నేను బీఆర్ఎస్ మండలి చైర్మన్​ను కాదు

  • ఈ కుర్చీకి ఏ పార్టీతో సంబంధం ఉండదు : గుత్తా
  • ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గత సర్కార్ ఏం చేసింది? 
  • అధికారం కోల్పోగానే అధికారులను బెదిరిస్తారా?
  • మూసీపై డీపీఆర్​ రాకముందే ఆరోపణలా? అని కామెంట్​

హైదరాబాద్, వెలుగు :  తాను బీఆర్ఎస్ మండలి చైర్మన్​ను కాదని, ఈ కుర్చీకి ఏ పార్టీతో సంబంధం ఉండదని శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి అన్నారు.  శాసన మండలి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదని చురకలంటించారు. నేడు ఉద్యోగ నియామకాల మీద మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు..  వారి హయాంలో ఏంచేశారో చెప్పాలని అన్నారు.  

బుధవారం శాసన మండలిలో చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోగానే అధికారులను బెదిరిస్తున్నారని, ఇది సరైంది కాదని తెలిపారు. అధికారులు పర్మినెంట్​ అని, రాజకీయ నాయకులు టెంపరరీ మాత్రమేనని అన్నారు. రాజకీయ నాయకుల లోపాలు అధికారులకు బాగా తెలుసని చెప్పారు. 

బీఆర్ఎస్ ​నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి

మూసీపై డీపీఆర్ రాకముందే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం సరి కాదని గుత్తా సుఖేందర్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక పని చేస్తుందంటే అందులో ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దని సూచించారు. మూసీ ప్రక్షాళన కూడా అంతేనని స్పష్టం చేశారు. మురికికూపంలో నివసించే వారిని మంచి ప్రదేశాల్లోకి తరలించడం మంచి పరిణామమని తెలిపారు. హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్లు పడిపోయాయి.. కానీ, ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నదని చెప్పారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై  బీఆర్ఎస్ నేతలు మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులు వాడుతున్న భాష సరిగ్గా లేదని అన్నారు. ప్రభుత్వ అవకతవకలపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నించాలి.. కానీ, వ్యక్తిగత విమర్శలు సరికాదని చెప్పారు. ఆర్థిక వనరులు ఉన్నా..  లేకపోయినా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నదని తెలిపారు. 

అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చు పెంచాయని, దీనికి అందరూ బాధ్యులేనని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో అంతగా ఆదరణ ఉండబోదని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై స్పందిస్తూ...88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేసీఆర్ పూర్తిస్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు.