- మహారాష్ట్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా లెండి
- ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టాలని నాడు నిర్ణయం
- నిధుల కొరతతో నిలిచిన వైనం
- రెండు రాష్ర్టాలు చొరవ చూపితేనే ముందుకు
- పనులు పూర్తయితే రెండు రాష్ట్రాల్లో 49 వేల ఎకరాలకు సాగునీరు
లెండి ప్రాజెక్టును అప్పటి ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని నిర్ణయించాయి. బీడు భూముల్ని సస్యశ్యామలం చేసేందుకు 3 దశాబ్దాల క్రితం చేపట్టిన ఈ అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల పాలకులు చొరవ చూపకపోవడం, ఫండ్స్ కొరత కారణాలతో ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిపోయింది. తక్కువ ఫండ్స్వ్యయంతో సాగునీరు వచ్చే ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపి ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేయగలిగితే ఇరు రాష్ట్రాల్లో 49 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గానికి సరిహద్దున మహారాష్ట్రలోని దెగ్లూర్ ఉంది. ఈ ఏరియాలో సాగునీటి కొరత ఎక్కువ. గోదావరికి మంజీరా ఉపనది. దీనికి ఉపనదిగా లెండి ఉంది. దెగ్లూర్ తాలుకాలోని గోజెగావ్–- రావుల్గావ్ గ్రామాల మధ్య లెండి ఉపనదిపై ప్రాజెక్టు నిర్మాణానికి 1985లో శంకుస్థాపన చేశారు. మహారాష్ర్ట, అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా దీన్ని చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి. నిర్మాణ వ్యయం అప్పట్లో రూ.54.55 కోట్లు. ఇందులో 62 శాతం మహారాష్ట్ర, 38 శాతం తెలంగాణ ప్రభుత్వం భరించేలా ఒప్పందం జరిగింది.
6.36 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 49వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా అప్పట్లో ఫ్లాన్ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని జుక్కల్ నియోజర్గానికి 22 వేల ఎకరాలకు 2.43 టీఎంసీలు, మహారాష్ర్టలోని దెగ్లూర్ ఏరియాకు 27వేల ఎకరాలకు 3.93 టీఎంసీలు సాగునీరు అందుతుంది. పనులు చాలా వరకు జరిగాయి. మొత్తం 14 గేట్లలో 10 గేట్ల బిగించారు. కొంతమేర కాల్వలు కూడా తవ్వారు. భూ సేకరణ కూడా దాదాపు 90 శాతానికి పైగా జరిగింది. మన జిల్లాలోని మద్నూర్‌లో దశాబ్దాల క్రితం కొంతమేర నిర్మించిన కాల్వలు పూడుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో 25 కి.మీ. మేర కాల్వ తవ్వాల్సి ఉంది.
పెరిగిన అంచనా వ్యయం
ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి అంచనా వ్యయం పెరుగుతూ వస్తోంది. 1985లో శంకుస్థాపన జరిగినప్పుడు రూ. 45.51 కోట్లు. ఇందులో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒప్పందం మేరకు తన వాటా రూ. 9. 04 కోట్లు చెల్లించింది. క్రమంగా నిర్మాణానికి రూ.550. 61 కోట్ల ఖర్చు చేశారు. ఇప్పటి వరకు మహారాష్ర్ట రూ. 317. 79 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 232. 82 కోట్లు ఖర్చు ( ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో సహా) చేశాయి. అయినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఖర్చు చేసిన దానికి 4 రేట్లకు పైగా పెరుగుతోందని ఇరిగేషన్అధికారులు పేర్కొంటున్నారు. రాష్ర్ట విభజన తర్వాత మహారాష్ర్ట ప్రభుత్వంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పర్యాయం చర్యలు జరిపింది. అప్పట్లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న టంకశాల అశోక్ నేతృత్వంలో ఇరిగేషన్ అధికారులు మహారాష్ర్ట అధికారులతో చర్చలు జరిపారు.
Also Read : నల్గొండ జిల్లాలో సాగు, తాగునీటికి పెద్దపీట
ఇరు రాష్ర్టాలు చొరవ చూపితేనే..
లెండి ప్రాజెక్టు పనులు కంప్లీట్ కావటానికి మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాలు చొరవ చూపాల్సి ఉంది. నిర్మాణానికి ప్రధాన సమస్యగా ఉన్న ఫండ్స్ కేటాయింపు, మిగిలిన కొంత భూ సేకరణ వంటి సమస్యలు అధిగమించాలంటే దీనిపై ఉన్నత స్థాయి చర్చ అవరసరముంది. ఇటీవల కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గానికి ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. అంతర్ స్టేట్ లెండి ప్రాజెక్టు సమస్యను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయితే 3 మండలాల్లోని 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. వెనుకబడిన తమ ఏరియా వ్యవసాయలో అభివృద్ధి చెందుతుందన్నారు. మహారాష్ర్ట ఇరిగేషన్ అధికారులతో చర్చలు జపిగే విషయంపై తాను చొరవ తీసుకుంటానని మంత్రి స్పష్టం చేశారు. అవసరమయితే అక్కడకు వెళ్లడమా, లేదా వారిని ఇక్కడకు ఆహ్వానించి ప్రాజెక్టు నిర్మాణం వివరాలు తెలుసుకుని ముందుకెళ్తామన్నారు. తక్కువ వ్యయంతో పనులు జరిగి ఆయాకట్టుకు సాగు నీరు అందే ప్రాజెక్టు పనులకు ప్రయార్టీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.