కరోనా కొంప ముంచింది..మన ఆయుష్షు రెండేండ్లు తగ్గింది!

  • హెల్త్ సెక్టార్ లో పదేండ్లలో సాధించిన ఫలితాలు తారుమారైనయ్ 
  • అప్పుడే పుట్టిన పిల్లల ఆయుస్సు అంచనా కూడా తగ్గింది
  • డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదికలో వెల్లడి 

జెనీవా :  ప్రపంచంలో ప్రతి దేశానికీ పాకిపోయి.. రెండేండ్ల పాటు గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రభావంతో మనుషుల సగటు ఆయుష్షు (లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ) దాదాపుగా రెండేండ్లు తగ్గిపోయిందట. కరోనా ఎఫెక్ట్ తో అప్పుడే పుట్టిన పిల్లల ఆయుస్సు అంచనా(హెల్దీ లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ) సైతం పడిపోయిందట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ వైరస్ వల్ల ఇలాంటి ప్రభావమే కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ‘వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్’ నివేదికలో వెల్లడించింది.

హెల్త్ సెక్టార్ లో 2012 నుంచి పదేండ్లలో స్థిరంగా సాధించిన ఫలితాలు కరోనా కారణంగా రెండేండ్లలోనే తారుమారు అయిపోయి, మళ్లీ పదేండ్ల కిందటి స్థాయికి పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘2019 నుంచి 2021 మధ్య ప్రపంచ సగటు ఆయుర్దాయం 1.8 ఏండ్లు (73.2 ఏండ్ల నుంచి 71.4 ఏండ్లకు) తగ్గింది. 2012లో ప్రపంచ సగటు ఆయుర్దాయం (గ్లోబల్ లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ) 71.4 ఏండ్లుగా ఉండగా.. ఇన్నేండ్లలో హెల్త్ రంగంలో సాధించిన అభివృద్ధితో అది 1.8 ఏండ్లు పెరిగింది. కానీ కరోనా వల్ల 2019 నాటికి సాధించిన ఫలితాలు రెండేండ్లలోనే తిరిగి 2012కు రివర్స్ అయ్యాయి.

అలాగే అప్పుడే పుట్టిన పిల్లల ఆయుర్దాయం అంచనా కూడా 1.5 ఏండ్లు (63.4 నుంచి 61.9 ఏండ్లు) తగ్గిపోయింది” అని నివేదికలో డబ్ల్యూహెచ్ఓ వివరించింది. అయితే, అమెరికా ఖండాలు, ఆగ్నేయాసియాలో వైరస్ ప్రభావంతో పెద్దల ఆయుస్సు 3 ఏండ్ల వరకు, పిల్లల ఆయుస్సు 2.5 ఏండ్లు తగ్గగా.. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో మాత్రం అత్యంత తక్కువగా 0.1, 0.2 ఏండ్లు మాత్రమే తగ్గినట్టు తెలిపింది. 

కొత్త ప్యాండెమిక్ అగ్రిమెంట్ ఉండాలె :  టెడ్రోస్  

కొవిడ్ వల్ల గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్లు, లంగ్ డిసీజ్ లు, అల్జీమర్స్, డయాబెటిస్ వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, మాల్ న్యూట్రిషన్ సమస్యలు కూడా పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా2020 నుంచి 2021 మధ్యలో నమోదైన మరణాల్లో నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల వల్లే 74% మరణాలు జరిగాయన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి మహమ్మారులు వస్తే ఎదుర్కొనేలా.. ప్రపంచ దేశాల మధ్య కొత్త ప్యాండెమిక్ అగ్రిమెంట్ కుదుర్చుకుని, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.