సమాజ సేవలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకం

  • శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : సమాజ సేవలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని బండారు గార్డెన్​లో ఆర్యవైశ్యుల సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగుచోట్ల మున్సిపల్ చైర్మన్లుగా ఆర్యవైశ్యులే ఉన్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై సేవ చేసేవారికి సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. 

నల్గొండలో ఉన్న ఆర్యవైశ్యుల సంఘం పాత భవనాన్ని పూర్తిగా బాగు చేయాలని, నూతన భవన స్థలం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో దేవరకొండ ఆర్యవైశ్యుల సంఘం చేస్తున్న అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని నూతనంగా ఎన్నికైన సభ్యులు పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 

జిల్లాలోని అన్ని మండలాల్లో నూతన కమిటీలు వేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద, జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యానరసింహ, మాజీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులు తెలుకుంట్ల చంద్రశేఖర్, లక్ష్మిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.