ప్రాచీన రామాలయాల్లో..రామయ్యని చూసొద్దామా

రామనామం జపిస్తే.. అన్ని పాపాలు తొలగిపోతాయి.. శ్రీరామ చంద్రమూర్తిని దర్శించుకుంటే జన్మ ధన్యమైపోయినట్టే.. అంటుంటారు పెద్దలు. అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మన దేశంలో ఉన్న ప్రాచీన రామాలయాల్లో కొన్నింటి గురించి...

రఘునాథ ఆలయం

రఘునాథ మందిరం లేదా రఘునాథ్ దేవస్థానానికి వెళ్తే అక్కడ మొత్తం ఏడు దేవాలయాలు చూడొచ్చు.  ఇది జమ్మూలో ఉంది. దీని నిర్మాణం1835 లో మొదటి డోగ్రా పాలకుడు మహారాజా గులాబ్ సింగ్ మొదలుపెట్టారు. అతని కొడుకు మహారాజా రణబీర్ సింగ్1860 సంవత్సరంలో పూర్తి చేశాడు. రాముడు, కృష్ణుడి  జీవిత కథలకు సంబంధించిన శిల్పాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆలయం15 ప్యానెల్లలో రామాయణ, మహాభారత, భగవద్గీతకు సంబంధించిన చిత్రాలు చూడొచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక భారతీయ భాషల్లో ఉన్న 6,000 మాన్యుస్క్రిప్ట్‌‌లను సంరక్షించే లైబ్రరీ కూడా ఉంది. 

రామ్ రాజా ఆలయం

మధ్యప్రదేశ్‌‌లోని ఓర్చాలో బెత్వా నది ఒడ్డున ఉంది. ఇక్కడికి ఏడాదికి ఆరున్నర లక్షల కంటే ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. దాదాపు పాతికవేల మంది విదేశీయులు ప్రతి ఏడాది రామయ్యను దర్శించుకుంటున్నారు. మకర సంక్రాంతి, వసంత పంచమి, శివరాత్రి , రామనవమి , కార్తీక పూర్ణిమ, వివాహ పంచమి(సీతారాముల కల్యాణం) రోజుల్లో భక్తులు పోటెత్తుతారు. భారతదేశంలో రాముడు రాజుగా పూజించబడే ఏకైక ఆలయం ఇది. ఆలయంలా కాకుండా ఇది రాజభవనంలా ఉంటుంది. ఆలయంలో రాజుకు గార్డ్స్​గా పోలీసులు ఉంటారు. అంతేకాదు.. రాముడికి ప్రతిరోజు సాయుధ నమస్కారాలు చేస్తారు.

కోదండరామ ఆలయం 

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌‌లోని కడప జిల్లా వొంటిమిట్టలో ఉంది. పూర్వ నిషాద వంశానికి చెందిన దొంగలు వొంటుడు, మిట్టుడు రామ భక్తులుగా మారి ఈ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత వాళ్లు రాళ్లుగా మారారు. ఆలయ నిర్మాణం16వ శతాబ్దంలో జరిగింది. ఈ నిర్మాణం విజయనగర శైలిలో ఉంటుంది. ఇక్కడ జరిగే ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. 

ఎరి–కథా రామర్ ఆలయం

తమిళనాడులోని మధురాంతకంలో ఉంది. రామాయణంతో ఈ ప్రాంతానికి సంబంధం ఉన్నట్టు చెప్తుంటారు. లంకలో రావణాసురుడిని వధించిన తర్వాత  శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు మధురాంతకంలో కొద్దిసేపు ఆగారని భక్తులు నమ్ముతారు. 

రామ్ తీర్థ్ ఆలయం

పంజాబ్‌‌లోని అమృత్‌‌సర్‌‌‌‌లో ఉంది. ఇది సీతారాముల సంతానం లవ, కుశులకు సంబంధించింది.  ఇక్కడ ఒక పురాతన బావి ఉంది. ఆ బావిలోని నీళ్లకు ఔషధ గుణాలు ఉన్నాయంటారు. గర్భిణిగా వచ్చిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పించిన ప్రదేశం ఇదేనని విశ్వసిస్తారు.

త్రిప్రయార్ శ్రీరామస్వామి 

కేరళలోని త్రిస్సూర్ జిల్లా.. త్రి ప్రయార్‌‌‌‌లో ఉంది. ఇక్కడ ఆలయంలో కృష్ణుడు ఆరాధించిన శ్రీరాముడి విగ్రహం ఉంది. ఒకప్పుడు ఈ విగ్రహం సముద్రంలో మునిగిపోయింది. తర్వాత త్రిప్రయార్‌‌లోని ఒక మత్స్యకారుడు దాన్ని తిరిగి ప్రతిష్ఠించాడు. ఏకాదశి పండుగను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. 

చిక్ మగళూరు కోదండ రామాలయం 

కర్నాటకలోని చిక్​మగళూరు జిల్లా హీరేమగళూరులో ఉంది. స్కంద పురాణంలో ఉన్న ఒక విశిష్ట సంఘటనతో దీని స్థల పురాణం ముడిపడి ఉంది. స్కంద పురాణం ప్రకారం.. శ్రీరాముడు సీతమ్మను పెండ్లి చేసుకున్నప్పటి భంగిమలో పరశురాముడికి దర్శనం ఇస్తాడు. హొయసల, ద్రావిడ నిర్మాణ శైలుల అద్భుతమైన సమ్మేళనం ఇక్కడ కనిపిస్తుంది. 

విజయరాఘవ పెరుమాళ్ ఆలయం

తమిళనాడులోని కాంచీపురం జిల్లా తిరుప్పుకుళిలో ఉంది. ఇది108 దివ్యదేశాల్లో ఒకటని భక్తుల నమ్మకం. గర్భగుడి లోపల విజయరాఘవ పెరుమాళ్ ఒడిలో జటాయువు ఉంటుంది. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు తనకు సీతాదేవి వివరాలను చెప్పిన జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశాడనేది భక్తుల నమ్మకం.

కాలా రామ్​

మహారాష్ట్రలోని పంచవటి ప్రాంతంలోని నాసిక్‌‌లో ఉంది. ఇక్కడ నల్లని రాముడి విగ్రహం ఉంది. ఇది చాలా స్పెషల్‌‌. అందుకే ఈ ఆలయాన్ని కాలా రామ్​ (నల్ల రాముడు అని అర్ధం) అని పిలుస్తారు. 1788లో సర్దార్ రంగారావు ఒదేకర్‌‌‌‌ అనే వ్యక్తి  గోదావరి నదిలో రాముని నల్లరంగు విగ్రహం ఉందని కల వచ్చింది. అతనికి కలలో కనిపించిన ప్రాంతానికి వెళ్లి చూస్తే.. నిజంగానే విగ్రహం ఉంది. దాంతో అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. 

రామస్వామి దేవాలయం– కుంభకోణం

తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ఉన్న రామస్వామి ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన రామాలయం. ఈ ఆలయంలో లక్ష్మణ, భరత, శత్రుఘ్నలతో పాటు శ్రీరాముడు కొలువయ్యాడు. ప్రార్థన చేస్తున్న స్థితిలో ఉన్న హనుమంతుని విగ్రహం ఉంది. ఆలయం హాలులో ఉన్న 64 స్తంభాలు రామాయణంలోని  విశేషాలు చెప్తాయి.