నర్సింగ్‌‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్యాయత్నం

  • ఫీజు కోసం యాజమాన్యం వేధిస్తోందని ఆరోపణ

కోదాడ, వెలుగు : కాలేజీ యాజమాన్యం ఫీజుల కోసం వేధిస్తోందని, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్న మనస్తాపంతో నర్సింగ్‌‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన  సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... అసోం రాష్ట్రానికి చెందిన నర్గెస్‌‌ పర్బిన్‌‌ అనే యువతి కోదాడలోని స్నేహ నర్సింగ్‌‌ కాలేజీలో సెకండ్‌‌ ఇయర్‌‌ చదువుతూ, కాలేజీకి సంబంధించిన హాస్టల్‌‌లోనే ఉంటోంది. బుధవారం రాత్రి శానిటైజర్‌‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కాలేజీ యాజమాన్యం ఆమెను కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. 

కాగా ఫీజు విషయం యాజమాన్యం ఇబ్బందులు పెట్టడంతో పాటు ఇష్టం వచ్చినట్లు తిట్టడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు స్టూడెంట్‌‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై స్టూడెంట్‌‌ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కోదాడ పట్టణ పోలీస్‌‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. టౌన్‌‌ ఎస్సై రంజిత్‌‌రెడ్డి కాలేజీకి చేరుకొని స్టూడెంట్‌‌ ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం వివరణ కోరగా.. కాలేజీ ఫీజు చెల్లించాలని అడగడం వల్లే స్టూడెంట్‌‌ ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు.