మర్డర్ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు: నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు

నల్గొండ అర్బన్, వెలుగు: అప్పు డబ్బులను తిరిగి అడిగినందుకు ఇద్దరిని హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజా రమణి మంగళవారం తీర్పు చెరుప్పా. ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన మేరకు.. నల్గొండ టౌన్‎కు చెందిన బొంద రవికుమార్, అతని ఫ్రెండ్ ఎస్ కే గౌస్ వద్ద కనగల్ మండలం కుమ్మరిగూడెం( చిన్నమాధారం)కు చెందిన మల్లికంటి వెంకటేశ్వర్లు కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని రవికుమార్, గౌస్ అడుగుతుండగా వెంకటేశ్వర్లు పలు కారణాలు చెబుతూ డబ్బులు ఇవ్వడంలేదు. ఆపై వారిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. 

2014 ఆగస్టు 7న కుమ్మరిగూడెంకు రావాలని వెంకటేశ్వర్లు సోదరుడైన మల్లికంటి యాదగిరి ఫోన్ ద్వారా కాల్ చేసి నమ్మించి రవికుమార్ , గౌస్‎ను రప్పించారు. అదే రోజు వారిని కత్తితో పొడిచి అన్నదమ్ములు మల్లికంటి వెంకటేశ్వర్లు, యాదగిరి, అతని భార్య శోభ హత్య చేశారు. మృతుడు రవికుమార్ అల్లుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కనగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం నిందితులకు జీవిత ఖైదు, వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నేరస్తులైన మహిళను చంచలగూడ జైలుకు, మిగతా ఇద్దరిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.