత్త ట్రాక్టర్ డిజైన్ తయారు చేసే పనిలో పడింది. సూరి, మోహన్ మార్గదర్శకత్వంలో భారతీయ వాతావరణ పరిస్థితులను తట్టుకునే, స్థానిక వ్యవసాయ పద్ధతులకు సరిపోయే, తక్కువ ఖర్చుతో తయారయ్యే డిజైన్‌ను రెడీ చేసేందుకు అందరూ చాలా కష్టపడ్డారు. చివరగా1967 నవంబర్‌లో పూర్తి స్వదేశీ ట్రాక్టర్ డిజైన్ రెడీ అయ్యింది.
టెస్టింగ్
సైంటిస్ట్‌లు తయారుచేసిన ప్రోటోటైప్‌ను టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా టెస్ట్ రిగ్‌లు ఏర్పాటు చేశారు. అత్యంత వేడిగా ఉండే వేసవి నెలల్లో 10–30 శాతం ఓవర్‌లోడ్‌తో దాదాపు1,200 గంటలకు పైగా టెస్ట్‌లు చేశారు. అలా రెండేండ్ల తర్వాత1969 మార్చిలో మూడు యూనిట్లు తయారుచేశారు. వాటిని టెస్ట్ చేశాక మరో రెండేండ్లలో హైడ్రాలిక్స్, స్టీరింగ్, గేర్, ఫ్రంట్ యాక్సిల్, ఇంజన్, కూలింగ్ సిస్టమ్‌లో అనేక మార్పులు చేశారు. చివరగా 1971లో సీఎంఈఆర్‌ఐ తయారుచేసిన మొదటి ఇండియన్ ట్రాక్టర్‌ని రెడీ చేశారు. ఇది 20–25 హెచ్‌పీ పవర్ రేంజ్‌లో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చాలా ట్రాక్టర్ల కంటే మెరుగ్గా పనిచేసింది. ఇది పూర్తి సొంత టెక్నాలజీతో తయారుచేయడం వల్ల ‘స్వరాజ్’ అని పేరు పెట్టారు.
కంపెనీ కోసం..
స్వరాజ్ ట్రాక్టర్ల తయారీకి ఒక ప్లాంట్, మెషిన్లు, కార్మికులు.. ఇలా చాలా అవసరం. దీనంతటికీ చాలా ఖర్చు అవుతుంది. అందుకోసం ‘మైనింగ్ అండ్ అలైడ్ మెషినరీ కార్పొరేషన్’ ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అయ్యింది. అయితే, 1967–71 ఆర్థిక మాంద్యం వల్ల వ్యాపారాల్లో బాగా నష్టాలు వచ్చాయి. దాంతో ఎంఏఎంసీ వాళ్లు పెట్టుబడి పెట్టలేం అన్నారు. అప్పుడే పంజాబ్ గవర్నమెంట్ ముందుకొచ్చింది. స్వరాజ్ ట్రాక్టర్లు తమ రాష్ట్రంలో తయారైతే.. రైతులకు సాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ‘పంజాబ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ కంపెనీ వల్ల పంజాబ్‌లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలా1970లో పీఎస్‌ఐడీసీ స్వరాజ్ ట్రాక్టర్ల తయారీకి పంజాబ్‌లోని మొహాలిలో ‘పంజాబ్ ట్రాక్టర్స్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసింది. అక్కడే స్వరాజ్ ట్రాక్టర్ల ప్రొడక్షన్ మొదలుపెట్టింది. ఆ ట్రాక్టర్ రూపకల్పనకు కారణమైన ఐదుగురు ఇంజనీర్లు సీఎంఈఆర్‌ఐలో ఉద్యోగాలు వదులుకొని ఈ కంపెనీలో చేరారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ట్రాక్టర్‌ను ‘పీటీఎల్’1974లో ‘స్వరాజ్–724’ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. స్వరాజ్ ఏర్పాటు తర్వాత భారతదేశం ట్రాక్టర్లను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ట్రాక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
రైతులకు సాయంగా...
కొన్నేండ్లలోనే స్వరాజ్ ట్రాక్టర్లకు మంచి పేరొచ్చింది. మన్నికకు మారుపేరుగా మారాయి. పైగా అప్పట్లో మిగతా కంపెనీలతో పోలిస్తే.. తక్కువ ధరలోనే దొరికేవి. ఇవి బలమైన ఇంజిన్‌లకు ఫేమస్. వీటి ఇంజిన్లు ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకుని పనిచేస్తాయనే పేరొచ్చింది. పైగా ఈ ట్రాక్టర్లకు మెయింటెనెన్స్ చాలా తక్కువ. అందుకే అప్పట్లో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇండియాతో పాటు అనేక దేశాల్లో అమ్ముడయ్యేవి. కంపెనీ పెట్టిన తర్వాత హార్స్ పవర్‌లో మార్పులు చేసి.. రకరకాల మోడల్స్ తయారుచేశారు. చిన్న రైతులతో పాటు ఎక్కువ భూమి ఉండే పెద్ద రైతులకు కూడా సరిపోయే అన్ని రకాల మోడల్స్‌ని అందుబాటులోకి తెచ్చారు.
మహీంద్రా చేతుల్లోకి...
ఒకప్పుడు దేశంలోనే అత్యంత లాభదాయకమైన ట్రాక్టర్ కంపెనీగా ఉన్న స్వరాజ్‌కు నష్టాలు మొదలయ్యాయి. నార్త్ ఇండియాలో అంతటా కనిపించే ‘స్వరాజ్’ ప్రొడక్షన్‌ని తగ్గించాల్సి వచ్చింది. ట్రాక్టర్ ఇండస్ట్రీలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న దాని స్థానం ఐదో స్థానానికి పడిపోయింది. కంపెనీ షేర్ వ్యాల్యూ కూడా వెయ్యి రూపాయల నుంచి 250 రూపాయలకు పడిపోయింది. దాంతో.. 2007లో ‘పంజాబ్ ట్రాక్టర్స్ లిమిటెడ్ కంపెనీ’లోని మెజారిటీ వాటాను ‘మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్’ కొనేసింది. 2009 నుంచి మహీంద్రా కంపెనీలో స్వరాజ్ ఒక విభాగంగా కొనసాగుతోంది. 2018–19లో స్వరాజ్1,20,000 ట్రాక్టర్‌లను ఉత్పత్తి చేసింది. ఆ ఏడాదిలో ఇండియాలో ఎక్కువ ట్రాక్టర్లను ఉత్పత్తి చేసిన రెండో ఇండియన్ ట్రాక్టర్ బ్రాండ్‌గా రికార్డ్‌కు ఎక్కింది. అంతేకాదు... కంపెనీ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు15 లక్షలకు పైగా ట్రాక్టర్లను మార్కెట్‌లో అమ్మింది.
మైల్‌స్టోన్స్
1972: మొహాలిలో ప్లాంట్ నిర్మాణం
1974: స్వరాజ్–724 ప్రొడక్షన్ మొదలు
1975: స్వరాజ్–735 లాంచ్ అయ్యింది. ఇది ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది.
1977: మొహాలి ప్లాంట్ విస్తరణ
1979: స్వరాజ్–720 లాంచ్.
1980: పంజాబ్ స్కూటర్స్ లిమిటెడ్ కొనుగోలు
1982: హార్వెస్టర్ కంబైన్ రిలీజ్
1983: స్వరాజ్–855 లాంచ్
1984: స్వరాజ్ మజ్దా లిమిటెడ్ ఏర్పాటు.
1993: ఏడాదికి 24,000 ట్రాక్టర్లు తయారుచేసేలా కంపెనీ విస్తరణ
1996: ఏడాదికి 30,000 ట్రాక్టర్లను ఉత్పత్తి చేసేలా ప్లాంట్ విస్తరణ.
1998: స్వరాజ్–922, స్వరాజ్–722, స్వరాజ్–855 లాంచ్.
1999: స్వరాజ్–744 పరిచయం.
2002: అమ్మకాలు 5,00,000 మార్కును దాటాయి.
2007: పంజాబ్ ట్రాక్టర్స్ లిమిటెడ్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా మెజారిటీ వాటా కొనుగోలు.
2012: ప్రతిష్టాత్మకమైన ‘డెమింగ్ ప్రైజ్’ గెలుచుకున్న ప్రపంచంలో రెండో ట్రాక్టర్ కంపెనీ.