పుష్ప తొక్కిసలాట నేర్పిన పాఠాలు

పుష్ప2 తొక్కిసలాట తరువాత తెలంగాణ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. దీంతో  ఇక తెలంగాణలో బెనిఫిట్​ షోలు ఉండవని జనం భావిస్తున్నారు. టికెట్ల పెంపుదల ఎవరికోసం. ఆ పెంపుదల వల్ల కష్టనష్టాలు పాలవుతున్నది మామూలు ప్రజానీకం.   పుష్ప2..తొక్కిసలాట తరువాత అల్లు అర్జున్​ అరెస్టు కావడం, వ్యక్తిగత పూచీకత్తుమీద విడుదల కావడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కనీసం అల్లు అర్జున్​ కొన్ని గంటలపాటైనా జైలులోకి వెళ్లాడు. గతంలో సినీ నటుడు బాలకృష్ణ జైలుకి వెళ్లకుండానే హాస్పిటల్​ నుంచి విడుదల అయ్యాడు.

నాలుగు వారాల మధ్యంతర బెయిలును అల్లు అర్జున్​కు హైకోర్టు ఆగమేఘాల మీద మంజూరు చేస్తే, ఇప్పుడు సెషన్స్​ కోర్టు అతడికి బెయిలు మంజూరు చేసింది. అల్లు అర్జున్​ అరెస్టు కావడం జాతీయంగా ఆసక్తిని రేకెత్తించింది. అతడి సినిమా బ్లాక్​ బస్టర్​ కావడం, అరెస్టు అయింది హీరో కావడంతో అందరి దృష్టి అరెస్టుమీద, కోర్టులు ఎవరిపక్షం ఉంటాయన్న విషయంమీద పడింది ఇది సహజం.

ఈ పరిణామాల మధ్య ప్రజల ఆసక్తి పెరిగింది. ఇంకా ప్రజల దృష్టి మరలలేదు. ఈ మొత్తం సంఘటన మనం పైపైన చూస్తే పేలవంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలా కనిపిస్తుంది. కానీ, చాలా విషయాలు చాలా సంవత్సరాలుగా అంతర్లీనంగా ఉన్నాయి. హీరో ఆరాధన, అత్యాశగల నిర్మాతలు, దర్శకులు, అహంభావపూరిత సినీ హీరోలు, బంధుప్రీతి, లోతుగా పాతుకుపోయిన కులతత్వంలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. 

బాహుబలి, ఆర్​ఆర్​ఆర్, పుష్పలాంటి సినిమాలు విజయవంతం కావడంతో తెలుగు సినిమా మనదేశంలో పతాకస్థాయికి వెళ్లిపోయింది. హైఓల్టేజీ యాక్షన్​ చిత్రాలు హిందీలో కరువైన స్థితిలో ఈ సినిమాలు వచ్చాయి. విజయవంతం అయినాయి. తెలుగు సినిమా పాన్​ ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. ఉత్తరభారత దేశ ప్రజలు ప్రభాస్, అల్లు అర్జున్​ లాంటి మాస్​ హీరోలను ఆరాధించడం మొదలుపెట్టారు.

మంచి పుస్తకాలు  ప్రచురించే  సంస్థలు కూడా ఓ కమర్షియల్​ సినీ దర్శకుని ఫొటో పెట్టుకుని తమ పుస్తకాలను ప్రచారం చేసుకునే దుస్థితికి చేరుకుంది. తెలుగు సినిమాల పెట్టుబడి రూ. 25 నుంచి 30 కోట్ల వరకు మాత్రమే ఉండేది. అది ఒక్కసారిగా 1000 కోట్ల దాకా పెరిగిపోయింది. ఈ పురోగతి వల్ల ప్రచార ధోరణులు అధోగతికి వెళ్లిపోయాయి. దీంతో సినిమాల ప్రమోషన్​ విధానం మారిపోయింది.

హీరోలు, దర్శకులు, సినీ ప్రముఖులు,  నిర్మాతలు ఈ ప్రమోషన్​ విధానాలను పూర్తిగా మార్చివేసింది. అందుకోసం అభిమాన సంఘాలు పెరిగిపోయాయి. కుల సంఘాలు పేట్రేగిపోయాయి. ఇప్పుడు చాలామంది అభిమానులు తమ నటులను, హీరోలను తమ కులాల ఆధారంగా అభిమానించడం, ఆరాధించడం పెరిగిపోయింది. మనదేశంలో ఈ అభిమానం దిగువ తరగతి, మధ్యతరగతి ప్రజలకు పరిమిత మైంది. అమెరికాలాంటి దేశాల్లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగులలో ఎక్కువగా కనిపిస్తోంది. 

ద్వేషం పెరుగుతోంది

సినీ తారల కుమారులు,  కోడళ్లు తమ కుల శిబిరాలను ఏర్పరుచుకుని ఈ ప్రభావ వలయాన్ని విస్తృతం చేస్తున్నారు. ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది. తమ అభిమాన హీరోలను అభిమానించడమే కాదు ఇతర కులాలకు చెందిన నటులను ద్వేషించడం వరకు వెళ్లిపోయింది. 

కుల వర్గాలుగా చీలిపోయిన అభిమానులు

1970 దశకంలో దేవరాజు మహారాజు ఓ కథ రాశారు. ఆ కథలో ఎన్నిక సమయంలో ఊరు ఊరంతా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటారు. ఎన్నికల తరువాత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి, ఓడిన అభ్యర్థి కలిసిపోయి తిరుగుతారు. సరిగ్గా అదే పరిస్థితి సినీ పరిశ్రమలో ఏర్పడింది. అయితే, అభిమానులు ఈ విషయాన్ని గుర్తించే పరిస్థితిలో లేరు. రెండు వర్గాలుగా, మరీ ముఖ్యంగా కుల వర్గాలుగా చీలిపోయి అభిమానాలను వ్యక్తపరుస్తున్నారు.

సినిమాల వ్యయభారం నిర్మాతలు, దర్శకులు పెంచి ఆ వ్యయాన్ని మొదటి వారంలోనే వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కమ్యూనిటీ గ్రూపులు వాళ్లకి అవసరమవుతాయి. అందుకోసం వాటిని ప్రోత్సహిస్తారు. ఆ గ్రూపులలోని వ్యక్తులు సాంఘిక మాధ్యమాల ద్వారా యుద్ధాలు చేస్తారు.  ఈ కమ్యూనిటీ గ్రూపులను ప్రోత్సహించడానికి  ప్రజా సంబంధాలు, మార్కెటింగ్ సంస్థలు సినీ పరిశ్రమకు అవసరమయ్యాయి.

ఆడియో లాంచ్​లు, పబ్లిసిటీ ఈవెంట్లతో..

కమ్యూనిటీ గ్రూపులను, అభిమానులను ప్రోత్సహించడమే కాదు. ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నారని వినికిడి. అందులో భాగంగా ఆడియో లాంచ్​లు, పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు, పెద్దపెద్ద కటౌట్లను ఏర్పాటుచేయడం లాంటివి చేస్తున్నారు. వీటికి అత్యంత ప్రచారం జరిగేవిధంగా మీడియాను మేనేజ్​ చేస్తున్నారు. ఈవెంట్లను ప్రత్యక్ష ప్రసారాలు చేయిస్తూ జనాలకు మరీ ముఖ్యంగా అభిమానులకు పిచ్చెక్కేవిధంగా చేస్తున్నారు. జనాలను సమకూర్చడం గతంలో రాజకీయ సభలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు అది సినీ పరిశ్రమలో వేళ్లూనుకుంది.

  ఈ ఈవెంట్లను విజయవంతం చేయడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ సభల్లో ఒకరినొకరు పొగుడుకోవడం జనాలకు ఓ వేడుక మాదిరిగా మారిపోయింది.  ప్రచార కార్యక్రమాలలో తమ అభిమాన నటులను చూడటానికి బలహీనతలు ఉన్న జనం ఎగబడటం సహజం. ఈ కార్యక్రమాల్లో వ్యక్తులు సినీ హీరోని దేవుని మాదిరిగా చూస్తారు. బాబు అన్న పదం లేకుండా మాట్లాడలేని పరిస్థితిని ఏర్పరుస్తారు. ఈ హీరో ఆరాధన భ్రమలో చిక్కుకున్న అభిమానులు తమ హీరోలపట్ల దైవభక్తిని ప్రదర్శిస్తారు. 

తెలంగాణలో తక్కువే అయినా..

తెలంగాణలో కుల రాజకీయాలు తక్కువ. ఆవిధంగా అభిమానించడం కూడా తక్కువ. సినిమా పరిశ్రమలో నెలకొన్న కులాభిమానం మెల్లగా తెలంగాణకి కూడా పాకుతున్నట్టు అనిపిస్తున్నది. తెలంగాణలో సమాంతర చిత్రాలు వచ్చాయి. ఇక్కడి దర్శక, నిర్మాతలు అలాంటి చిత్రాలనే నిర్మించారు. ఎన్నికల్లో ఖర్చులు పెరిగిపోయి ఎన్నికల్లో నిలబడటం అనేది ఓ మోస్తరు వ్యక్తికి కనిపించని దూరంలోకి వెళ్లిపోయింది.

ఇప్పడు ఈ భారీ సినిమాల వల్ల కూడా సమాంతర చిత్రాలు రాని పరిస్థితి ఏర్పడింది. బి. నరసింగరావు మార్గంలో జనం ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ భారీ సినిమాలు. భారీ సినిమాలు తీసి ఆ సినిమా విజయవంతం అవుతుందో లేదో తెలియదు. అందుకని వారం రోజుల్లోనే ఆ డబ్బులను ప్రజల నుంచి రాబట్టడానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్లి టికెట్​ ధరను విపరీతంగా పెంచడానికి అనుమతులను సంపాదిస్తారు. సినీ పరిశ్రమని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఈ అనుమతులను ఇస్తున్నట్టు అనిపిస్తున్నది. ఫలితంగా పూట గడవని వ్యక్తులు సినీమాయలో పడి ఉన్న డబ్బులు ఖర్చుపెట్టుకుని సినిమాలు చూస్తున్నారు. ఒక్కోసారి  ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. 

సామాజిక బాధ్యత ఆశించడం దురాశే

తమ అభిమాన హీరో సినిమా మొదటిరోజే చూడాలన్న కోరికను ఈ ప్రచారాలు సృష్టిస్తాయి. దాన్ని  ప్రతిష్టాత్మకంగా అభిమానులు తీసుకుంటారు. ఆ డబ్బులు సంపాదించడానికి వాళ్లు నేరాలు కూడా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఏర్పడిందేమో తెలియదు. సంధ్య థియేటర్​ ఉదంతం వల్ల ప్రజల మనోగతం దెబ్బతిన్నది. చాలా వ్యవస్థల తీరుతెన్నులు ప్రజలకు అర్థమవుతున్నాయి. నటీనటులు తమ సామాజిక భాధ్యతని నిర్వహించాలని ఆశించడం దురాశే అవుతుంది. కానీ, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆశిస్తాం. వాళ్లని ఐదుసంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటాం.  సినిమా కలిగించే దుష్పరిణామాలను నిలువరించే బాధ్యత పాలకుల మీద ఉంది. 

చివరగా..

సినీహీరోల పట్ల ఉండే దేవతాస్థితిని తగ్గించే ప్రయత్నం అందరూ చేయాలి. మరీ ముఖ్యంగా పాలకులు. సంధ్య థియేటర్​ ఉదంతం సినీ పరిశ్రమలోని అహంకారాన్ని, కపటత్వాన్ని బయటపరిచింది. వాళ్ల మాటలు, వాళ్ల నిజస్వరూపాన్ని చూపించాయి. హీరో ఆరాధనను  నిరుత్సాహపరచాలి.  చివరగా రెండు మాటలు...శక్తిమంతమైన చిత్ర పరిశ్రమను అసెంబ్లీలో నిలదీసినందుకు సీఎం రేవంత్​ రెడ్డిని అభినందించాలి. మరో విషయం. భారతీయ నాగరిక సురక్ష సంహిత (పాత క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్)లోని సె.480, 482 ప్రకారం తమ కస్టడీలో ఉన్న వ్యక్తులకే కోర్టులు బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుంది. 

- డా. మంగారి రాజేందర్,పూర్వ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్​ అకాడమీ-